కన్నీళ్లే తాగాలేమో..!

రాష్ట్రంలోని వివిధ నగరాల్లో జలఘోషలు మిన్నంటుతున్నాయి. నీటి కొరత ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. నీళ్లున్న చోట కూడా సరిగా సరఫరా చేయడం లేదు.

Updated : 03 Mar 2024 07:02 IST

రాష్ట్రంలో తీవ్రమవుతున్న నీటి కష్టాలు
సొంత ప్రభుత్వంపై దండెత్తుతున్న వైకాపా కార్పొరేటర్లు
జగన్‌ అశ్రద్ధతో మెరుగవ్వని సరఫరా వ్యవస్థ
సమస్యపై సీఎం సమీక్ష లేదు.. పరిష్కారం అంతకంటే లేదు

నిద్రపోయే వారిని లేపడం సులభం... నిద్ర నటిస్తున్న వారిని లేపడం అసాధ్యం!! ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకుని... అధికారంలోకి వచ్చిన జగన్‌... ఐదేళ్లుగా కుంభకర్ణ నిద్రను నటిస్తున్నారు! ఈసారి వర్షాలు సరిగా కురవలేదని... నీటిఎద్దడి తలెత్తే ప్రమాదముందని తెలుసు... తన ప్రభుత్వ నిర్వాకం కారణంగానే.. నీటి సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నమైన విషయమూ తెలుసు... అయినా, జగన్‌ మేలుకోలేదు... ప్రజల మేలుకోరలేదు...! ఈ తీరుపై వైకాపా శ్రేణులే మండిపడుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! వేసవిలో... ఇక జనం తమ కన్నీళ్లే తాగాలేమో!!

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలోని వివిధ నగరాల్లో జలఘోషలు మిన్నంటుతున్నాయి. నీటి కొరత ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. నీళ్లున్న చోట కూడా సరిగా సరఫరా చేయడం లేదు. కలుషిత జలాల సమస్య ఉండనే ఉంది. ప్రజల నుంచి ఆస్తి పన్ను, చెత్త పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ, తాగునీటిని అందించడంపై ప్రభుత్వానికి ఉండటంలేదు. నీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లపైకి వచ్చే దృశ్యాలు జనవరి ప్రారంభం నుంచే కనిపించాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో కుళాయి కనెక్షన్ల నుంచి కాకుండా ట్యాంకర్లతో నీటిని అందించే సన్నివేశాలు ఇప్పుడే సాక్షాత్కరిస్తున్నాయి. విజయవాడ, విశాఖల్లో పరిస్థితి తీవ్రమవుతోంది. గుంటూరులో ఇటీవల కలుషిత నీరు తాగి నలుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో ఆసుపత్రుల పాలయ్యారు. అయినా జగన్‌కు చీమకుట్టినట్లయినా లేదు. ఓట్ల లెక్కలే తప్ప ప్రజలు ఏమైపోతున్నారో అనేది పట్టదా? కనీసం సమీక్ష చేయాలన్న ఆలోచన కూడా లేకపోతే ఎలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నీటి కష్టాలు ‘అనంత’ం

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనంతపురం నగర ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు. నీళ్లు సమృద్ధిగా ఉన్నా వాటిని పంపింగ్‌ చేసి ప్రజలకు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. వేసవిలో ఎలాంటి సమస్య తలెత్తినా తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు ఉండాలి. ఇక్కడ అందుకు విరుద్ధమైన పరిస్థితి. నీటిని పంపింగ్‌ చేసే నాలుగు మోటార్లలో రెండు పాడైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. రెండు మోటార్లనే వాడుతూ ప్రజలకు అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. అదికూడా రోజు విడిచి రోజు ఇస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. దాంతో వైకాపా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రజలే ఖాళీ బిందెలతో ఆందోళనలు చేస్తున్నారు.

గుంటూరులో కాటేస్తున్న కలుషిత జలాలు

కలుషిత జలాలు గుంటూరు నగర ప్రజలకు ప్రాణాంతకంగా మారాయి. శివారు ప్రాంతాల్లో ఇప్పటికే నీటి సమస్య తలెత్తింది. మిగతాచోట్ల అరకొరగా చేస్తున్న సరఫరాలోనూ కలుషిత నీరే వస్తోంది. ఇలాంటి నీళ్లు తాగి నెలరోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరారు. తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వహణలో, పర్యవేక్షణలో లోపాలు ప్రజల పాలిట శాపాలవుతున్నాయి అనడానికి ఈ మరణాలే తాజా ఉదాహరణలు. తాగునీటి సరఫరా విభాగానికి ఇప్పటికీ రెగ్యులర్‌ పర్యవేక్షక ఇంజినీరు (ఎస్‌ఈ) లేరు. పోస్టును భర్తీ చేసే తీరిక ప్రభుత్వానికి లేదు. ఫలితంగా సిబ్బందిపై పర్యవేక్షణ, నియంత్రణ లోపిస్తోంది. రోజూ నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేసే కీలకమైన పనులు కాగితాలపైనే సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు తగిన సూచనలు చేయాల్సిన ఉన్నతాధికారులు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. కలుషిత నీటితో నలుగురు మృతి చెందాక గానీ కలెక్టర్‌ నుంచి పురపాలక శాఖ కమిషనర్‌ వరకు స్పందించలేదు. అప్పటివరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. నగర శివారులోని ఎస్‌వీఎన్‌ కాలనీ, జేకేసీ రోడ్‌, వికాస్‌నగర్‌, పలకలూరు రోడ్డు, స్వర్ణభారతినగర్‌, రెడ్డిపాలెం, గోరంట్ల, ప్రగతినగర్‌, పొన్నూరురోడ్‌ తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఒంగోలులో సరిపడా సరఫరానే లేదు

తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు పూర్తి చేయని కారణంగా ఒంగోలు నగర ప్రజలకు నీటికష్టాలు నిత్యకృత్యమయ్యాయి. పైగా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. చివరకు ఇచ్చినప్పుడే తాగునీళ్లన్న పరిస్థితిని తీసుకొచ్చారు. కొన్ని కాలనీలకు మూడు రోజులకోసారి, ఇంకొన్నింటికి నాలుగు రోజులకోసారి నగరపాలక సంస్థ నీటిని సరఫరా చేస్తోంది. శివారు కాలనీల ప్రజలు నీటి కోసం ఆందోళనలు చేయడం సర్వసాధారణమైంది. నగర ప్రజల తాగునీటి అవసరాలకు రోజూ 37 మిలియన్‌ లీటర్ల నీళ్లు అవసరమని అంచనా. ఎప్పుడూ ఈ స్థాయిలో నీరు సరఫరా చేసిన దాఖలాల్లేవు. మూడు, నాలుగు రోజులకోసారి ఇస్తున్న నీరు కూడా అర గంటకు మించి రావడం లేదు. అదీ సన్నటి ధారలా వస్తూ బిందె నిండేందుకే చాలా సమయం పడుతోంది.

విజయవాడలో రోడ్లపై ఆందోళనలు

కృష్ణా నది చెంతనే ఉన్నా విజయవాడలోని అనేక ప్రాంతాల ప్రజలు నీటి కొరతతో అల్లాడుతున్నారు. ప్రత్యేకించి శివారు కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా తయారైంది. జక్కంపూడి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి నీరు రావడం లేదని స్థానికులు ఇటీవల జక్కంపూడి రహదారిపై బైఠాయించి, నిరసన వ్యక్తంచేశారు. గుణదల ప్రాంతంలోని జయప్రకాశ్‌నగర్‌ సహా చుట్టుపక్కల కాలనీల ప్రజలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. వీరంతా ఇటీవల రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. అప్పటికిగానీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోలేదు. నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలకు శుద్ధి చేయని బోరు నీటిని సరఫరా చేస్తున్నారు. పటమటలోని జేడీనగర్‌కు చెందిన అనేక ప్రాంతాలకు ట్యాంకుల్లోకి నింపిన బోర్ల నీటినే అందజేస్తున్నారు. నీటిని శుద్ధి చేయని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాఘవనగర్‌ తదితర ప్రాంతాలకు సైతం తాగునీరు సరిగా ఇవ్వడం లేదు.

కడప గడపలో సమస్య నిత్యకృత్యం

కడప నగర ప్రజలకు తాగునీటి సమస్య నిత్యకృత్యమైంది. నగరంలోని సగం ప్రాంతాలకు నీటిని రోజు విడిచి రోజు, మిగిలిన ప్రాంతాలకు రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, మోటార్ల మరమ్మతు, ఇతర సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు సమస్య మరింత తీవ్రమవుతోంది. నాలుగు లక్షల జనాభాకు రోజూ 52 మిలియన్‌ లీటర్ల నీటిని పంపిణీ చేయాలి. తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరిచేందుకు అమృత్‌-2లో రూ.68 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది. వాటర్‌ వర్క్స్‌ వద్ద బావులు తవ్వి రోజూ 28 మిలియన్‌ లీటర్ల నీరు అదనంగా సేకరించి ప్రజలకు సరఫరా చేయాలన్నది ఉద్దేశం. 2017లో గుత్తేదారు సంస్థకు కేటాయించినా ఇప్పటికీ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ఒప్పందం ప్రకారం 2019 మార్చి నాటికి పూర్తి చేయాలి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు ముందుకెళ్లడం లేదు.


వైకాపా కార్పొరేటర్ల ముట్టడి!

తాగునీటి సమస్యపై అనంతపురంలో అధికార పార్టీ కార్పొరేటర్లు ప్రభుత్వంపై ఇటీవల దుమ్మెత్తిపోశారు. మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో జగన్‌ సర్కారుపై నిరసన వ్యక్తంచేశారు. రెండు నెలలుగా నీళ్లు సరిగా రావడం లేదని నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఇటీవల ముట్టడించారు. ఎమ్మెల్యే, మేయర్‌, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆందోళనలు సహజంగా ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. కానీ, తమ అధినేత పాలన తీరుపై చిర్రెత్తుకొచ్చిన వైకాపా కార్పొరేటర్లే ప్రభుత్వంపై దండెత్తారు. ఒకట్రెండు రోజులో... వారం, పది రోజులో కాదని... ఏకంగా రెండు నెలలుగా నీరు సరిగా రావడంలేదని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని