సైబర్‌, క్రిప్టో కరెన్సీ నేరాలకు కఠిన శిక్షలుండాలి

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌కు బదులుగా త్వరలో అమల్లోకి రానున్న కొత్త శిక్షాస్మృతి ‘భారతీయ న్యాయ సంహిత’ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ స్వాగతించారు.

Updated : 03 Mar 2024 06:13 IST

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ పీనల్‌ కోడ్‌కు బదులుగా త్వరలో అమల్లోకి రానున్న కొత్త శిక్షాస్మృతి ‘భారతీయ న్యాయ సంహిత’ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ స్వాగతించారు. వందల ఏళ్ల నుంచి అమలవుతున్న ఐపీసీకి బదులుగా భారతీయ న్యాయ సంహితను తీసుకురావడం మంచిదేనన్నారు. నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం, ఇండియా ఫౌండేషన్‌లు శనివారం హైదరాబాద్‌లో సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సైబర్‌, క్రిప్టో కరెన్సీ నేరాలకు పాల్పడిన నేరగాళ్లకు సాధారణ దొంగతనాల మాదిరిగానే శిక్షలున్నాయని, భవిష్యత్తులో కఠిన శిక్షలుండేలా చట్టసభలు నిర్ణయం తీసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తిని మినహా కుట్రదారుల పాత్రను ఈ చట్టం పట్టించుకోలేదన్నారు. చట్ట రూపకర్తలు విస్మరించారో... ప్రణాళిక ప్రకారం వదిలిపెట్టారో తెలియడం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. కొత్త చట్టాల రూపకల్పనలో నిపుణులు మంచి కసరత్తు చేశారన్నారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో దోషపూరిత హత్య(కల్పబుల్‌ హోమిసైడ్‌) కింద శిక్షలను పెంచే నిబంధనలను పొందుపర్చడాన్ని స్వాగతించే చర్యగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘న్యూ క్రిమినల్‌ మేజర్‌ యాక్ట్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం వీసీ శ్రీకృష్ణదేవరావు, జమ్మూకశ్మీర్‌ మాజీ డీజీపీ విక్రంజిత్‌ బెనర్జీ, మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని