ఆయనో ప్రధాన అనకొండ!

ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నేతలు చేస్తున్న అక్రమాల్ని, అడ్డగోలు దోపిడీని చూసి ఆ అత్యున్నతాధికారి కూడా స్ఫూర్తి పొందినట్టున్నారు! ఇప్పటికే పుత్రరత్నం కోసం పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌ వ్యవహారాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. ఇటీవల విశాఖ చుట్టుపక్కల పేదల ఎసైన్డ్‌ భూములను అనకొండలా మింగేశారు.

Updated : 02 Mar 2024 06:57 IST

విశాఖ చుట్టుపక్కల ఓ అత్యున్నతాధికారి భూదందా
ఎకరం రూ.30-40 లక్షల చొప్పున 200 ఎకరాలకు పైగా కొనుగోళ్లు
ఇప్పుడు ఆ భూముల విలువ రూ.2 వేల కోట్ల పైమాటే!
పేదల్ని మభ్యపెట్టి వందల ఎకరాల డి-పట్టా భూముల కొనుగోళ్లు
ఎసైన్డ్‌ భూముల డీనోటిఫికేషన్‌ నిర్ణయంలో ఆయన భాగస్వామి
అదే అధికారి రైతుల్ని మభ్యపెట్టి భూములు కొనడం ఇన్‌సైడర్‌ ట్రేడింగే
ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే- వన్‌టౌన్‌, ఆనందపురం

ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నేతలు చేస్తున్న అక్రమాల్ని, అడ్డగోలు దోపిడీని చూసి ఆ అత్యున్నతాధికారి కూడా స్ఫూర్తి పొందినట్టున్నారు! ఇప్పటికే పుత్రరత్నం కోసం పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌ వ్యవహారాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. ఇటీవల విశాఖ చుట్టుపక్కల పేదల ఎసైన్డ్‌ భూములను అనకొండలా మింగేశారు. ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతూ, వారు చెప్పినదానికల్లా తలాడించడమే ఎజెండాగా పెట్టుకున్న ఆ అధికారి... పదవీ విరమణ వయసు కూడా దగ్గరపడుతుండటంతో భారీ భూ దందాకు తెరతీశారు.  విశాఖ చుట్టుపక్కల వివిధ గ్రామాలకు చెందిన పేద రైతుల్ని మభ్యపెట్టి, భయపెట్టి వారి నుంచి వందల ఎకరాల డి-పట్టా భూముల్ని బినామీల ద్వారా చౌకగా కొనేశారు.

దేశాన్ని పాలించిన ఒక ముఖ్య నాయకుడి  పేరు పెట్టుకున్న ఆ అత్యున్నతాధికారి... ఎసైన్డ్‌ భూముల్ని నిర్దిష్ట గడువు దాటాక లబ్ధిదారులకు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో కీలక భాగస్వామి. ఆ ప్రతిపాదన చర్చల దశలో ఉండగానే ఆయన మాస్టర్‌ప్లాన్‌ వేశారు. విశాఖ నగర శివారులోని పలు గ్రామాల పేదలకు చెందిన సుమారు 200 ఎకరాలకుపైగా డి-పట్టా భూముల్ని బినామీలతో కొనిపించారు. భూముల యజమానులకు ఎకరానికి రూ.30-40 లక్షల చొప్పున ముట్టజెప్పి... తన బినామీల పేరు మీద జీపీఏ, భూ విక్రయ ఒప్పందాలు చేసుకున్నారు. ఎసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చట్టసవరణ చేయగానే.. తాను కొన్న భూములకు 22(ఎ) నుంచి వేగంగా మినహాయింపునిచ్చేలా జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అంత పెద్ద అధికారే చెప్పేసరికి జిల్లా అధికారులు ఆఘమేఘాల మీద ఆ భూముల్ని డీనోటిఫై చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్ని ఆ ఉన్నతాధికారి దర్జాగా రిజిస్ట్రేషన్‌ చేయించేసుకుంటున్నారు. పెందుర్తి, ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం మండలాల పరిధిలోని రూ.వేల కోట్ల విలువైన భూములు ఇప్పుడు ఆయన పరమవుతున్నాయి. ఆ భూముల విలువ ప్రాంతాన్ని బట్టి బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతోంది. ఒక్క ఆనందపురం మండలంలో చేతులు మారిన 200 ఎకరాల విలువే రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆ అధికారి బినామీలకు భూములు అమ్ముకున్న పేద రైతుల్లో  ఎక్కువ మంది బీసీ, ఎస్సీలే.


ఇది కదా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌!

విశాఖలోని అత్యంత విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములపై కన్నేసిన వైకాపా ముఖ్య నేతలు... ఈ అయిదేళ్లలో విచ్చలవిడిగా దోపిడీపర్వం కొనసాగించారు. అయిదేళ్లు అధికారంలో ఉండే నాయకులే రూ.వేల కోట్ల విలువైన భూముల్ని మడతెట్టేస్తుంటే... 34 ఏళ్లపాటు సర్వీసులో ఉండే మనం ఇంకెంత దందాలు చేయాలా? అని ఆ అత్యున్నతాధికారి ఆలోచించారు. ప్రభుత్వ పెద్దలు విశాఖ నగరంలోని దసపల్లా, ఎన్‌సీసీ, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో వంటి అత్యంత విలువైన భూముల్ని స్వాహా చేసేస్తే... ఆ ఉన్నతాధికారి వారికేమీ తీసిపోని విధంగా విశాఖ చుట్టుపక్కలున్న పేదల భూములపై కన్నేశారు. జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి నుంచి వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నత స్థానానికి చేరుకున్న ఆ అధికారికి రెవెన్యూ వ్యవహారాల్లోని మతలబులన్నీ కొట్టిన పిండి. డి-పట్టా భూముల్ని క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం... పేదలకు తెలియకముందే వారి భూములు కొట్టేసి రూ.కోట్లలో లబ్ధి పొందారు. రాజధాని అమరావతిలో ‘ఇన్‌సైడర్‌’ ట్రేడింగ్‌ జరిగిందని వైకాపా నాయకులు అసత్యప్రచారం చేశారుగానీ... ఆ అత్యున్నతాధికారి విశాఖలో పేదల భూములతో చేసిన దందానే అసలు సిసలు ‘ఇన్‌సైడర్‌’ ట్రేడింగ్‌.

పేదల్ని బెదిరించి..

పేదలకు చెందిన డి-పట్టా భూముల్ని కొట్టేసేందుకు పక్కాగా ప్లాన్‌ చేసిన ఆ అధికారి... దాన్ని అమలు చేసేందుకు ముగ్గురు బినామీల్ని విశాఖలో దించారు. చందమామను తలపై ధరించిన ఈశ్వరుడనే అర్థం వచ్చే పేరుగల వ్యక్తి, మూడు లోకాల్లో పూజ్యనీయుడైన సాయి అని అర్థం వచ్చే పేరుగల మరో వ్యక్తి, భరతజాతికి మూలపురుషుడి పేరు పెట్టుకున్న ఇంకో వ్యక్తి... ఆ అత్యున్నతాధికారి తరఫున భారీగా డి-పట్టా భూములు కొన్నారు. ఆ ముగ్గురూ రైతుల నుంచి తమ పేరుపై జీపీఏ చేయించుకున్నారు. డీనోటిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆగి, అప్పుడు రైతుల్ని భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయమంటే ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్న ఉద్దేశంతో ముందుగానే రైతులతో జీపీఏ చేయించేసుకున్నారు. ‘మీ భూముల్ని మాకు అమ్మకపోతే నష్టపోతారు. వాటిపై మీకు ఎప్పటికీ హక్కులు సంక్రమించవు. ప్రభుత్వం తన అవసరాలకు మీ భూముల్ని తీసుకుంటే మీకు ఎలాంటి పరిహారం రాదు’ అని అమాయకులైన పేద రైతుల్ని భయపెట్టి వారి భూముల్ని కొట్టేశారు. ప్రభుత్వం నిర్దిష్ట గడువు దాటిన డి-పట్టా భూముల్ని క్రమబద్ధీకరించనుందని, అదే జరిగితే తమ భూముల క్రయవిక్రయాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చని, ధరలు పెరుగుతాయని తెలియని అమాయక రైతులు.. వారి మాయలో పడికారుచౌకగా భూములు అమ్మేశారు. ప్రభుత్వం ఇటీవల చేసిన చట్టసవరణను అనుసరించి.. నిర్దిష్ట గడువు దాటిన డి-పట్టా భూములకు 22ఎ నుంచి మినహాయింపునిస్తూ కలెక్టర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందే తడవు చకచకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగించేస్తున్నారు. ఆనందపురం మండల పరిధిలో కోలవానిపాలెం, రామవరం, గండిగుండం, మామిడిలోవ, పందలపాక, చందాక, పేకేరు, గొట్టిపల్లి, బాకూరుపాలెం, గిడిజాల, శొంఠ్యాం గ్రామాల్లోని సుమారు 200 ఎకరాల భూముల్ని ఇటీవలే కలెక్టర్‌ డీనోటిఫై చేశారు. ఇప్పుడు ఆ భూములన్నీ రైతుల నుంచి ఈ బినామీల పేరుమీదకు మారుతున్నాయి. పెందుర్తి, పద్మనాభం, భీమునిపట్నం వంటి మండలాల పరిధిలో సైతం డీనోటిఫై చేసిన వందల ఎకరాల భూములకూ ఇదే తరహాలో గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.

డీనోటిఫికేషన్‌లో జాప్యం చేశారంటూ ఓ అధికారికి స్థానచలనం?

డి-పట్టా భూముల క్రమబద్ధీకరణపై చట్టసవరణ 2023 ఆగస్టులో జరిగితే.. ఆ భూముల్ని 22(ఎ) జాబితా నుంచి మినహాయించే ప్రక్రియ ఈ ఏడాది జనవరి 17 నుంచి ప్రారంభమైంది. డి-పట్టా భూముల దందా వెనుక ఆ ఉన్నతాధికారితో పాటు, పలువురు వైకాపా నాయకుల హస్తం కూడా ఉండటంతో డీనోటిఫికేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. వారు చెప్పినంత వేగంగా ఆ ప్రక్రియ పూర్తి చేయనందుకే ఇటీవల జేసీ విశ్వనాథ్‌ను బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. మాట వినకపోతే ఐఏఎస్‌ అధికారినే బదిలీ చేయించామని, మీకూ అదే గతి పడుతుందని రెవెన్యూ అధికారుల్ని.. ఆ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బినామీలు బెదిరిస్తున్నారు.


మంత్రులు, వైకాపా నేతలదీ అదే దందా!

రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు ఏకంగా ఇక్కడ 300 ఎకరాల వరకు డి-పట్టా భూములు కొనేశారు. వాటిని 22(ఎ) నుంచి మినహాయించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

  • వైకాపాలో క్రియాశీలకంగా, నామినేటెడ్‌ పోస్టులో ఉండి, ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన ఒక నేత ఆనందపురం మండలం గండిగుండం పరిధిలో 15 ఎకరాల వరకు కొన్నట్లు పత్రాలు వెలుగులోకి వచ్చాయి. సదరు భూములు ఆ నేత పేరునే రైతుల నుంచి బదిలీ అయ్యాయి.
  • గతంలో వైకాపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఓ నేత బినామీల పేరుతో భోగాపురంతోపాటు, ఆనందపురం పరిధిలో భారీగా డి-పట్టా భూములు కొనేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని