ఏపీలో పెరిగిన చిరుతల సంఖ్య

దేశవ్యాప్తంగా 13,874 చిరుతలున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ గురువారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

Published : 01 Mar 2024 05:22 IST

సాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌లో అత్యధికం
కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా 13,874 చిరుతలున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ గురువారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 569, తెలంగాణలో 297 చొప్పున ఉన్నాయి. 2018 లెక్కలతో పోలిస్తే ఏపీలో చిరుతల సంఖ్య 15.65 శాతం పెరగ్గా, తెలంగాణలో 11.07 శాతం తగ్గింది. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ, వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘ఐదో చిరుత పులుల జనాభా నివేదిక’ ప్రకారం దేశంలో వీటి సంఖ్య కనిష్ఠంగా 12,616 నుంచి గరిష్ఠంగా 15,132 వరకు ఉన్నట్లు అంచనా. దీంతో సగటు సంఖ్య 13,874గా నివేదిక పేర్కొంది. 2018లో ఉన్న 12,852 చిరుతలతో పోలిస్తే 2022 నాటికి వాటి సంఖ్య 7.95 శాతం పెరిగింది. దేశంలో 70 శాతం చిరుతలు హిమాలయాలు, పాక్షిక వర్షాభావ ప్రాంతాల్లోనే నివసిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 3,907 చిరుతలున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1,985), కర్ణాటక (1,879), తమిళనాడు (1,070) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్‌- శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (270), మధ్యప్రదేశ్‌లోని పన్నా (256), సాత్పుర (215) ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తున్నాయి. తెలంగాణలోని ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 121, కవ్వాల్‌లో 19 చిరుత పులులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. నాగార్జునసాగర్‌- శ్రీశైలం ప్రాంతంలో 360 చిరుతలు సంచరిస్తుండగా, ఆమ్రాబాద్‌లో 173, కవ్వాల్‌లో 25 చొప్పున ఉన్నాయి. వీటి జనాభాను అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పరిశీలించారు. 6.41 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో చిరుతల పాదముద్రలు, 32,803 ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలు, 4.70 కోట్ల ఫొటోలను శోధించారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో వీటి సంతతి పెరగ్గా.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణల్లో తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని