అమెరికా అంటివి.. అటకెక్కిస్తివి!

ఈవీల వినియోగంలో ఆంధ్రాని అమెరికాలా మార్చేస్తాం.. ఆదర్శమంటోన్న తమిళనాడుకు మించిన పాలసీ తెస్తాం.. ఉద్యోగులకు ఐదు లక్షల రాయితీ వాహనాలు అందిస్తాం... ఇలా ఎన్నెన్నో భ్రమలు కల్పించింది జగన్‌ సర్కారు.

Updated : 02 Mar 2024 08:46 IST

జగనన్నా.. ఈవీలకు ప్రోత్సాహకాలేవీ?
10 లక్షల వాహనాల లక్ష్యం.. ఉన్నవి 70 వేలే!
పాలసీ గడువు ముగిసినా.. కొత్తది తేలేదు
మౌలిక సదుపాయాల కల్పనలో వెనకబాటు
ఈనాడు, అమరావతి

ఈవీల వినియోగంలో ఆంధ్రాని అమెరికాలా మార్చేస్తాం.. ఆదర్శమంటోన్న తమిళనాడుకు మించిన పాలసీ తెస్తాం.. ఉద్యోగులకు ఐదు లక్షల రాయితీ వాహనాలు అందిస్తాం... ఇలా ఎన్నెన్నో భ్రమలు కల్పించింది జగన్‌ సర్కారు. కానీ అందులో ఏ ఒక్కటీ అమలు కాలేదు. మాటలు కోటలు దాటినా.. ఈవీలు లక్ష కూడా దాటలేదు!

విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని వచ్చే పదేళ్లలో 10.56 లక్షలకు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? వాటిని ప్రోత్సహించేలా అవసరమైన ఛార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తేవడం ఐదేళ్లలో చేతకాలేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 2018-23 ఈవీ పాలసీ గడువు ముగిసి ఏడాది కావొస్తున్నా.. ఇప్పటికీ కొత్త పాలసీని రూపొందించలేదు. రాష్ట్రంలో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంపై జగన్‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

కాలుష్య నియంత్రణ, ఇంధన వినియోగం ద్వారా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోడానికి విద్యుత్‌ వాహనాల (ఈవీ) వాడకం ప్రత్యామ్నాయంగా మారింది. ఆ మేరకు రాష్ట్రంలో ఈవీలను పెంచాలన్నది జగన్‌ ప్రభుత్వ లక్ష్యం. అందుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామనీ, ఉద్యోగులకు దశల వారీగా 5 లక్షల ద్విచక్ర వాహనాలను అందిస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది. వాటివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారమేమీ లేదు. ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి.. వాటి ద్వారా సేవలు అందుబాటులోకి తెచ్చేలా సమన్వయం చేయాలి. ఈ మాత్రం కూడా ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. 2034 నాటికి 10.56 లక్షల విద్యుత్‌ వాహనాలు రోడ్లపై పరుగులు పెట్టాలని జగన్‌ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల సంఖ్య సుమారు 70 వేలు(6.68 శాతం) మాత్రమే. అంటే వచ్చే పదేళ్లలో 9.86 లక్షల వాహనాలు అందుబాటులోకి రావాలి. ఏడాదికి కనీసం లక్ష కొత్త ఈవీలు రోడ్డెక్కాలి. కానీ ఆ సూచనలే కనిపించడంలేదు.

ఇదో ‘విఫల’ ప్రచారం

ఆటోమొబైల్‌ రాజధాని అమెరికాలోని డెట్రాయిట్‌ తరహాలో ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) వినియోగంలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. ఈవీల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేస్తాం. తమిళనాడు భారీ రాయితీలతో నూతన ఈవీ పాలసీ విడుదల చేసింది.. దాని కంటే ఆకర్షణీయంగా పాలసీ తయారు చేస్తాం.. జగన్‌ ప్రభుత్వం చెప్పిన మాటలు ఇవి. కానీ ఇవేవీ వాస్తవరూపం దాల్చలేదు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా.. జాతీయ రహదారుల వెంబడి ప్రతి 25 కి.మీ.కు, నగర పరిధిలో 3 కి.మీ.కు ఒక ఛార్జింగ్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలనుకున్నారు. దీనికోసం 4 వేల లొకేషన్లను గుర్తించినట్టు ప్రభుత్వం చెప్పింది. నోడల్‌ ఏజెన్సీగా నియమించిన నెడ్‌క్యాప్‌.. వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈవీల సంఖ్య తక్కువగా ఉండటంవల్ల గిట్టబాటు కాదని సంస్థలు వెనకంజ వేస్తున్నాయి. దీంతో జాతీయరహదారి వెంబడి 450 చోట్ల కార్లు, బస్సుల ఛార్జింగ్‌ కేంద్రాలను తేవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. తప్పని పరిస్థితుల్లో వాహన విక్రయాలు పెంచుకోవడానికి టాటా సంస్థ 150 చోట్ల ఛార్జింగ్‌ కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేసుకుంది. అక్కడక్కడా ప్రైవేటు కంపెనీలు, వ్యక్తిగతంగా ఇళ్లలో ఛార్జింగ్‌ కోసం నెడ్‌క్యాప్‌ నుంచి ఛార్జింగ్‌ కేంద్రాలకు అనుమతి కోసం 294 దరఖాస్తులు వచ్చాయి.

ఆర్టీసీలోనూ సాధ్యం కాలేదు

ఆర్టీసీలో అద్దె ప్రాతిపాదికన తిరుపతి, విజయవాడ, గుంటూరు, కాకినాడల్లో 350 విద్యుత్‌ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ నిర్దేశించిన ధరకు బస్సులు నడిపేందుకు తిరుపతిలో మాత్రమే గుత్తేదారు ముందుకు రాగా, 100 విద్యుత్‌ బస్సులను నడపుతున్నారు. మిగిలిన చోట్ల గుత్తేదారు సంస్థ నిర్దేశించిన ధరలు ఎక్కువగా ఉన్నాయని విద్యుత్‌ బస్సులు నడపడానికి అధికారులు అంగీకరించలేదు.

ఉద్యోగులకు ఏడాదిలో లక్ష విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం 2021 జులైలో ఉత్తర్వులు ఇచ్చింది. దశల వారీగా 5 లక్షల వాహనాలు ఇవ్వాలని భావించింది. పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను నెడ్‌క్యాప్‌కు అందించింది. ప్రతి నెలా పెట్రోలుకు చేసే ఖర్చుతో వాయిదా మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు ఉంటుందని ప్రచారం చేసింది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేలా బ్యాంకర్లు, సమన్వయం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఇంత చేసినా ప్రభుత్వం ఇచ్చిన ద్విచక్ర వాహనాలు ఎన్నో తెలుసా? కేవలం వంద.

కంపెనీలు తిరిగి చూస్తే ఒట్టు

రాష్ట్రంలో రూ.1,750 కోట్లతో విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ తయారీ యూనిట్‌తోపాటు బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కైనెటిక్‌ సంస్థ ప్రతినిధులు 2021 సెప్టెంబరులో సీఎం జగన్‌ను కలిసి చెప్పారు. మూడేళ్లు గడచినా ఆ సంస్థ ఇప్పటి వరకు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు.


ఇచ్చే రాయితీ ఊడగొట్టేస్తుందా?

విద్యుత్‌ ఛార్జింగ్‌ కేంద్రాల్లో యూనిట్‌కు   రూ.6.70 వంతున ప్రభుత్వం వసూలు చేస్తోంది. అందులో 10 శాతాన్ని నిర్వాహకులకు రాయితీగా ఇస్తోంది. 2024-25 నుంచి ఆ రాయితీ మొత్తాన్ని ఉపసంహరించాలని డిస్కంలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. యూనిట్‌కు రూ.20 చొప్పున వసూలు చేసుకోవచ్చని ఛార్జింగ్‌ కేంద్రాల నిర్వాహకులకు నెడ్‌క్యాప్‌ అనుమతించింది. ప్రస్తుతం యూనిట్‌కు వివిధ రూపాల్లో సగటున రూ.13 వరకు వారికి ఖర్చు అవుతోంది. ఒకవేళ సర్కారు రాయితీని ఎత్తివేస్తే.. ఛార్జింగ్‌ కేంద్రాల ఆదాయం తగ్గి, భవిష్యత్తులో ఆ భారం వినియోగదారులపై పడే ప్రమాదం ఉంది.


మౌలిక సదుపాయాలు కరవు

  • విశాఖ, విజయవాడ నగరాల్లో పవర్‌ గ్రిడ్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి జపాన్‌ బ్యాంకు ఆసక్తి చూపుతోందని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది.
  • ఆర్టీసీ బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, ప్రైవేటు స్థలాల్లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు హడావుడి చేశారు.
  • విద్యుత్‌ వాహనాలు, విడిభాగాలను పరీక్షించేందుకు ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సంస్థ సహకారంతో రూ.250 కోట్లతో వాహనాలను పరీక్షించే టెస్టింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
  • విజయవాడలో బ్యాటరీ స్వాపింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేదు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షల పెట్టుబడి అవసరం. దీంతో ఏ సంస్థా ముందుకు రాలేదు.
  • విజయవాడ, విశాఖ, తిరుపతిలలో ఆటోలకు రెట్రోఫిట్‌ ఎలక్ట్రిక్‌ కిట్లను అమర్చి.. విద్యుత్‌ వాహనాలుగా మార్చే ప్రాజెక్టు చేపడతామని.. అమలులో విఫలమైంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని