‘హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి’

హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

Updated : 03 Mar 2024 08:01 IST

చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించండి
ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు

ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగుస్తున్నా.. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ‘ప్రజాసంక్షేమ సేవాసంఘం’ కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్‌ ఈ పిల్‌ను దాఖలు చేశారు. 2034 జూన్‌ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఏపీ సీఎస్‌ను ఆదేశించాలన్నారు. ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ అమలుచేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్‌, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సహకారం, పరస్పర అవగాహన ఒప్పందం లేకపోవడం, చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్రప్రభుత్వం విఫలం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల, అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారి తీసిందన్నారు. ఆస్తులు, అప్పుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నా అందుకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైందని తెలిపారు. విభజన చట్టం అమలులో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం దృష్టిపెట్టకపోవడంతో వివాదాలు కోర్టులకు చేరుతున్నాయన్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తుల, అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే చట్టబద్ధంగా ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. విభజన చట్ట నిబంధనలు అమలుకానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని