ఇసుకాటేస్తున్నారు!

అధికార బలం అండగా.. ధనదాహమే మెండుగా.. ఎవ్వరినీ లెక్కచేయకుండా మొండిగా..   వైకాపా నేతలు బరితెగించగా.. ఇసుక తవ్వకాలు దండిగా.. ఆ గుంతల్లో పడి.. అమాయకులు ప్రాణాలు కోల్పోతుండగా.. సామాన్య కుటుంబాలు రోడ్డున పడుతుండగా.. పట్టించుకోవాల్సిన సర్కారు చేష్టలుడగ్గా.. బాధితుల కష్టాలు చూస్తూ.. ఎలా ఉండగలుగుతున్నారు జగన్‌ నిస్సిగ్గుగా..!!

Updated : 02 Mar 2024 05:41 IST

నదీ పరివాహకాల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు
భారీ గుంతల విషయం తెలియక మునిగిపోతున్న సామాన్యులు
కుటుంబాలను కకావికలం చేస్తున్న జగన్‌ సర్కారు నిర్లక్ష్యం
ఎన్ని ప్రాణాలు పోతున్నా ఆగని ఉల్లంఘనలు.. రూ.వందల కోట్ల దోపిడీ
శవాల మీద కోట్లు కూడబెడుతున్న వైకాపా నేతలు
ఈనాడు, అమరావతి, రాజమహేంద్రవరం, ‘న్యూస్‌టుడే’ యంత్రాంగం

అధికార బలం అండగా.. ధనదాహమే మెండుగా.. ఎవ్వరినీ లెక్కచేయకుండా మొండిగా..   వైకాపా నేతలు బరితెగించగా.. ఇసుక తవ్వకాలు దండిగా.. ఆ గుంతల్లో పడి.. అమాయకులు ప్రాణాలు కోల్పోతుండగా.. సామాన్య కుటుంబాలు రోడ్డున పడుతుండగా.. పట్టించుకోవాల్సిన సర్కారు చేష్టలుడగ్గా.. బాధితుల కష్టాలు చూస్తూ.. ఎలా ఉండగలుగుతున్నారు జగన్‌ నిస్సిగ్గుగా..!!

  • కొడుకు చదువు పూర్తి కావొస్తుండటంతో, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరి కుటుంబ బాధ్యతలు చూస్తాడని అమ్మానాన్నలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎదిగొచ్చిన కొడుకును ఇసుక గుంతలు మింగేస్తే.. ఆ కుటుంబం పడే క్షోభను మాటల్లో వర్ణించలేం.
  • కూలి పనులు చేసుకుంటూ ఇంటిని నడిపిస్తున్న పెద్దదిక్కుని ఇసుక గుంతలు పొట్టునపెట్టుకుంటే.. ఆ ఇల్లాలు, పిల్లల పరిస్థితి ఏంటి? ఇక ఆ ఇల్లు గడిచేదెలా?
  • స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన స్కూల్‌ విద్యార్థులు.. సరదాగా స్నానానికి నీళ్లలోకి దిగగా.. అక్కడ పొంచి ఉన్న ఇసుక గుంతలు వారిని బలిగొంటే..? పిల్లలే ప్రపంచమనుకొని బతుకుతున్న ఆ తల్లిదండ్రుల కలలన్నీ కల్లలే కదా?

..ఇటువంటి దీనగాథలు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలు. వైకాపా నాయకుల ధనదాహమే ఇందుకు కారణం. నదీ తీరాల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ.. అక్రమంగా వందల కోట్లు పోగేస్తూ.. అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నారు. ఇసుక గుంతల్లో చిక్కుకొని, ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏ ఇంటి తలుపు తట్టినా దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. కన్నీటి రోదనలే వినిపిస్తున్నాయి. అయినా సరే.. జగన్‌ ప్రభుత్వం మాత్రం అక్రమ తవ్వకాలపై దృష్టి సారించడం లేదు. ఎంత మంది ప్రాణాలు పోతే మాకేంటి.. కోట్ల రూపాయలతో మా గల్లాపెట్టెలు నిండితే చాలనే ధోరణిలో కర్కశంగా
వ్యవహరిస్తోంది.

* రాష్ట్రంలో ఇసుక తవ్వకం, తరలింపు ప్రక్రియ మొత్తం ఓ మాఫియాను తలపిస్తోంది. ఏ నదీ తీరం చూసినా.. తాటిచెట్టంత లోతైన గుంతలతో మృత్యుకుహరాలుగా భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతో వైకాపా నేతలు, టెండరు దక్కించుకున్నామని చెబుతున్న గుత్తేదారులు.. నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. ఇష్టానుసార తవ్వకాలతో అభం శుభం తెలియనివాళ్లంతా ఆ భారీ గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సాక్షాత్తూ సీఎం జగన్‌ నివసించే తాడేపల్లికి దగ్గరలో కృష్ణా నదికి ఇరువైపులా నాలుగున్నరేళ్లలో 34 మంది ఇసుక గుంతల్లో మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. వీరిలో యువత, విద్యార్థులే అధికం. ఒకటి, రెండు ఘటనల తర్వాతనైనా స్పందించి, ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలను అడ్డుకోవాల్సిన సర్కారు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇసుకాసురులు మరింత విచ్చలవిడిగా తవ్వుకునేలా సహకారం అందిస్తోంది. దీంతో ఇసుక గుంతల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రానురాను పెరుగుతూనే ఉంది. మానసిక క్షోభను అనుభవించే కుటుంబాలూ అంతకంతకూ పెరుగుతున్నాయి. మా ఉసురు ఇసుకాసురులకు తప్పకుండా తగులుతుందని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. అయినాసరే ఈ ప్రభుత్వంలో ఇసుమంతైనా చలనం లేదు.


ఇంజినీరింగ్‌ అయ్యాక అండగా ఉంటాడనుకుంటే..

మా కుమారుడు రమేశ్‌ అనంతపురంలో ఇంజినీరింగ్‌ చదివేవాడు. 2022 ఆగస్టులో ఇంటికి వచ్చినప్పుడు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని వేదవతి నదికి వెళ్లాడు. ఇసుక తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతల్లో చిక్కుకొని మృతిచెందాడు. మరో ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని, ఏదో ఒక ఉద్యోగంలో చేరితే.. మా అప్పులు తీరిపోతాయని భావించాం. కానీ, ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు.

మృతుడు రమేశ్‌ తల్లిదం‌డ్రులు, కెంచానపల్లి, అనంతపురం జిల్లా  


కొడుకే ఇంటికి పెద్ద దిక్కు..

నా భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోతే.. ఒక్కగానొక్క కొడుకు కరుణాకర్‌ ఇంటికి పెద్దదిక్కయ్యాడు. ఎనిమిదేళ్ల వయసు నుంచే హైదరాబాద్‌లో మేనమామ దగ్గరుంటూ పని చేసుకునేవాడు. అప్పు చేసి అమ్మాయికి పెళ్లిచేశాం. 2021 మేలో హైదరాబాద్‌ నుంచి పనిమీద ఇంటికి వచ్చాడు. స్నేహితులతో కలిసి జొన్నాడ వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లాడు. అక్కడ ఇసుక గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి మా ఇంటికి ఆధారం లేకుండా పోయింది.

నాగవేణి, కొత్తపేట, కోనసీమ జిల్లా


దిగులుతో నా భార్య మంచం పట్టింది

నాకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పిల్లల్ని ఎంత కష్టమైనా చదివిస్తున్నా. పెద్ద కుమారుడు త్రిలోక్‌ కుటుంబానికి కుడిభుజంగా ఉంటాడని ఆశించా. గతేడాది మే 21న స్నేహితులతో కలిసి గోదావరిలోకి దిగి ఇసుక గుంతలో చిక్కుకుని, చనిపోయాడు. అప్పటి నుంచి నా భార్య ఆరోగ్యం ఇప్పటికీ కుదుటపడలేదు. ఆమెకు మందుల కోసమే నెలకు రూ.1,200 ఖర్చవుతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు.

మోటూరి శ్రీను, ఎన్‌.పెదపాలెం, అయినవిల్లి మండలం


కొడుకు మృతి తట్టుకోలేక భర్త కూడా..

మా కుమారుడు శివనాగరాజు (24) ట్రాక్టరు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 2021 నవంబరులో కార్తికమాసంలో స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగాడు. ఇసుక గుంతల్లో మునిగి చనిపోయాడు. ఈ దిగులుతోనే నా భర్త 2022 నవంబరులో చనిపోయారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తున్నాను. కుమారుడు చనిపోయాక కలెక్టర్‌ రూ.50 వేలు పరిహారంగా ఇచ్చారు.

రమాదేవి, తోట్లవల్లూరు, కృష్ణా జిల్లా


మా ఆశలూ నీటమునిగాయి

కొంతకాలం కిందట నాభర్త మృతిచెందారు. పూలు అమ్ముతూ.. ఇద్దరు కుమార్తెలు,  కుమారుడిని పోషిస్తున్నా. కుమారుడు హుస్సేన్‌ అలియాస్‌ బబ్లూ (15)... 2022 డిసెంబరులో స్నేహితులతో కలిసి కృష్ణా నదికి వెళ్లాడు. ఇసుక గుంతల్లో ప్రాణాలు కోల్పోయాడు. పరిహారంగా రూ.15 లక్షలు, ఇల్లు ఇప్పిస్తామని వైకాపా నాయకులు హామీ ఇచ్చారు. కానీ, రూ.3 లక్షలే అందించారు.

దూదేకుల గౌరి, పటమట దర్శిపేట, విజయవాడ


రెండేళ్లలో ఇద్దరిని మింగేశాయి

నాతోపాటు సోదరుడు పెద్దబాజీ (26) బీరువాల పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేవాళ్లం. ఇంట్లో శుభకార్యం ఉండటంతో నేను, పెద్దబాజీ, మరొకరు కలిసి రెండేళ్ల క్రితం కృష్ణానదిలో స్నానానికి వెళ్లాం. పెద్దబాజీకి ఈత రాకపోవడంతో ఇసుక గుంతలో కూరుకుపోయాడు. అంతకు ముందు ఏడాది మా మేనల్లుడు షేక్‌ రిజ్వాన్‌ బాషా (20) కూడా కృష్ణా నదిలో స్నానానికి దిగి ఇసుక గుంతల వల్ల చనిపోయాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు.

చిన్న బాజీ, దిడుగు, పల్నాడు జిల్లా


తండ్రి మీదే ఆధారపడాల్సి వచ్చింది

రెండేళ్ల కిందట వినాయక నిమజ్జనానికి కుటుంబ సభ్యులమంతా కలిసి కృష్ణా నదికి వెళ్లాం. తిరిగి వచ్చే క్రమంలో సమీప బంధువు భార్గవాచారి నీటిలో మునిగిపోతుండగా, అతడిని కాపాడేందుకు నాభర్త మల్లికార్జునరావు (29) ప్రయత్నించారు. నదిలో భారీ ఇసుక గుంతలు కారణంగా ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రుల వద్దే ఉంటూ కూతురిని చదివిస్తున్నా. ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందలేదు.  

నవ్య హరిత, 14వ మైలు గ్రామం, పల్నాడు జిల్లా


పిల్లలిద్దరూ తండ్రి లేనివారయ్యారు

మేం చిన్న హోటల్‌ నిర్వహిస్తున్నాం. మా కుమారుడు భార్గవాచారి డ్రైవర్‌గా పనిచేస్తూ, హోటల్‌లో మాకు సహకరిస్తుండేవాడు.రెండేళ్ల క్రితం వినాయక నిమజ్జనానికి అంతా కలిసి కృష్ణా నదికి వెళ్లాం. అక్కడ నీటిలోకి దిగిన మా కొడుకు మళ్లీ బయటకు రాలేదు. తన పిల్లలిద్దరూ తండ్రి లేనివారయ్యారు. ప్రభుత్వం రూ.2 లక్షల సాయం మాత్రమే అందించింది.

గోవిందమ్మ, శ్రీనివాసరావు, లేమల్లె, పల్నాడు జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని