హంతకులు పాలకులుగా ఉండకూడదు

‘‘నాన్న హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న నేను ప్రజల సహకారం కోరుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా శక్తిని చూపెట్టాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా మద్దతివ్వాలని కోరుతున్నా. నేను ఒక కారణం కోసం మద్దతు కోరుతున్నాను తప్పితే రాజకీయాల కోసం కాదు.

Updated : 02 Mar 2024 06:48 IST

మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు
రాష్ట్ర ప్రజలకు వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత పిలుపు
సొంత చెల్లిని జగన్‌ వంచించారు
విలువలు, విశ్వసనీయత మాటలు ఏమయ్యాయి?
మా నాన్న హత్య జరిగి అయిదేళ్లయినా దర్యాప్తు పూర్తికాదా?
దిల్లీ మీడియా సమావేశంలో సునీత సూటి ప్రశ్నలు
ఈనాడు - దిల్లీ

‘‘నాన్న హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న నేను ప్రజల సహకారం కోరుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా శక్తిని చూపెట్టాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా మద్దతివ్వాలని కోరుతున్నా. నేను ఒక కారణం కోసం మద్దతు కోరుతున్నాను తప్పితే రాజకీయాల కోసం కాదు. బలవంతులను ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలిగితే సమాజంలో మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకే జగన్‌కు ఓటేయొద్దని కచ్చితంగా చెబుతున్నా. ఎప్పుడూ పరిపాలనలో హత్యా రాజకీయాలు ఉండకూడదు. హంతకులు మనల్ని పాలించకూడదు. వారికి అలాంటి అవకాశం ఇవ్వకూడదు. సమాజాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కావాలి. సమాజాన్ని అన్ని కోణాల్లో ఉత్థానపరిచే ప్రజాస్వామ్యం రావాలి. అందువల్ల దయచేసి మా అన్న మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓటేయొద్దని కోరుతున్నా. ఆయనకు ఓటేస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ ఉండదు. వంచన, మోసంతో కేవలం తన అనుకున్నవారికే సాయం చేసి, మిగిలినవారికి అన్యాయం చేసే పార్టీకి ఓటేయొద్దు’’ అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీత ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. తన తండ్రి హత్య జరిగి ఈ నెల 15 నాటికి అయిదేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకూ దర్యాప్తు పూర్తి కాకపోవడం, కోర్టులో ట్రయల్‌ ప్రారంభం కాకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ఆమె శుక్రవారం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అంతిమ కుట్రదారులను తేల్చాలని డిమాండ్‌ చేశారు. అవినాష్‌రెడ్డికి ఇందులో శిక్షపడాలని, తప్పుచేసిన వారు తప్పించుకోకూడదని అభిప్రాయపడ్డారు.

దురుద్దేశాలను అర్థం చేసుకోలేకపోయాం

గతంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి దిల్లీ వచ్చినప్పుడు ప్రస్తుత తితిదే ఈఓ ధర్మారెడ్డి నేనున్న చోటికి వచ్చి ఎన్నికల సంఘం కార్యాలయానికి తీసుకెళ్లారు. వారు చేసే సాయాన్ని చూసి దానివెనకున్న దురుద్దేశాలను అర్థం చేసుకోలేకపోయాం. కాలగమనంలో ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాలని హైకోర్టులో మా అమ్మ కేసు దాఖలుచేయడం... దానికి మద్దతు పలుకుతూ జగన్‌ కూడా కేసు దాఖలు చేయడంతో అంతా సరైన దిశలోనే జరుగుతోందని భావించాం.

రాష్ట్రంలో జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ కేసును సీబీఐకి ఇచ్చే విషయంలో ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోమని అడగడానికి వెళ్లినప్పుడు ఆయన స్పందించిన తీరు నాకు కొంత నమ్మకం కలిగించింది. ‘చిన్నాన్నను చంపిన వారిని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? హంతకులెవరైనా పట్టుకొని తీరుతాం’ అని చెప్పారు. ఆ మాటల వెనుక మోసం, వంచన ఉన్నాయన్న ఆలోచన నాకు రాలేదు. సమయం గడిచే కొద్దీ ఆయన చుట్టుపక్కల ఉన్నవారి పట్ల అనుమానాలు వెలువడ్డాయి. ఆగస్టు 8న మా నాన్న జయంతి రోజున ఆయన విగ్రహావిష్కరణతో పాటు, కియా ఫ్యాక్టరీ ప్రారంభానికి జగన్‌ రావాలి. అయితే ఆ రెండింటికీ జగన్‌ రాలేదు. మా నాన్న విగ్రహావిష్కరణకు హాజరు కావాల్సి వస్తుందని కియా పరిశ్రమ ప్రారంభోత్సవానికీ రాలేదు.

అన్న అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారులు మారారు

రాష్ట్రంలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హత్యకేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు మారారు. ఆ సమయంలో మా కుటుంబం అంతా కలిసి కూర్చున్నప్పుడు నేను దీని గురించి మాట్లాడితే జగన్‌ స్పందిస్తూ.. నేను ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే అవినాష్‌రెడ్డి భాజపాలోకి వెళ్తాడన్నారు. సీబీఐకి వెళ్తే అది దర్యాప్తు చేసే తన 12వ కేసు అవుతుందని కూడా వ్యాఖ్యానించారు. న్యాయం కోరుతున్న నాముందు జగన్‌ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఆనాడు నాకు అర్థం కాలేదు.

నామీద, నా భర్త మీదా దర్యాప్తు చేయించాలని ఆ రోజే కోరా

అదే సమావేశంలో జగన్‌ అసంబద్ధంగా నా భర్త మీద ఆరోపణలు చేశారు. అందుకు నేను అంగీకరిస్తూ అనుమానం ఉంటే ఆయనపైనా, నామీదా దర్యాప్తు చేయించాలని అడిగా. ఒకవేళ నేనే ఆ హత్య చేసి ఉంటే నన్ను శిక్షించాలని అడిగాను. కానీ ఏమీ చేయలేదు. తర్వాత నేను నిరంతరం కుటుంబసభ్యులు, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్‌ అనిల్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలతో మాట్లాడి ఈ కేసును సీబీఐకి అప్పగించేలా ఒప్పించేందుకు ప్రయత్నించాను. కానీ ఏమీ జరగలేదు. అంతిమంగా నేను కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జగన్‌ అంతకు ముందు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించేసుకున్నారు. ఎందుకలా చేశారు?

శివశంకర్‌రెడ్డి అరెస్టు తర్వాత మారిన పరిస్థితులు

ఈ కేసులో ఏ-5 డి.శివశంకర్‌రెడ్డి అరెస్టు తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆయన తర్వాత అరెస్టుల లైన్‌లో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉండటంతో వారిలో భయం మొదలైంది. దాంతో సీబీఐ అధికారులపై సాక్షులతో ఎదురు కేసులు పెట్టించడం మొదలుపెట్టారు. 2022 జనవరిలో సీబీఐ అధికారులు కడప నుంచి వెళ్లిపోవడంతో దర్యాప్తు ఆగిపోయింది. చివరకు ఈ కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు మార్చాలని, సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతే దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. రాష్ట్రంలో ఈ కేసు విచారణకు సమస్యలు ఎదురవుతున్నాయని సుప్రీంకోర్టు గుర్తించబట్టే దాన్ని మరో రాష్ట్రానికి మార్చింది.

కర్నూలులో ఎంత తమాషా జరిగింది?

అవినాష్‌రెడ్డి ఏ రోజూ మా నాన్న హత్య కేసు దర్యాప్తు వేగంగా జరగడానికి ఆత్రుత చూపలేదు. సీబీఐ విచారణకు పిలిస్తే... హాజరుకావడానికి సమయం కావాలంటూ దాటవేశారు. తర్వాత కర్నూలులో ఏమయిందో అందరికీ తెలుసు. ఒక కేసులో అనుమానితుడిని అరెస్టు చేయడానికి సీబీఐ రెండురోజులు వేచిచూసిన ఘటనను మనం దేశంలో ఎక్కడా చూసి ఉండం. కానీ అది కర్నూలులో జరిగింది. స్థానిక పోలీసుల సాయం కోరితే వారూ సహకరించలేదు. రెండురోజుల తర్వాత సీబీఐ ఉత్తచేతులతో వెనక్కి వచ్చింది. అనుమానితుడు ఎక్కడ ఉన్నారో తెలిసినా సీబీఐ అరెస్టు చేయకుండా తమాషా చేసింది. రెండురోజుల డ్రామా తర్వాత అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. ఆపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. తర్వాత దర్యాప్తు ఆగిపోయింది.

ఛార్జిషీట్లలో పేర్కొన్నదేదీ సీబీఐ చేయలేదు

అవినాష్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించడంలేదని, ఆయన్ను ప్రశ్నించాలని సీబీఐ ఛార్జిషీట్లలో పేర్కొంది. హత్య గురించి బయటి ప్రపంచానికి తెలియకముందే ఆ విషయం తెలిసిన మరికొందరు వ్యక్తులనూ విచారించాల్సి ఉన్నట్లు పేర్కొంది. కానీ ఇప్పటివరకూ ఇందులో ఏ ఒక్క పనీ చేయలేదు. నాన్న హత్య గురించి జగన్‌ ద్వారా తనకు ఉదయం 5.30కే తెలిసిందని సీఎస్‌గా చేసిన వ్యక్తి (అజేయ కల్లం) చెప్పినప్పుడు వారిని సీబీఐ ఎందుకు విచారించలేదో అర్థం కావడం లేదు. ఈ లోపాలను సరిదిద్ద]కుండానే విచారణను ఎందుకు ముగించారో అర్థం కావడంలేదు. గత ఏడాది జూన్‌ 30 తర్వాత దర్యాప్తు ఆగిపోయింది. ఇందులో ఎంత ఆలస్యం చేస్తే దర్యాప్తు చివరివరకు వెళ్లడం అంత కష్టమవుతుంది.

విలువలు.. విశ్వసనీయత అంటే ఇదేనా? చంపిన వాళ్లను రక్షించడం మంచిదా?

విలువలు, విశ్వసనీయత, మాట తప్పను, మడమ తిప్పను... నా అక్కలు, నా చెల్లెమ్మలు అని పదేపదే జగనన్న చెప్పే మాటలు ఏమయ్యాయి? మా నాన్న విషయంలో మనకు ఇవన్నీ గుర్తుకురావా? ఏమయ్యాయి మన విలువలు? ఏం చేశారు ఈ చెల్లెమ్మకు? నాకిచ్చిన మాట ఏమైంది? దుష్ట చతుష్టయం అని పదేపదే అంటుంటారు. కానీ వివేకానందరెడ్డిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎలా? వారిని వదిలేయడం కాకుండా వత్తాసు పలికి అండగా నిలవడం తప్పు కాదా? మంచికి, చెడుకు యుద్ధం అంటారు? ఇక్కడ ఏది మంచి? ఏది చెడు? చంపిన వాళ్లను రక్షించడం మంచిదా? రాష్ట్రంలో పేదలు, పెత్తందార్లకు యుద్ధం అని కూడా చెబుతుంటారు. రాష్ట్రంలో ఈ పెత్తందార్లంతా నాన్న హత్య కేసులోని సాక్షులను ప్రభావితం చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు?


జగన్‌కు ముందే ఎలా తెలిసిందన్న విషయంపై దర్యాప్తు జరపాలి

వైఎస్‌ వివేకా హత్య గురించి బయటి ప్రపంచానికి తెలియకముందే ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌కు ఎలా తెలిసిందన్న విషయం గురించి సీబీఐ 2023 జూన్‌ 30న దాఖలుచేసిన ఛార్జిషీట్‌లో ప్రస్తావించకపోవడాన్ని సునీత ప్రత్యేకంగా ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ 2023 ఏప్రిల్‌ 25, మే 25ల్లో దాఖలుచేసిన అఫిడవిట్లలోని అంశాలను ప్రస్తావిస్తూ మీడియాకు నాలుగుపేజీల పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‘‘వివేకా హత్య గురించి ఎంవీ కృష్ణారెడ్డి ఉదయం 6.15 గంటలకు బహిర్గతం చేయడానికి చాలాముందే సీఎం జగన్‌కు సమాచారం అందించినట్లు సీబీఐ దాఖలుచేసిన అఫిడవిట్లలో స్పష్టంగా ఉంది. అందువల్ల విస్తృత కుట్రకోణాన్ని తేల్చడానికి రెండు కోణాలను దర్యాప్తు చేయాలి.

1. హత్యకు ముందు, తర్వాత వైఎస్‌ అవినాష్‌రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు. అందువల్ల హత్య జరిగిన రోజు ఉదయం 6.15 గంటలకు ముందే దీనిపై ఆయన జగన్‌కు సమాచారం అందించారా అన్న విషయాన్ని దర్యాప్తు చేయాలి.

2. వివేకా హత్యలో పాల్గొన్నవారిలో ఒకరైన ఏ-2 సునీల్‌యాదవ్‌ 2019 మార్చి 15న అర్ధరాత్రి 1.58 గంటల సమయంలో అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. అందువల్ల ఈ విషయంతో పాటు, అవినాష్‌రెడ్డి ఆ రోజు చేసిన వాట్సప్‌ కాల్స్‌పైనా తదుపరి దర్యాప్తు చేపట్టాలి.

2023 జూన్‌ 30న దాఖలుచేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో పైన పేర్కొన్న రెండు అంశాలపై దర్యాప్తు చేసినట్లు కనిపించలేదు కాబట్టి సీబీఐ ఈ కోణాలపై దర్యాప్తు చేయాలి. ఇది సీబీఐ వైపునుంచి తీవ్రమైన లోపం కాబట్టి సాధ్యమైనంత త్వరగా తదుపరి దర్యాప్తు పూర్తిచేయాలి.


2019 మార్చి 15న నాన్న కన్ను మూసినట్లు చెప్పిన వెంటనే మేం పులివెందుల చేరుకొని తొలుత మార్చురీకి వెళ్లాం. బయట ఉన్న అవినాష్‌రెడ్డి నా వద్దకు వచ్చి పెదనాన్న రాత్రి 11.30 వరకూ తన కోసం ప్రచారంలో పాల్గొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కేసుల్లో హంతకులు మన మధ్యే ఉన్నా గుర్తించలేకపోవడం సినిమాలు, టీవీల్లో చూస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఇదీ ఒకటి. వాళ్లు సాయం చేస్తున్నట్లు నటిస్తుంటారు కాబట్టి మనం అనుమానించం. సాయం పొందినవారే చెడు చేస్తారని ఎవరైనా ఎలా అనుకుంటారు?


దుష్ట చతుష్టయం అని పదేపదే అంటుంటారు. కానీ వివేకానందరెడ్డిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎలా? వారిని వదిలేయడం కాకుండా వత్తాసు పలికి అండగా నిలవడం తప్పు కాదా? మంచికి, చెడుకు యుద్ధం అంటారు.. ఇక్కడ ఏది మంచి? ఏది చెడు? చంపిన వాళ్లను రక్షించడం మంచిదా?

నర్రెడ్డి సునీత


‘చిన్నాన్నను చంపినవారిని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? హంతకులెవరైనా పట్టుకొని తీరుతాం’ అని జగనన్న చెప్పారు. ఆ మాటల వెనుక మోసం, వంచన ఉన్నాయన్న ఆలోచన అప్పట్లో నాకు రాలేదు. సమయం గడిచే కొద్దీ సందేహాలు వెలువడ్డాయి. ఆయన చుట్టుపక్కల ఉన్నవారి పట్ల అనుమానాలు ముసురుకున్నాయి.


వ్యవస్థపై నమ్మకం కలిగించడానికే పోరాటం

న్యాయం కోసం అయిదేళ్లుగా పోరాడుతున్నాను. నాకు న్యాయం జరిగితే అన్యాయంపై పోరాడే ఎంతోమందికి ఆశ వస్తుంది. అది అంతిమంగా సమాజాన్ని మారుస్తుందన్నదే నా అభిప్రాయం. ఆశ లేకపోవడం వల్లే చాలామంది పోరాటం చేయడం లేదు. ఆ ఆశను తిరిగి తేవాలన్నదే నా లక్ష్యం. హంతకులను పట్టించి, వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నదే నా ఉద్దేశం.


విలేకర్ల ప్రశ్నలు... సునీత సమాధానాలు

మీ నాన్న హత్యకేసులో ఉన్నవారిని రక్షించడానికే జగన్‌ పరిమితమయ్యారా? అందులో ఆయన పాత్ర కూడా ఉండొచ్చని మీరు అనుమానిస్తున్నారా?

ఇప్పటివరకు సీబీఐ దాఖలుచేసిన ఛార్జిషీట్లలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి నిందితులు. వాళ్లను ఆయన రక్షిస్తున్నారు. హత్యకేసులో ఆయన పాత్ర ఉందా, లేదా అన్నది నేను చెప్పకూడదు. పేర్లు వచ్చినందున దానిపై సీబీఐ విచారణ జరిపి దర్యాప్తును పూర్తిచేయాలి.

సీబీఐ ఛార్జిషీట్లలో విషయాలు చెప్పినా వాటిపై చర్యలు ఉండటం లేదు. దానికి కారణం ఏమనుకుంటున్నారు?

చర్యలు లేవన్నదే నా బాధ. అన్నిచోట్లా ప్రభావం చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది తనపై 12వ కేసవుతుందని జగన్‌ అన్నప్పుడు... ఇదీ వాటిలా కాకూడదనే నేను పోరాటం మొదలుపెట్టాను. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఈ కేసు అలాగే మారుతుందనేది నా భయం. అందుకే ఈ ప్రభుత్వం మళ్లీ రాకూడదని కోరుకుంటున్నా. ఇప్పుడు జైల్లో ఉన్నవారు బెయిల్‌మీద బయటికి వస్తే సాక్షులందర్నీ బెదిరిస్తారు.

అవినాష్‌రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సీబీఐ సుప్రీంకోర్టులో ఎందుకు సవాల్‌ చేయలేదు? దానివెనుక ఎవరున్నారని మీరనుకుంటున్నారు?

నా మనసులోనూ అవే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాళ్లకున్న ఒత్తిళ్లేంటో నాకు తెలియదు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయలేను. ఎక్కడో అడ్డంకులైతే పడుతున్నాయి.

హత్య జరిగిన రోజు రాత్రి అవినాష్‌రెడ్డి జగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత కూడా ఉదయం వారి ఛానల్‌లో గుండెపోటుతో మరణించినట్లు చెప్పారు. అందువల్ల జగన్‌ పాత్ర ఉందని అనుకోవచ్చా?

ఈ ప్రశ్నలంటికీ సీబీఐ దర్యాప్తులో సమాధానాలు రావాలి. ఎందుకు ఆ పాయింట్ల మీద దర్యాప్తు జరగలేదో చెప్పాలి.

మీ కుటుంబంలో షర్మిల తప్ప ఇంకెవ్వరూ మీకు మద్దతు పలకలేదా?

నాన్న చనిపోయిన నాలుగురోజుల తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ మాది 700 మంది సభ్యులున్న వసుధైక కుటుంబం అని చెప్పా. విభేదాలున్నా అందరం కలిసి ఉంటాం తప్పితే చంపుకొనేవాళ్లం కాదన్నాను. కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. కొందరి మనసులో మద్దతివ్వాలన్న భావన ఉన్నా ఎవరూ ముందుకు రాలేదు.

హత్యకు ఏ ఆయుధం ఉపయోగించిదీ జగనే చెప్పారు. ఎలా చెప్పారనుకుంటున్నారు?

అది సరైన ప్రశ్న. గొడ్డలితో చంపారని ఎలా చెప్పగలిగారు? దానికి సీబీఐ సమాధానం చెప్పాలి.

ఇన్ని ప్రశ్నలకు సమాధానం లేకుండా వదిలిపెట్టినా ఇంకా వ్యవస్థపై ఆశ ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు?

అక్కడ ప్రభుత్వం అడ్డుపడుతున్నా కేసు ఇంతదాకా ఎలా వచ్చింది? ఇంతమందిని అరెస్టుచేసి జైల్లో ఎలా వేయగలిగారు?

చిన్నవారిని అరెస్టు చేశారు. పెద్ద చేపలను పట్టుకోలేదు కదా?

అందుకే నేను ప్రజల మద్దతు కోరుతున్నా. ఇక్కడ చేయగలిగినంత చేశాను. ఇంకా పోరాడతాను. ప్రజలు దీన్ని న్యాయమైన పోరాటంగా నమ్మి దానికి ఓటు రూపంలో మద్దతు పలికితే నేను ముందుకెళ్లడానికి వీలవుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. నేను అదే కోరుకుంటున్నా. ఇలాంటి నేరాలు ఆపాలంటే నా ఒక్కదాంతో సాధ్యంకాదు. ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు పలకాలి.

అవినాష్‌రెడ్డిని జగన్‌ ఎందుకు కాపాడుతున్నారు?

ఆ ప్రశ్నలకే నేనూ సమాధానాలు కోరుతున్నా.

జగన్‌ను ఓడించకపోతే ఇలాంటి దురాగతాలే జరుగుతాయని చెబుతున్నారు. మీరే రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష పోరాటం ఎందుకు మొదలుపెట్టకూడదు?

ఇప్పటివరకు నా పోరాటం న్యాయం కోసం మాత్రమే. న్యాయం జరిగితేనే సమాజం మెరుగుపడుతుందని నేను భావిస్తున్నా. అందుకోసం ప్రజల్లోకి పోవాల్సి వస్తే వెళ్తా. ఏం చేయాలి, ఎలా చేయాలన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే, నాకు కుటుంబ సభ్యుల కంటే ప్రజల నుంచే ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

ఈ హత్యకేసులో మీ భర్త పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. దానిపై ఏమంటారు?

ఇందులో నాతో పాటు ఎవ్వరూ అనుమానాలకు అతీతులుకారు. సీబీఐ ఇదివరకు నన్ను అనుమానితురాలి మాదిరిగానే ప్రశ్నించింది. నా భర్తనూ ప్రశ్నించారు. మేమేమీ దర్యాప్తునకు అతీతులం కాము. మమ్మల్ని ప్రశ్నించిన తర్వాతే చేసింది వీళ్లు కాదు... వాళ్లు అని చెప్పారు. దానిపై కోర్టులో విచారణ జరిగి శిక్ష పడాలి. 12 ఏళ్లయినా విచారణే మొదలుకాని సీబీఐ కేసుల జాబితాలో ఇది పోకూడదు.

దర్యాప్తు అధికారి రాంసింగ్‌ మారిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయా?

సీబీఐ ఓ వ్యవస్థ. అక్కడ ఏ ఒక్కరూ సొంతంగా వ్యవహరించరు. ప్రతి అధికారికీ కిందా, పైనా అధికారులు ఉంటారు. పైనుంచి ఆదేశాలు లేకుండా కింద ఎవ్వరూ ముందడుగు వేయరు. ఎవరిపైనా ఆధారపడకపోవడమే సీబీఐకున్న సానుకూలత.

ఈ కేసులో అవినాష్‌రెడ్డికి శిక్షపడుతుందని అనుకుంటున్నారా?

పడాలి. పడుతుంది. తప్పుచేసిన వారు తప్పించుకోకూడదు.

చిన్న మద్యం కేసుల్లోనే సీబీఐ నోటీసులు ఇచ్చి దూకుడుగా వ్యవహరిస్తోంది. కానీ ఇంత పెద్ద కేసును అయిదేళ్లయినా పూర్తిచేయకపోవడం పట్ల మీకు అనుమానం ఏమైనా ఉందా?

కచ్చితంగా సీబీఐపైన ఒత్తిడి ఉంది. మరోవైపు ఏపీ వార్తలు జాతీయ మీడియాలో ఎంతవరకు వస్తున్నాయో మీరు ఒకసారి గమనించండి. ఈ రోజు విలేకర్ల సమావేశానికి ఎన్ని జాతీయ మీడియాసంస్థలు వచ్చాయి? దీన్నిబట్టి జాతీయ మీడియాపై ఎంత ప్రభావం ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటన దిల్లీ, యూపీ, మహారాష్ట్రలో జరిగి ఉంటే కవర్‌ చేయకుండా ఉంటారా? ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ముఖ్యమంత్రి చిన్నాన్న హత్యకు గురైతే జాతీయ మీడియాలో ప్రచురించరా? దేశ రాజధానిలో దీని గురించి మాట్లాడితే ఏపీలో ఏం జరుగుతుందో దేశం తెలుసుకుంటుందని అనుకున్నాను. కానీ ఇక్కడ జాతీయ మీడియా ప్రతినిధులెవ్వరూ పెద్దగా కనిపించలేదు.

జాతీయ మీడియాను జగన్‌ ప్రభావితం చేస్తున్నారనుకుంటున్నారా?

మీకు అలా అనిపించడంలేదా? దానికి మీరే సమాధానం చెప్పాలి.

ఈ కేసు దర్యాప్తు తీరుపై ప్రధానమంత్రి, రాష్ట్రపతికి లేఖ రాస్తారా?

ఇప్పటికే రాశాను. కేసులో చెప్పుకోదగ్గ పరిణామాలు ఎప్పుడు జరిగినా వాటి గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తూనే వస్తున్నాను. నాకు ఎవ్వరూ అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. అయినా పేపర్‌, పెన్నుకు పని చెబుతూనే ఉన్నా. ప్రభుత్వానికి రాసే లేఖలన్నీ వన్‌వే ట్రాఫిక్‌ లాంటివే. వాటిని అందుకున్నవారు చూస్తారా, లేదా అన్నది తెలియదు. మనకు బదులు రాదు. కొంతవరకు ఫలితాలు చూస్తాం. అయితే ఆ ఫలితాలు మన ప్రయత్నం వల్ల వచ్చాయా, వాటంతట అవే వచ్చాయా అన్నది తెలియదు.


ఎందరికో ధన్యవాదాలు

ఈ అయిదేళ్లలో నాకు సహాయం చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నైతికంగా ధైర్యం చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు. అయిదేళ్లుగా మద్దతుగా నిలిచిన మీడియా, ఏపీ, తెలంగాణ, సీబీఐ పోలీసు అధికారులకు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. పులివెందుల, కడప, విజయవాడ, హైదరాబాద్‌, దిల్లీల్లో న్యాయవాదులు ఎంతో అండగా నిలిచారు. సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా సహా న్యాయవాదులంతా దీన్ని ఒక కేసుగా కాకుండా అన్యాయం జరిగిన ఒక కారణంగా తీసుకొని న్యాయస్థానాల్లో వాదించారు. వారందరికీ ధన్యవాదాలు. నా పోరాటానికి అండగా నిలిచిన సోదరి షర్మిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.


కర్నూలులో ఏమయిందో అందరికీ తెలుసు. ఒక కేసులో అనుమానితుడిని అరెస్టు చేయడానికి సీబీఐ రెండురోజులు వేచిచూసిన ఘటనను మనం దేశంలో ఎక్కడా చూసి ఉండం. కానీ అది కర్నూలులో జరిగింది. స్థానిక పోలీసుల సాయం కోరితే వారూ సహకరించలేదు. రెండురోజుల తర్వాత సీబీఐ ఉత్తచేతులతో వెనక్కి వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని