దీపారాధన ఖర్చుల పేరిట ఇసుక దోపిడీ

గుడి దీపారాధన ఖర్చుల పేరుతో అధికార వైకాపా నేతలు బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో కృష్ణానదీ పరివాహక గ్రామమైన పెదలంకలోని ఇసుకను భారీగా కొల్లగొడుతున్నారు.

Published : 03 Mar 2024 04:04 IST

నిత్యం 200 టిప్పర్లలో తరలింపు
రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
బాపట్ల జిల్లాలో అధికారపార్టీ  ప్రజాప్రతినిధి అనుయాయుడి దందా

ఈనాడు, బాపట్ల: గుడి దీపారాధన ఖర్చుల పేరుతో అధికార వైకాపా నేతలు బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో కృష్ణానదీ పరివాహక గ్రామమైన పెదలంకలోని ఇసుకను భారీగా కొల్లగొడుతున్నారు. ఇసుక తవ్వేందుకు, లారీల్లో నింపేందుకు పొక్లెయిన్ల వాడకం ఇక్కడ నిత్యకృత్యమే. రెండు నెలలుగా ఇక్కడ ఇసుక తవ్వుతున్నా, మైనింగ్‌ అధికారులు ఆరా తీసిన పాపాన పోలేదు. ఇసుక లారీలన్నీ కొల్లూరు పోలీసుస్టేషన్‌ మీదుగానే వెళుతున్నా వారు సైతం వాటిని ఆపటం లేదు. బాపట్ల జిల్లాకు చెందిన అధికార ప్రజాప్రతినిధి ఒకరు మంగళగిరికి చెందిన తన అనుయాయుడితో ఈ అక్రమ తవ్వకాలు చేయిస్తున్నారని పెదలంక గ్రామస్థులు చెబుతున్నారు.

వారానికి రూ.లక్షన్నర

పెదలంక రామాలయంలో దీపారాధన చేయడానికి తగినంత ఆదాయం లేదు. కొన్నాళ్లపాటు ఊరి పరిధిలో ఇసుక తవ్వకాలకు అవకాశం కల్పిస్తే వారు కొంత చెల్లింపులు చేస్తారని, ఆ మొత్తంతో నిత్యం గుడి ఆధ్వర్యంలోనే దీపారాధనకు అవకాశం ఉందని గ్రామ వైకాపా నాయకుడొకరు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి గ్రామస్థులు ఆమోదం తెలిపారు. వారానికి రూ.లక్షన్నర ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇదే అదనుగా ఇసుకాసురులు గడిచిన రెండు నెలలుగా పగలు, రాత్రి తేడా లేకుండా నదీగర్భంలో ఇసుక కొల్లగొడుతున్నారు. సగటున రోజుకు 200 టిప్పర్లలో ఇసుక తరలించి ఒక్కో టిప్పరు రూ.18వేల చొప్పున విక్రయించి రోజుకు రూ.36 లక్షలు సంపాదిస్తున్నారు. నెలకు రూ.10 కోట్ల వరకు వెనకేస్తున్నారు. ఇలా రెండు నెలలుగా సాగుతున్నా, గుడికి కేవలం వారానికి రూ.లక్షన్నర చొప్పున నెలకు రూ.6 లక్షలు ఇచ్చారు. కానీ గుడి దీపారాధన పేరుతో ఇసుకాసురులు ఈ రెండు నెలల్లో రూ.20 కోట్లు సంపాదించారు. కొల్లూరు పరిధిలోని 9 లంక గ్రామాలకు చేరుకోవడానికి గతంలో తెదేపా ప్రభుత్వం అరవింద వారధి నిర్మించింది. ఆ వారధి చెంతనే ఈ తవ్వకాలు చేస్తుండటంతో భవిష్యత్తులో బ్రిడ్జి పటిష్ఠతకు ప్రమాదమని లంకగ్రామాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా ఇసుక తవ్వుతున్న యంత్రాల శబ్దానికి కునుకు కరవవుతోందని గ్రామస్థులు వాపోతున్నారు.


గుక్కెడు నీటికీ ఇబ్బందే

భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో గుక్కెడు నీళ్లకూ ఇబ్బంది పడే పరిస్థితి దాపురించిందని సీపీఎం నాయకుడు సురేష్‌ అన్నారు. ఇక్కడి అక్రమ తవ్వకాలపై గతంలోనే కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, ఆ ఒక్క రోజు హడావుడి తప్ప ప్రయోజనం లేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని