Krishna: సీఎం జగన్‌ సభ.. విద్యార్థులకు నరకం

కృష్ణా జిల్లా పామర్రులో శుక్రవారం జరిగిన జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల సభ కోసం.. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లపై తీవ్ర ఒత్తిడి పెట్టి మరీ వేల మంది విద్యార్థులను తరలించారు.

Updated : 02 Mar 2024 08:02 IST

ఈనాడు, అమరావతి - పామర్రు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా పామర్రులో శుక్రవారం జరిగిన జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల సభ కోసం.. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లపై తీవ్ర ఒత్తిడి పెట్టి మరీ వేల మంది విద్యార్థులను తరలించారు. కలెక్టర్‌, డీఆర్‌వో, కృష్ణా వర్సిటీ అధికారులతోపాటు అన్ని విభాగాలూ.. కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఫోన్లు, వీడియో కాన్ఫరెన్సులను పెట్టి మరీ హెచ్చరికలు చేశారు. విజయవాడ, మచిలీపట్నం సహా అన్ని ప్రాంతాల్లో ఉన్న డిగ్రీ కళాశాలలన్నింటి నుంచి బస్సుల్లో విద్యార్థులను తీసుకొచ్చారు. బస్సులు లేని కళాశాలలకు ఇతర విద్యాసంస్థలకు చెందిన బస్సులను తెల్లవారుజామున 5 గంటలకే పంపారు. సభావేదిక ఎదుట వేసిన కుర్చీలకు మించి జనాన్ని తరలించడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎండలో నిలబడాల్సి వచ్చింది. ఎండకు చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభమయ్యే సమయంలో చాలామంది బయటకు వచ్చేయడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. బయటకు వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వేదిక బయట ఉన్న విద్యార్థులకు అల్పాహారం, నీళ్లు కూడా ఇచ్చేవారు లేరు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకూ ఉంచి.. భోజనాలు కూడా పెట్టకుండా పంపించేశారు. వారి కళాశాలల్లోనే మధ్యాహ్న భోజనం సిద్ధం చేసుకోమని అధికారులు చెప్పడంతో వచ్చిన వారు తిరిగి వెళ్లే సరికి.. మధ్యాహ్నం 3 గంటలు దాటింది. విద్యార్థులు ఎండ వేడి, ఆకలి బాధతో విలవిల్లాడిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని