కలరా కలకలం

గుంటూరులో మూడు కలరా కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా వైకాపా ప్రభుత్వం తొక్కేసింది. కలరా మహమ్మారి గురించి దాదాపుగా అందరూ మర్చిపోయిన తరుణంలో.. ఈ కేసులు బయటపడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Published : 02 Mar 2024 05:21 IST

గుంటూరులో ముగ్గురికి సోకినట్లు గుర్తింపు
కలుషిత నీటిని తాగడమే కారణం!
మురికిగుంటల్లో మంచినీటి పైపులు
రిపోర్టులను గుట్టుగా ఉంచిన వైకాపా సర్కారు

ఈనాడు, అమరావతి: గుంటూరులో మూడు కలరా కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా వైకాపా ప్రభుత్వం తొక్కేసింది. కలరా మహమ్మారి గురించి దాదాపుగా అందరూ మర్చిపోయిన తరుణంలో.. ఈ కేసులు బయటపడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు. వందల మంది చికిత్స పొందారు. ఫిబ్రవరి 10-24 తేదీల మధ్య గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 345 మల నమూనాలను పరీక్షిస్తే... మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా (బ్యాక్టీరియా) కేసు బయటపడ్డాయి. కలరా సోకిన వారు ముగ్గురూ వాంతులు, విరేచనాలతో గత నెల 10 తర్వాత చికిత్స కోసం చేరారు. అందరి నమూనాలను పరీక్షిస్తున్న తరుణంలోనే.. ముగ్గురికి గంజినీళ్లలా విరేచనాలు అవుతుండటంతో అనుమానించి వారి నమూనాలను కల్చర్‌ టెస్ట్‌ చేయించారు. దాంతో వీరికి కలరా ఉన్నట్లు తేలింది. వీరు కోలుకోవడానికి 20 రోజుల సమయం పట్టింది. కలుషిత నీటి వల్లే ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి. గుంటూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మురుగు నీటిలోనే మంచినీటి పైపులు ఉంటున్నాయి. అవి పగిలినప్పుడు మురుగునీరు మంచినీటితో కలిసి పైపుల్లో సరఫరా అవుతోంది. అదే అనారోగ్యాలకు కారణమవుతోంది.

కలరా, ఈ-కోలి, షగెలా బ్యాక్టీరియా కేసులు

విబ్రియో కలరా సోకినవారికి తీవ్రస్థాయిలో విరేచనాలు అయ్యి, బాగా నీరసిస్తారు. కలుషిత నీరు తాగినా, కలుషిత నీటితో కడిగిన కాయగూరలను శుభ్రంచేసి తిన్నా విబ్రియో కలరా బారినపడే ప్రమాదం ఉంది. ఈ-కోలి సోకినవారికీ విరేచనాలు వస్తాయి. విబ్రియో కలరా వచ్చినవారిలో ఉన్నంత అనారోగ్య తీవ్రత ఈ-కోలిలో ఉండదు. షగెలా అనే బ్యాక్టీరియా వల్ల జిగట విరేచనాలు అవుతాయి. ఒక్కోసారి రక్త విరేచనం కూడా అవుతుంది. విందుల్లో కలుషిత నీరు తాగినా అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఎక్కువ. 2011 నుంచి 2020 మధ్య సుమారు పది సందర్భాల్లో కలరా వెలుగుచూసిందని ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ రీసెర్చి అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌’ (2022) జర్నల్‌లో తెలిపారు.

ప్రజారోగ్యంతో చెలగాటం

గుంటూరు నగర ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. తాగునీరు అందించే విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించింది. పర్యవసానంగా కలుషిత జలాలు కాటేసి గత నెలలో నలుగురు చనిపోగా వందలమంది అనారోగ్యం పాలయ్యారు. వీరిలో సగం మందికిపైగా గుంటూరు శారదా కాలనీ, శ్రీనగర్‌ ప్రాంతాల్లోనే ఉన్నారు. ఆ ప్రాంతాల్లో తాగునీటి పైపులు శిథిలావస్థలో ఉన్నా.. వాటి నిర్వహణను నగరపాలక విస్మరించింది. గతంలోనే ఈ విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా యంత్రాంగానికి పట్టలేదు. అప్పుడే మేల్కొని ఉంటే... నలుగురు మరణించేవారు కారు, వందల మంది ఆసుపత్రుల పాలయ్యేవారు కారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిలో సరిపడా క్లోరిన్‌, ఆమ్ల శాతాలు ఉండట్లేదని, దీనివల్ల నీటి నాణ్యత దెబ్బతింటోందని తేలింది. మంచినీటి పైపులు ఇప్పటికీ కొన్నిచోట్ల మురుగునీటి గుంటల్లోనే ఉన్నాయి. పైపులు శిథిలావస్థకు చేరుకోవడంతో మురుగునీరు వాటిలోకి పోతోంది. ఈ నీటినే స్థానికులు తాగి... అనారోగ్యం పాలవుతున్నారు. సంఘటనలు జరిగినప్పుడు ఉద్యోగులను సస్పెండ్‌ చేయడమే కాదు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని, అప్పుడే కలరా లాంటి మహమ్మారులు విజృంభించకుండా ఉంటాయని గుంటూరు నగరవాసులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని