Kakinada: పింఛను సొమ్ముతోనూ వైకాపా ఓట్ల వేట

ప్రభుత్వ పథకాల లబ్ధిని వాలంటీర్ల సహకారంతో అందజేస్తూ వైకాపా నాయకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కాకినాడలో ఏకంగా సీఎం జగన్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చిత్రాలతో పింఛను పంపిణీ చేస్తున్నారు.

Updated : 02 Mar 2024 07:22 IST

వైకాపా నాయకులతో కలిసి పంపిణీ చేస్తున్న వాలంటీర్లు

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే అనంతపురం, పెంటపాడు, ఉంగుటూరు: ప్రభుత్వ పథకాల లబ్ధిని వాలంటీర్ల సహకారంతో అందజేస్తూ వైకాపా నాయకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కాకినాడలో ఏకంగా సీఎం జగన్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చిత్రాలతో పింఛను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ‘వైఎస్సార్‌ పింఛను కానుక’ సొమ్మును కవర్లలో పెట్టి వాలంటీర్లతో కలిసి డివిజన్లలో వైకాపా ముఖ్య నాయకులు పంచారు. ‘నేను చెప్పా.. నేను చేశా.. ఇకపై మీ పింఛను నెలకు రూ.3 వేలు’ అని పేర్కొంటూ సీఎం జగన్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి కలిసి తీసుకున్న ఫొటో, కింద వారిద్దరీ పేర్లున్న స్టిక్కర్లు కవర్లపై ఉన్నాయి. అనంతపురం రూరల్‌ రుద్రంపేట పంచాయతీ పరిధిలోని పంతుల కాలనీలో సచివాలయ కన్వీనర్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ రాజునాయక్‌, వార్డు సభ్యురాలు సుభద్రమ్మ, వాలంటీరు నాగార్జునతో కలిసి 15 మందికి నిబంధనలకు విరుద్ధంగా పింఛను పంపిణీ చేశారు.

తెదేపా-జనసేన సభకు వెళ్లారని పింఛను నిలిపివేత: ప్రత్తిపాడులో నిర్వహించిన తెదేపా-జనసేన సభకు వెళ్లారనే అక్కసుతో ఇద్దరికి పింఛను నిలిపేయాలంటూ ఎంపీటీసీ-2 సభ్యుడు రెడ్డి సూరిబాబు సూచించారని లబ్ధిదారులు వాపోతున్నారు. సభకు ఎస్‌.దుర్గ, కసిరెడ్డి సరోజని (పెంటపాడు) వెళ్లారు. వీరికి ఈ నెల పింఛను రాకపోవడంతో వాలంటీరును ప్రశ్నించగా.. ఎంపీటీసీ సభ్యుడిని కలవమని సూచించారు. వారు ఆయనకు విన్నవిస్తే... ‘మీరు తెదేపా-జనసేన సభకు వెళ్లినందున పింఛను ఆగి ఉంటుంది’అని తెలిపారు. అనంతరం తెదేపా నాయకులకూ తెలియజేయడంతో మాట్లాడి పింఛను ఇప్పించారు.

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో 50 కుటుంబాలకు సంబంధించిన వాలంటీర్ల వాట్సప్‌ గ్రూపుల్లో వైకాపా యువజన విభాగం మండలాధ్యక్షుడిని చేర్చాలని.. సీఎం జగన్‌, స్థానిక ఎమ్మెల్యే వాసుబాబుకు అనుకూలంగా పోస్టులు పెట్టాలని పార్టీ నాయకులు హుకుం జారీ చేశారు. గ్రూపుల్లోని తెదేపా-జనసేన కార్యకర్తలను తొలగించాలని సూచనలిచ్చారు. ‘చంద్రబాబు వస్తే వృద్ధాప్య పింఛనుకు గండి’ పేరుతో అసత్య ప్రచారానికి తెర తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని