విశాఖ తీరానికి‘ఏ2’ తూట్లు!

రూ.వేల కోట్ల అవినీతి కేసుల్లో ఆయన ఏ2. అధికారంలో ఉన్నది ఏ1. ఇంక అడ్డేముంది. ఏం చేసినా అడిగే ధైర్యం ఎవరికి ఉంది?.. అన్నట్లు సాగుతోంది ఏ2 అక్రమాల దందా.

Updated : 03 Mar 2024 06:49 IST

విజయసాయిరెడ్డి బంధువు, అనుచరగణం కబ్జాలో భీమిలి
కుమార్తె పేరుతో స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు అడుగులు!
సీఆర్‌జడ్‌ నిబంధనలు ఉల్లంఘించి కాంక్రీట్‌ నిర్మాణాలు
జీవీఎంసీ బోర్డు పెట్టి మరీ ప్రైవేటు పనులు

ఈనాడు, విశాఖపట్నం: రూ.వేల కోట్ల అవినీతి కేసుల్లో ఆయన ఏ2. అధికారంలో ఉన్నది ఏ1. ఇంక అడ్డేముంది. ఏం చేసినా అడిగే ధైర్యం ఎవరికి ఉంది?.. అన్నట్లు సాగుతోంది ఏ2 అక్రమాల దందా. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇంతెత్తున లేస్తారు. నా అంత శుద్ధ పూస ఎవరూ లేరంటూ ప్రగల్భాలు పలుకుతారు. ఇది వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దోపిడీ తీరు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖలో విలువైన ప్రభుత్వ స్థలాలు, కొండలు కొల్లగొట్టారు. అయినా ఆయన భూదాహం తీరలేదు. ప్రస్తుతం ఆ నేత కబ్జాలో భీమిలి సాగర తీరం నలిగి పోతోంది. తన కుటుంబానికి చెందిన సంస్థ పేరుతో సీఆర్‌జడ్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలకు దర్జాగా తెర తీశారు. రౌడీ మూకల పహారాలో ఇసుక తిన్నెలు  ధ్వంసం చేసి, గ్రావెల్‌తో పూడ్చి కాంక్రీట్‌ కట్టడాలు సాగిస్తున్నారు. అడ్డుగా ఉన్న గెడ్డలను సైతం పూడ్చి వేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.

ఆ నిర్మాణాలు చేస్తుంది అనుచరగణమే

వైకాపా ఉత్తరాంధ్ర మాజీ ప్రాంతీయ ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి, కుమార్తె నేహరెడ్డి భాగస్వామ్యంగా ఉన్న అవ్యాన్‌ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీ భీమిలి-భోగాపురం బీచ్‌ రోడ్డులో కొంత కాలం కిందట విలువైన స్థలాలు కొనుగోలు చేసింది. తొలుత కొందరు బినామీల పేరుతో అల్సా అనే కంపెనీ నుంచి స్థలాలు కొనుగోలు చేసి, ఆ తర్వాత అవ్యాన్‌ రియల్టర్స్‌ పేరుపైకి బదలాయించుకున్నారు. భీమునిపట్నంలో 1516, 1517, 1519, 1523 సర్వే నంబర్లలో ఉన్న మూడున్నర ఎకరాలకుపైగా స్థలాన్ని అవ్యాన్‌ పేరిట హస్తగతం చేసుకుని.. దాంతో పాటు కొంత స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. విశాఖ నగరపాలక సంస్థ 3వ వార్డు పరిధిలోకి వచ్చే ఈ సముద్ర తీరప్రాంతంలో కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జడ్‌) నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు మొదలు పెట్టారు. సముద్ర మట్టానికి కేవలం 30 గజాల దూరంలో శాశ్వత గోడను కాంక్రీట్‌తో నిర్మించారు. ఇసుక తిన్నెలను అర్ధరాత్రి జేసీబీలతో తొలగించి, నిర్మాణాలకు అనువుగా గ్రావెల్‌తో పూడుస్తున్నారు. ఇక్కడ విజయసాయిరెడ్డి తన కూతురు పేరుతో ఓ నక్షత్ర హోటల్‌ నిర్మించాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఇదేమి చోద్యం?

ప్రహరీ నిర్మాణ సమయంలో చాకిరేవు గెడ్డను సైతం 50 శాతం పూడ్చేశారు. పైగా ఈ ప్రైవేటు నిర్మాణాల వద్ద జీవీఎంసీ బోర్డు పెట్టి ‘వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’ అని పేర్కొన్నారు. ఎవరూ ప్రశ్నించకుండా ఈ తంతుకు తెగబడ్డారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు ఆఘమేఘాలపై వెళ్లి బోర్డు తొలగించారు కానీ, ఉల్లంఘిస్తూ చేస్తున్న పనులను కన్నెత్తి చూడలేదు. టౌన్‌ ప్లానింగ్‌లో అనుమతులకు పావులు కదపగా, ఏపీసీజడ్‌ఎంఏ అనుమతులు తెచ్చుకోవాలని సూచించారు. దీంతోపాటు గెడ్డ విషయంలో ఇరిగేషన్‌ నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సూచించడంతో దాని వరకు తెచ్చినట్లు తెలుస్తోంది. సీఆర్‌జడ్‌ పరిధిలోకి వచ్చే సముద్ర తీరం నుంచి 500మీటర్ల వరకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ, కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథార్టీల అనుమతులు పొందకుండా శాశ్వత కాంక్రీట్‌ నిర్మాణాలు చేయకూడదు. సీఆర్‌జడ్‌ జోన్‌-1 పరిధిలో ఇసుక తిన్నెలను కదిలించకూడదు. అయితే సదరు నేత గ్యాంగ్‌ దర్జాగా నిబంధనలు ఉల్లంఘించింది.

తీరం వెంబడి ఇంకా ఎన్ని ఘోరాలో

భీమిలి పరిధిలో తీరం వెంబడి అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. మంగమారిపేట సమీపంలో ఓ వైకాపా నేత కొంత ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి, సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. తహసీల్దార్‌ ఏర్పాటుచేసిన బోర్డును సైతం తొలగించి కబ్జాకు తెగబడ్డారు. ఈ వైకాపా నేత సైతం విజయసాయిరెడ్డి అనుచరుడిగా చెప్పుకొంటూ.. బీచ్‌లో బండరాళ్లు వేసి కప్పేస్తున్నారు.


అప్పుడు తొలగించి... ఇప్పుడు తానే అతిక్రమించి

విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే తెన్నేటి పార్కు నుంచి భీమిలి వరకు సాగర తీరంలో సీఆర్‌జడ్‌ ఉల్లంఘనల పేరిట కొన్ని నిర్మాణాలను  తొలగించారు. కొన్ని శాశ్వత కట్టడాలను కూల్చివేశారు. జోడుగుళ్లపాలెం ఎదురుగా ఉన్న స్థలంలో కాంపౌండ్‌ వాల్‌, రుషికొండలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన ప్రహరీ, గోకార్టింగ్‌ క్రీడా ప్రాంగణం, భీమిలి సమీపంలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ కూల్చిన జాబితాలో ఉన్నాయి. ఈ కూల్చివేతల తర్వాత కొందరు బాధితులు వైకాపాలో చేరడం గమనార్హం. ఇలా చేరి పెద్దలకు వాటా ఇచ్చాక కూల్చిన బార్‌ను అదే స్థలంలో మళ్లీ తిరిగి కట్టుకునేలా అనుమతిచ్చారనే ఆరోపణలున్నాయి. అప్పుడు సీఆర్‌జడ్‌ నిబంధనల పేరుతో పలు నిర్మాణాలను తొలగించిన విజయసాయిరెడ్డి... ఇప్పుడు సొంతవారికోసం నిర్మాణాలు ఎలా చేపడుతున్నారంటూ జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని