పన్నుల మీద పన్నులు.. జనానికి జగన్‌ వాతలు!

హాలీవుడ్‌ హారర్‌ సినిమాల్లోని డ్రాకులా పాత్ర ప్రపంచ ప్రసిద్ధమైనది. మనుషుల రక్తం తాగి బతుకుతుంటుంది అది.

Updated : 18 Apr 2024 16:33 IST

హాలీవుడ్‌ హారర్‌ సినిమాల్లోని డ్రాకులా పాత్ర ప్రపంచ ప్రసిద్ధమైనది. మనుషుల రక్తం తాగి బతుకుతుంటుంది అది. ఆ రక్తపిశాచికి ఏమాత్రం తీసిపోనట్లు చెత్త పన్నులూ, ఛార్జీల రూపేణా జనం మూలుగలను పీల్చి పడేశారు జగన్‌మోహన్‌రెడ్డి. ‘‘వ్యవస్థను మార్చడం కోసం మీ ముద్దుబిడ్డ బయల్దేరాడు’’ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రమంతా తిరిగారు జగన్‌. అలా చెప్పి అధికారంలోకి వచ్చి, ఆయన తెచ్చిన మార్పు ఏంటంటే- వ్యవస్థాగత దోపిడీని విశృంఖలం చేశారు. పెట్రోలు, డీజిలు, కరెంటు, బస్సు టిక్కెట్లు, రిజిస్ట్రేషన్లు... ఇలా ప్రతిచోటా ప్రజలను విపరీతంగా బాదేశారు. జిజియా పన్నుతో జనాన్ని పీడించిన ఔరంగజేబు కంటే దారుణంగా ప్రజానీకాన్ని నిలువుదోపిడీ చేశారు జగన్‌. అలాంటాయన తనది సంక్షేమ ప్రభుత్వమంటూ గొర్రెతోలు కప్పుకొన్న తోడేలును గుర్తుచేస్తున్నారు.


జనం జేబులకు కత్తెరేసిన జగన్‌

అభివృద్ధికి ప్రాధాన్యమిస్తే- వ్యాపార, ఉద్యోగావకాశాలు విస్తరిస్తాయి. ప్రజల వ్యక్తిగత ఆదాయాలు అధికమవుతాయి. తద్వారా రాష్ట్రానికి రాబడి పెరుగుతుంది. ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం- ప్రజాస్వామ్య ప్రభుత్వ కర్తవ్యం. పన్నుల మీద పన్నులేసి జనాన్ని చావగొట్టడం- రాచరిక ప్రభువుల కర్కశత్వం. దాన్ని బాగా ఒంటపట్టించుకున్న నిరంకుశ పాలకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన దృష్టిలో సర్కారీ ఖజానాను నింపడం అంటే- పన్నుల మోత మోగించి జనం జేబులను ఊడ్చి పారేయడమే. ప్రజల నుంచి డబ్బులను ఎలా పిండుకోవచ్చు అన్నదానిపై అధికారంలోకి వచ్చిన కొత్తలోనే యంత్రాంగానికి పాఠాలు చెప్పారు జగన్‌. ‘‘హరిత పన్ను, చెత్త పన్ను వంటి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచడంపై కసరత్తు చేయాలి’’ అని 2019 జూన్‌లోనే అధికారులకు ఆదేశాలిచ్చారు. ‘‘ప్రభుత్వమనేది ఒక బాధ్యతాయుతమైన వ్యవస్థ. అది ప్రజాభిప్రాయానికి లోబడి ఉండాలి. కాబట్టి, ఒక ప్రైవేటు అక్రమ సంపాదనాపరుడిలాగా ప్రభుత్వం ఎప్పుడూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించరాదు’’ అన్న అంబేడ్కర్‌ సూచనకు వీసమెత్తు గౌరవం ఇవ్వలేదు జగన్‌. ప్రజల పట్ల బాధ్యతగా మెలగడం అన్నది ఆయనకు అలవాటు లేని పని. అందువల్లే చెడ్డీగ్యాంగ్‌, పార్థీగ్యాంగ్‌లను మించిపోయి జనాన్ని కొల్లగొట్టారు. కరోనా మహమ్మారి దెబ్బకు ఆదాయాలు పడిపోయి ప్రజలంతా అల్లాడిపోతున్నా జగన్‌ కనికరం చూపలేదు. ఆయన సీఎం అయ్యాక అయిదేళ్లలో నానారకాల శిస్తులు, సుంకాలు, అధిక ధరలు, ఛార్జీల రూపంలో మొత్తం 1.07 లక్షల కోట్ల రూపాయల మేరకు అదనపు ఆర్థిక భారాన్ని జనంపై మోపారు.


కరెంటు షాకుల కర్కోటక సర్కారు

‘‘పేదవాడు ఇంట్లో కరెంట్‌ స్విచ్‌ ఆన్‌ చేయాలంటే భయపడుతున్నాడు’’ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ బొటాబొటా కన్నీళ్లు కార్చేశారు. ‘‘ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల భారం మోపడం అన్యాయం’’ అని గట్టిగా వాదించారు. అన్ని మాటలు మాట్లాడిన పెద్దమనిషి ముఖ్యమంత్రి అయితే కరెంట్‌ ఛార్జీలను తగ్గిస్తారని జనం నమ్ముతారు కదా. జగన్‌ కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక, ఆ వేదిక పైనుంచే విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గిస్తానని నమ్మబలికారు. కానీ, ఆ తరవాతే తడిగుడ్డతో ప్రజల గొంతుకోశారు. స్థిరఛార్జీలు, ట్రూఅప్‌ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు... ఇలా ఏదో ఒక పేరుతో ఏడాదికి ఒక కొత్త బాదుడును జనానికి కానుకగా ఇచ్చారు జగన్‌. మొన్న డిసెంబరులో ఒక వినియోగదారుడు 84 యూనిట్ల కరెంటును వాడుకున్నారు. లెక్కప్రకారం అతని దగ్గర రూ.232 తీసుకోవాలి. పాత టారిఫ్‌, విద్యుత్‌ సుంకం, కస్టమర్‌ ఛార్జీల ప్రకారమైనా సరే- రూ.268.44కు మించి కాదు. కానీ, జగన్‌ సర్కారు మాత్రం రూ.499.34 బిల్లు చేతికిచ్చింది. ఇలా ప్రతినెలా రాష్ట్రవ్యాప్తంగా 1.52 కోట్ల గృహ విద్యుత్తు వినియోగదారుల నుంచి రెట్టింపు స్థాయిలో దండుకుంటున్నారు. జగన్‌. కొవిడ్‌ దెబ్బకు ఇళ్లకు పరిమితం కావడంతో పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు పస్తులుండాల్సి వచ్చింది. ఉద్యోగాలు పోయి, జీతాలు తగ్గిపోయి, వీధి వ్యాపారాలతో పాటు చిన్న చిన్న దుకాణాల్లోనూ రాబళ్లు పడిపోయి జనం నానా బాధలు పడ్డారు... ఇంకా పడుతూనే ఉన్నారు. పైగా నిత్యావసరాల ధరలు భగ్గుమం టున్నాయి. అయినప్పటికీ జనం మీద జాలిలేని జగన్‌ శ్లాబులు, యూనిట్ల రేట్లు మార్చి దోపిడీని పైఎత్తులకు తీసుకెళ్లారు. విద్యుత్తుపై జగన్‌ అదనపు వడ్డనలను భరించలేక లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఫెర్రో ఎల్లాయ్స్‌ పరిశ్రమలు కుదేలయ్యాయి. నిర్వహణ భారంతో స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడ్డాయి. కరెంట్‌ ఛార్జీలకు జడిసి మగ్గాలను అమ్మేసుకుని కూలి పనుల్లోకి మరలిపోయిన నేతన్నలు చాలామంది ఉన్నారు. ఇలా అన్ని వర్గాలకూ కరెంట్‌ షాకులిచ్చిన జగన్‌- ఇంటింటి బడ్జెట్లను తల్లకిందులు చేశారు.


చెత్త పన్నులు... చెత్త పాలన!

‘‘నా నోట్లోంచి అబద్ధాలు రావు’’ అని జగన్‌ ఇటీవల శాసనసభలోనే యమగొప్పగా సెలవిచ్చారు. నిజంగా ఆయన అంతటి సత్యవాక్కు పరిపాలకుడైతే- డొంకతిరుగుడు మాటలేమీ లేకుండా రెండు ప్రశ్నలకు సూటిగా సమాధానమివ్వగలరా? వైకాపా అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిలుపై కొత్తగా ఎన్ని పన్నులేశారు... ఆరూపంలో ఎంత సొమ్మును జనం నుంచి గుంజిపారేశారు? వీటికి జవాబులు చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా? ఉందని నిరూపించుకుంటూ నిజాలన్నీ ఒప్పుకోగలిగితే ఆయనకు ఎంచక్కా ‘కలియుగ సత్యహరిశ్చంద్రుడు’ అనే బిరుదు ఇవ్వొచ్చు. కానీ, మారీచుణ్ని మించిన మాయావి అయిన జగన్‌ ఏనాడూ వాస్తవాలను చెప్పరు. తాను చేస్తున్న పచ్చిమోసాలను ససేమిరా ఒప్పుకోరు. మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రోలు, డీజిలు ధరలు ఎక్కువగా ఉన్నాయని విపక్షనేతగా జగన్‌ గొంతుచించుకున్నారు. సీఎం పదవిలోకి వచ్చాకేమో ఆ రెండింటిపై అదనపు వ్యాట్‌ను రెండింతలు చేశారు. రహదారి అభివృద్ధి సుంకం పేరిట ప్రతి లీటర్‌పై ఇంకో రూపాయి లాభం వేసుకున్నారు. ఆ డబ్బుతో రోడ్లు ఏమైనా బాగుచేశారా అంటే అదీ లేదు. పెట్రోలు, డీజిలుపై అడ్డగోలు బాదుడు ద్వారానే దాదాపు రూ.20 వేల కోట్లను జగన్‌ సర్కారు వెనకేసుకుంది. చిరువ్యాపారులు, రైతుల పెట్టుబడి ఖర్చులను పెంచేసి కుటుంబాలను ఇంకా గుల్ల చేసింది. ఇక చెత్త పన్ను అనే దౌర్భాగ్య ఆలోచన మరే ప్రభుత్వాధినేతకూ కనీసం వచ్చి ఉండదేమో! వ్యర్థాల పేరు చెప్పి దాదాపు రూ.400 కోట్ల వరకు జనం డబ్బులను నిర్దాక్షిణ్యంగా లాక్కుంటున్న జగన్‌- ‘మీ బిడ్డ మీకోసం బటన్‌ నొక్కాడు’ అని చెప్పుకోవడం సిగ్గుచేటు!


ఓటీఎస్‌ వాయింపు

సామాన్యుల కష్టార్జితాలను లూటీ చేసేందుకు ఎన్నో కుటిల మార్గాలను కనిపెట్టారు జగన్‌. వాటిలో ప్రధానమైనది ఓటీఎస్‌(ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌). 1983-2011 మధ్యకాలంలో రాష్ట్రంలోని పేదలకు వివిధ ప్రభుత్వాలు ఇళ్లు మంజూరు చేశాయి. ఆ మేరకు చాలామంది అప్పట్లో గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. వాటిపై సంపూర్ణ హక్కులు కావాలంటే- సంబంధిత లబ్ధిదారులు ‘ఓటీఎస్‌’ కింద సొమ్ము చెల్లించాలంటూ జగన్‌ సర్కారు హఠాత్తుగా బాంబు పేల్చింది. గ్రామీణ లబ్ధిదారులు రూ.10వేలు, మున్సిపాలిటీలకు చెందిన వారు రూ.15వేలు, కార్పొరేషన్ల పరిధిలోని వారు రూ.20వేలు కట్టాలని పట్టుబట్టింది. ఆ తరవాత పట్టణాలు, నగరాల్లో ‘ఓటీఎస్‌’ మొత్తాన్ని రూ.10 వేలకు తగ్గించింది. ఏతావాతా దాదాపు 39 లక్షల కుటుంబాల నుంచి రూ.3900 కోట్లను కొట్టేయడానికి జగన్‌ సై అన్నారు. ఎప్పుడో దశాబ్దాల కిందట సర్కారీ సాయం పొందినవారి వెంటపడి డబ్బులు వసూలు చేయాలనుకోవడం పైశాచికత్వం కాకపోతే ఏంటి? జగన్‌ సర్కారు ఆ విధంగానే సామాన్యులను వేధించి గల్లాపెట్టెలు నింపుకోవడం మొదలెట్టింది. ప్రజావ్యతిరేకత పోటెత్తడంతో ‘ఓటీఎస్‌’ను తాత్కాలికంగా పక్కనపెట్టింది కానీ, పూర్తిగా రద్దు చేయలేదు. కానీ, జగన్‌మోహన్‌రెడ్డి తనకు అలవాటైన రీతిలోనే ఇంకో రకంగా జనం నెత్తిన చెయ్యి పెట్టారు. జగన్‌ సర్కారు మాటలు నమ్మో, వేధింపులను తట్టుకోలేకో ‘ఓటీఎస్‌’ కింద డబ్బులు కట్టి గృహహక్కు పత్రాలు తీసుకున్న లబ్ధిదారులకు అవి ఉపయోగపడటం లేదు. క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లకే కాదు- బ్యాంకులో పెట్టి రుణం తీసుకోవడానికీ ‘జగనన్న కాగితాలు’ పనికి రావడం లేదు.


పేదలను కొల్లగొట్టిన జగన్‌

జనం చెమటోడ్చి సంపాదించుకున్న డబ్బులను జగన్‌ ఎన్నెన్ని రకాలుగా కొట్టేశారో వివరంగా చెప్పాలంటే మహాభారతం అవుతుంది. డొక్కు బస్సులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆయన- ఆర్టీసీ బస్సు ఛార్జీలను మాత్రం మూడు సార్లు పెంచేశారు. వాటి ద్వారా అయిదేళ్లలో రూ.5 వేల కోట్లకు పైగా పిండుకున్నారు. భూముల మార్కెట్‌ విలువలను సవరించడం, స్టాంప్‌ డ్యూటీని తలకు మించిన భారంగా మార్చడం తదితరాలతో వెయ్యి కోట్ల రూపాయల వరకు జనాన్ని దోచేశారు. ఆస్తిపన్నులను ఆకాశమంత పెంచడం మొదలు నీటితీరువా బకాయిల వసూలుకు రైతాంగం మెడపై కత్తిపెట్టడం వరకు జగన్‌ ధనదాహం అంతులేనిది. అంతకు మునుపు ఈసీ (ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌) జారీకి పది రూపాయలు తీసుకునేవారు. జగన్‌ సర్కారు దాన్ని ఏకంగా వంద రూపాయలు చేసేసింది. ‘‘ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసిందని గర్వంగా చెబుతున్నా’’ అని జగన్‌ ఈమధ్యనే బోరవిరుచుకున్నారు. ఆయన పాలన అంత మంచిదైతే- పేదలకు ఇచ్చే రేషన్‌ సరుకుల ధరలను ఎందుకు పెంచారు? కందిపప్పు, పంచదారలకు ఎక్కువ రేటు కట్టి బీదల నుంచి దాదాపు రూ.8500 కోట్లు కొల్లగొట్టిన కుటిలబుద్ధి జగన్‌ది. లారీ యజమానులపై పన్నుల బరువును విపరీతంగా పెంచి సరకు రవాణా రంగాన్ని దెబ్బతీసిన అధ్వాన పాలన ఆయనది. పన్నులూ ఛార్జీల దుడ్డుకర్ర పుచ్చుకుని జగన్‌ కొట్టిన కొట్టుడుకు కుదేలుకాని రంగమంటూ ఏదీ లేదు... కన్నీళ్లు పెట్టని సామాన్య కుటుంబమూ లేదు. జనానికి ఇంతగా చెడు చేసి మళ్లీ ‘‘మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం’’ తన గురించి తాను ఎలా చెప్పుకోగలుగుతున్నారో జగన్‌- ఖర్మ! ఖర్మ!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని