వైఎస్‌‘ఆర్టీసీ’!

అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా సిద్ధం సభకు బస్సులు కావాలంటే.. ఆర్టీసీ పూర్తి సొమ్ము కూడా అడక్కుండా 13 జిల్లాల నుంచి 3వేల బస్సుల్ని కేటాయించింది.

Updated : 01 Mar 2024 08:55 IST

సొంత ఆస్తిలా వైకాపా వినియోగం
రాప్తాడు ‘సిద్ధం’ సభకు 3 వేల బస్సులు.. తాడేపల్లిగూడెం ‘జెండా’ సభకు నో బస్‌
ముఖ్యమంత్రి వస్తున్నారంటే.. పల్లె బస్సుకు బ్రేక్‌
అధికార పార్టీ సేవలో ఎండీ సహా అధికారులు
అద్దెలూ గట్టిగా అడగలేని దైన్యం
ముందే అద్దె చెల్లిస్తామన్నా.. ప్రతిపక్షాలకు ఒక్క బస్సూ ఇవ్వరు
ఈనాడు, అమరావతి

అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా సిద్ధం సభకు బస్సులు కావాలంటే.. ఆర్టీసీ పూర్తి సొమ్ము కూడా అడక్కుండా 13 జిల్లాల నుంచి 3వేల బస్సుల్ని కేటాయించింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో త్వరలో జరిగే సభకు కూడా మొత్తం పది వేల బస్సులూ ఇచ్చేస్తాం, అవసరమైతే ఆర్టీసీకి సెలవులు ప్రకటించేందుకు ‘సిద్ధం’ అంటోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ‘జెండా’ సభకు 150 బస్సులు కావాలని, వాటికి ముందే సొమ్ము చెల్లిస్తామని చెప్పినా కూడా నో బస్‌! ప్రైవేటు వాహనాలు, పాఠశాల బస్సుల్నీ సిద్ధం సభకు తరలిస్తూ తరిస్తున్న రవాణా శాఖ.. ప్రతిపక్ష పార్టీల సభలకు వెళ్లే వాహనాలపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతోంది.

పీఎస్‌ఆర్‌టీసీ కాస్తా.. వైఎస్‌ఆర్‌టీసీగా మారిపోయింది. వైకాపా ఇంటి సంస్థలా, జగన్‌ సొంత ఆస్తిలా తయారైంది. ప్రయాణికుల అవసరాల కంటే ముఖ్యమంత్రి సభలు, సమావేశాలకు బస్సులివ్వడమే ప్రాధాన్యంగా భావిస్తోంది. సీఎం సభ ఉందంటే ఆ చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం మానుకోవాల్సిందే. రాష్ట్రానికో రాజప్రాసాదం, బయటకెళ్లాలంటే వాహనాల వరుస, భద్రతకు ముప్పు పేరుతో రెండు హెలికాప్టర్లు సమకూర్చుకుని ఆకాశయానం చేసే జగన్‌.. సామాన్య జనానికి ఒకే ఒక్క ప్రయాణ సాధనమైన ఆర్టీసీ బస్సునూ అందకుండా చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు, వైకాపా బహిరంగ సభలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని ప్రదర్శించుకునేందుకు ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ.. పేద, మధ్యతరగతి వర్గాలకు బస్సు ప్రయాణం మరింత దుర్లభంగా మారుతోంది. అవసరమైతే పెళ్లిళ్లకు కేటాయించిన వాటిని, పండగలకు పెట్టిన ప్రత్యేక బస్సుల్నీ అర్ధంతరంగా రద్దు చేసి మరీ సీఎం సభలకు మళ్లిస్తున్నారు. ఒక డిపోలో ఉండే మొత్తం బస్సుల్లో 80% వరకు తరలిస్తున్నారు. చివరకు తిరుమల ఘాట్‌ రోడ్డులో తిరిగే బస్సుల్నీ వదలడం లేదు. దీంతో ఆర్టీసీ బస్సునే నమ్ముకున్న బడిపిల్లలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం తమ భద్రతకు భరోసాగా భావించే మహిళలు, పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులు, ఉపాధి బాటలో రోజూ పట్టణాలకు వెళ్లే కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకూ ఇబ్బందులు తప్పడం లేదు.


ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హయాంలో.. ఎన్నడూ లేని అపఖ్యాతి

ఎండీ ద్వారకా తిరుమలరావు హయాంలో.. దేశంలో మరెక్కడా లేనంత అపఖ్యాతిని ఆర్టీసీ మూటగట్టుకుంటోంది. సుఖవంతమైన, సురక్షిత ప్రయాణం అనే బాధ్యతను ఆర్టీసీ పూర్తిగా పక్కన పెట్టేసింంది. ‘వైకాపా సేవలో ఆర్టీసీ’ అనే కొత్త నినాదం ఆయన హయాంలో అమలవుతోంది. అధికార పార్టీ అడిగితే.. వందలు, వేలల్లో బస్సుల్ని జిల్లాలకు జిల్లాలు దాటించి వందల కిలోమీటర్లు పంపిస్తున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఎండీకి ఆ మాత్రం బాధ్యత లేదా? సీఎంఓ చెప్పిందని మొత్తం బస్సులిచ్చేస్తారా? గతంలో ఏ ఎండీ అయినా ఇంత ఏకపక్షంగా వ్యవహరించారా? ఆయనకు వైకాపా అంటే భయమా? భక్తా? ఆర్‌ఎం, డీఎంలే ఇచ్చేస్తున్నారని, అది నా పరిధిలోని విషయం కాదని చెప్పడానికి ఎండీ ఎందుకు? రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో వైకాపా సభలు పెట్టి ఒక్కో జిల్లాలో 500 బస్సులు ఇవ్వమంటే.. అన్నీ ఇచ్చేస్తారా? అధికార పార్టీ కోసం ప్రయాణికులకు సేవలు నిలిపేస్తారా? రెండు, మూడు రోజులపాటు డిపోలు మూసేస్తారా? ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి జీతాలిచ్చేది ప్రభుత్వమా? వైకాపానా? 


70% బస్సులిచ్చేస్తే ప్రయాణికుల సంగతేంటి?

ఆర్టీసీకి ప్రయాణికులు, వారి సేవలే ముఖ్యం. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకైతే కొన్ని బస్సులు ఇవ్వవచ్చు. రాజకీయ పార్టీల సభల కంటే ప్రయాణికుల అవసరాలకే ప్రాధాన్యమివ్వాలి. అయితే ఆర్టీసీ అందుకు విరుద్ధంగా డిపోలో ఉన్న బస్సుల్లో 70% నుంచి 80% బస్సులు వైకాపా సభలకు కేటాయించేస్తోంది. వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు డిపోలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 48 ఉండగా.. అందులో 40 బస్సుల్ని సీఎం సభకు కేటాయించడమే దీనికి నిదర్శనం. 2023 అక్టోబరులో దసరా పండగకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రిజర్వేషన్‌ ద్వారా టికెట్లు కూడా అమ్మాక.. జగన్‌ పర్యటన పేరుతో రద్దు చేశారు.


‘సిద్ధం’కాదు.. ప్రయాణికులపై ‘యుద్ధం’

ఎన్నికల నేపథ్యంలో ‘సిద్ధం’ సభలు నిర్వహిస్తున్న వైకాపా సామాన్య ప్రయాణికులకు బస్సుల్ని దూరం చేసి.. వారిపై యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు ఆర్టీసీ 13 జిల్లాల్లోని 78 డిపోల నుంచి సుమారు 3వేల బస్సులను కేటాయించింది.

  • సంక్రాంతికి వచ్చి  తిరుగు ప్రయాణమయ్యే వారిని పట్టించుకోకుండా.. జనవరి 20న విజయవాడ సభకు మొత్తం 2,069 బస్సులు వినియోగించారు.
  • గతేడాది జులైలో రాజధాని ప్రాంతంలో సీఎం సభ సందర్భంగా 1,000 ఆర్టీసీ బస్సులు పంపారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపారు.

సీఎం సభ అంటే.. మూడు రోజులపాటు ప్రయాణాలు కష్టమే!

ఎక్కడైనా సీఎం సభ ఉందంటే.. రాష్ట్రంలోని సగం జిల్లాల ప్రయాణికులు మూడు రోజులపాటు ప్రయాణాలు మానుకోవాల్సిందే. సభ జరిగే రోజుతోపాటు ముందురోజు, తర్వాత రోజు అవి ఆ విధుల్లోనే ఉంటాయి. అనంతపురం జిల్లా రాప్తాడు సభకు 500 కి.మీ దూరంలో ఉన్న గుంటూరు జిల్లా నుంచి బస్సులు కేటాయించడమే దీనికి ఉదాహరణ. దీంతో సరిపడా బస్సుల్లేక 40 మంది ప్రయాణికులు కూర్చోవాల్సిన బస్సులో 80 మందిని కుక్కేస్తున్నారు. అదే సమయంలో సీఎం సభకు నలుగురైదుగురితో వెళ్లే  బస్సులు కనిపిస్తుంటాయి. ప్రభుత్వ కార్యక్రమాలైతే.. ఆయా పథకాల లబ్ధిదారుల్ని తీసుకెళ్తే సరిపోతుంది.


వైకాపా అయితే మొత్తం సొమ్ము చెల్లించక్కర్లేదా?

ఏదైనా కార్యక్రమానికి అద్దెకు బస్సు తీసుకుంటే.. మొత్తం సొమ్ము ముందే చెల్లించాలి. నిరీక్షణకు అదనంగా డబ్బు కట్టాలి. దూరప్రాంతాల ప్రయాణమైతే కిలోమీటర్ల లెక్కన, దగ్గరయితే రోజువారీ అద్దె ప్రాతిపదికన కేటాయిస్తారు. దూరాన్నిబట్టి కిలోమీటరుకు రూ.45 నుంచి రూ.52 వరకు వసూలు చేస్తారు. వైకాపా అద్దె మొత్తం ముందే చెల్లించకపోయినా బస్సులు పంపిస్తున్నారు. రాప్తాడు సిద్ధం సభకు 3 వేల బస్సులకు రూ.8.9 కోట్ల అద్దె నిర్ణయించగా రూ.5.5 కోట్లు మాత్రమే చెల్లించారు. భీమిలి సభకు 850, దెందులూరు సభకు 1,350 బస్సులు వినియోగించగా ఇంకా రూ.30 లక్షల వరకు బకాయిలున్నాయి.


నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే ఇదా?

ఆర్టీసీ ప్రయాణికుల్లో అత్యధికం పేద, మధ్యతరగతి వర్గాలవారే. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణానికి వెళ్లాలన్నా పొద్దున్నే ఆర్టీసీ బస్సుల్నే ఆశ్రయిస్తారు. సమయానికి బస్సు అందుకోకపోతే.. బడికి వెళ్లలేమని విద్యార్థుల ఆందోళన అంతా ఇంతా కాదు. చిరుద్యోగులు, చిరువ్యాపారులు సహా ఎంతోమంది వీటిలోనే ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సు రాకపోతే ప్రయాణాలే మానుకోవాల్సిన పరిస్థితి అధిక శాతం పల్లెల్లో ఉంది. మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని నమ్ముతారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రయాణికులకు ఇవే ఆధారం. కానీ వీరందరినీ ఇబ్బంది పెడుతున్నారు.


ప్రతిపక్ష పార్టీలకు బస్సులివ్వకూడదనేది.. ఆర్టీసీ విధానమా?

అధికార పార్టీ సభలకే బస్సులిస్తామనేలా ఆర్టీసీ తయారైంది. గతేడాది డిసెంబరు 20న విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగే ‘యువగళం-నవశకం’ సభకు బస్సులు కావాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. ముందుగానే సొమ్ము చెల్లిస్తామన్నా.. ఒక్క బస్సూ ఇవ్వలేదు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన తెదేపా-జనసేన బహిరంగ సభకు 150 బస్సులు కావాలని కోరినా ఒక్క బస్సునూ కేటాయించలేదు. ‘అధికార వైకాపా సేవకే ఆర్టీసీ’ అనేందుకు ఇంతకంటే ఉదాహరణ కావాలా? రాబోయే రోజుల్లో.. వైకాపా కార్యకర్తలు, నేతలకే ఆర్టీసీ ప్రయాణం, ఇతరులెవరూ బస్సులెక్కొద్దని ఆదేశాలూ ఇస్తారేమో?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని