సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

Published : 02 Mar 2024 04:12 IST

వీవీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్‌ అరెస్టు
ప్రత్యేక హోదా సాధనలో జగన్‌ విఫలమయ్యారని మండిపాటు

ఈనాడు, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఎన్నికలకు సిద్ధం అంటున్న ఆయన.. అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వాలని సవాల్‌ విసిరారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ, కేజీ బేసిన్‌ పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. జైభారత్‌ నేషనల్‌ పార్టీ, ఆంధ్రా మేధావుల ఫోరం, విభజన హామీల సాధన సమితి, విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనలో భాగంగా తాడేపల్లికి బయలుదేరిన వీవీ లక్ష్మీనారాయణ, ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని బలవంతంగా మంగళగిరి ఠాణాకు తరలించారు. వీరికి మద్దతుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వస్తారనే సమాచారం మేరకు ఆయన్ను గృహనిర్బంధం చేశారు. కొంతసేపటి తరువాత విద్యార్థి నాయకులు ముట్టడికి తరలిరాగా.. అయిదో నంబరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. జైభారత్‌ నేషనల్‌ పార్టీ నాయకులు పోతిన వెంకట రామారావు, విద్యార్థి నాయకులు జిలానీ, వెంకటేశ్వర్‌రెడ్డి, రాయపాటి జగదీష్‌, తదితరులను సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉంచారు.

జగన్‌ను ప్రజలు క్షమించరు

ఈ సందర్భంగా వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయకపోతే జగన్‌ను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. హోదా గురించి తాము అడుగుతుంటే పోలీసులతో అడ్డుకోవడం దుర్మార్గమని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్‌, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్‌ మండిపడ్డారు.

కార్యక్రమానికి హాజరుకావద్దంటూ సీపీఐ, దాని అనుబంధ సంఘాలు, కాంగ్రెస్‌ నాయకులకు నోటీసులిచ్చి కట్టడి చేశారు. ‘జగన్‌ పాలనను గాలికొదిలేసి.. ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారని తెలియడంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఠాణాకు చేరుకుని వారిని పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని