లక్క గాజులకు ‘జీఐ’ నగిషీ

హైదరాబాద్‌ నగరానికి మరో గుర్తింపు దక్కింది. పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్‌ హలీమ్‌కు జీఐ ట్యాగ్‌ దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి.

Updated : 03 Mar 2024 06:11 IST

జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ గుర్తింపు జారీ చేసిన చెన్నైలోని రిజిస్ట్రీ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరానికి మరో గుర్తింపు దక్కింది. పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్‌ హలీమ్‌కు జీఐ ట్యాగ్‌ దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ శనివారం జీఐ రిజిస్ట్రేషన్‌ ట్యాగ్‌ను ప్రకటించింది. తెలంగాణలో జీఐ ట్యాగ్‌ అందుకున్న 17వ ఉత్పత్తి ఇది.

చేతితోనే తయారీ

హైదరాబాద్‌ పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి. ఇక్కడ రకరకాల గాజులు తయారవుతుంటాయి. అందులో లక్క రాళ్ల గాజులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందాయి. ఈ గాజుల తయారీ క్లిష్టమైన ప్రక్రియ. రెసిన్‌ను కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దీన్ని వృత్తాకారంలో మలిచి.. దానిపై స్ఫటికాలు, రాళ్లు, పూసలు, అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు. కాలక్రమంలో వీటి డిజైన్లలో ఎన్నో మార్పులొచ్చాయి. మొగలుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెబుతారు. రాజకుటుంబాల్లోని మహిళలు ఈ గాజులు ధరించేవారు. ఇప్పుడు వేడుకల్లో వీటిని ధరించడానికి మహిళలు ఇష్టపడుతున్నారు.

లాడ్‌ బజార్‌లో మాత్రమే దొరికే లక్క గాజులకు జీఐ గుర్తింపు కోసం 2022లో క్రిసెంట్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ ఆర్టిజన్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ దరఖాస్తు చేసింది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది. 18 నెలల పరిశీలన అనంతరం జీఐ ట్యాగ్‌ మంజూరైంది. త్వరలోనే ధ్రువీకరణ పత్రం రానుంది. ‘‘లాక్‌ గాజుల తయారీలో 6 వేల కుటుంబాలు పాలుపంచుకుంటున్నాయి. జీఐ ట్యాగ్‌.. వీరందరికీ గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తుంది. మంచి డిజైన్‌లను రూపొందించడానికి, కొత్తవి తయారు చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మార్కెట్లో గాజులకు డిమాండ్‌తో పాటు అమ్మకాలు పెరిగి హస్తకళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది’’ అని ఆర్టిజన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ హిసాముద్దీన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు