సేవకుల సదస్సులో కాసుల పేచీ

జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్న సంకల్పంతో రాష్ట్రంలో పర్యటిస్తున్న సీఎం మేనత్త వైఎస్‌ విమలారెడ్డి.. శుక్రవారం కాకినాడలో నిర్వహించిన సేవకుల సదస్సు రచ్చకెక్కింది.

Updated : 02 Mar 2024 06:10 IST

జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరిన మేనత్త విమలారెడ్డి
రూ.వెయ్యి ఇస్తామని చెప్పి.. రూ.500 ఇచ్చారంటూ పాస్టర్ల అసంతృప్తి
కాకినాడ సభలో గందరగోళం.. నిర్వాహకులతో వాగ్వాదం

ఈనాడు, కాకినాడ: జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్న సంకల్పంతో రాష్ట్రంలో పర్యటిస్తున్న సీఎం మేనత్త వైఎస్‌ విమలారెడ్డి.. శుక్రవారం కాకినాడలో నిర్వహించిన సేవకుల సదస్సు రచ్చకెక్కింది. వైఎస్సార్‌ క్రిస్టియన్‌ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దీనికి వచ్చిన పాస్టర్లకు, క్రైస్తవులకు భోజనం పెట్టి, దారి ఖర్చులకు రూ.వెయ్యి ఇస్తామని వైకాపా నాయకులు నమ్మబలికించి, భారీగా రప్పించారు. చివరకు రూ.500 మాత్రమే చేతిలో పెట్టడంతో వ్యవహారం రచ్చకెక్కింది. ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులతో వాదనకు దిగారు. కాకినాడలో నిర్వహించిన సేవకుల సదస్సుకు హాజరైన విమలారెడ్డి రాష్ట్రంలో మళ్లీ జగన్‌ పాలన రావాలని.. దైవసేవకుడిగా జగన్‌ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అత్యధిక విజయం దేవుడు అనుగ్రహించేలా, ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన వనరులు దేవుడు ధారాళంగా అనుగ్రహించేలా ప్రార్థించాలంటూ ప్రార్థనాంశాల కరపత్రాన్ని అందరికీ పంపిణీ చేశారు.

సదస్సుకు సుమారు 2,000 మంది పాస్టర్లు హాజరు అవుతారని నిర్వాహకులు అంచనా వేస్తే.. డబ్బులు ఇస్తారనే ప్రచారంతో అంతకు మించి వచ్చారు. ఉదయం 11.30లోపు వచ్చినవారి చేతికి ట్యాగులు వేసి ఆపేశారు. ఆ తర్వాత వచ్చినవారితో పేచీ మొదలైంది. దీంతో అప్పటికే కవర్లలో రూ.వెయ్యి చొప్పున సిద్ధం చేసిన నిర్వాహకులు రూ.500 చొప్పున ఇవ్వడంతో కొందరు నిరసన వ్యక్తంచేశారు. డబ్బులు అందనివారు ఇచ్చేవరకు వెళ్లబోమని మొండికేశారు. ఆఖరికి సొమ్ము సర్దుబాటు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోనూ విమలారెడ్డి గురువారం సేవకుల సదస్సు నిర్వహించి జగన్‌ను సీఎం చేయాలని కోరారు. అక్కడ అంతా సవ్యంగా సాగితే, కాకినాడ సదస్సులో నిర్వాహకుల తీరుతో వ్యవహారం బెడిసికొట్టింది. కాకినాడ సదస్సులో విమలారెడ్డితో పాటు వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌, కాకినాడ సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కురసాల కన్నబాబు చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని