జీతాల్లేకుండా ‘పొరుగు సేవల’ పోస్టులు

ఏ శాఖలో అయినా పొరుగుసేవల కింద పోస్టుల భర్తీ చేపట్టినా.. వారికి సంబంధిత గుత్తేదారు సంస్థ ద్వారానో, ఆప్కాస్‌ ద్వారానో ప్రతి నెలా జీతం ఇచ్చేలా ఆదేశాలుంటాయి.

Published : 03 Mar 2024 04:16 IST

ఆర్‌అండ్‌బీలో 467 కొలువుల భర్తీకి హడావుడి
అతిథిగృహాల్లో అద్దెలు వసూలు చేసి జీతాలివ్వాలని ఆర్థికశాఖ వింత ఆదేశాలు!

ఈనాడు, అమరావతి: ఏ శాఖలో అయినా పొరుగుసేవల కింద పోస్టుల భర్తీ చేపట్టినా.. వారికి సంబంధిత గుత్తేదారు సంస్థ ద్వారానో, ఆప్కాస్‌ ద్వారానో ప్రతి నెలా జీతం ఇచ్చేలా ఆదేశాలుంటాయి. కానీ రహదారులు భవనాల శాఖలోని ఇన్‌స్పెక్షన్‌ బంగ్లాల్లో (అతిథిగృహాల్లో) 467 పోస్టులు భర్తీ చేస్తుండగా.. వారి జీతాల విషయంలో మాత్రం విచిత్రమైన నిబంధన పెట్టారు. ప్రభుత్వం తరఫున జీతాలివ్వకుండా, ఆయా అతిథిగృహాల్లో గదులు వినియోగించుకున్నవారి నుంచి అద్దె వసూలు చేసి, వాటితో జీతాలు ఇవ్వాలంటూ ఆర్థికశాఖ ఆదేశాలిచ్చింది. ఇది జరిగే పనేనా అని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 139 ఆర్‌అండ్‌బీ అతిథిగృహాల్లో.. ఖాళీ అయిన ఆఫీస్‌ సబార్డినేట్లు, వాచ్‌మన్లు, పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మొత్తం 467 పోస్టులను పొరుగుసేవల కింద భర్తీ చేయడానికి గత ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే వీరికి జీతాలివ్వాల్సిన ఆర్థికశాఖ కొత్త ప్రతిపాదన తెచ్చింది. అతిథిగృహాలను వినియోగించుకున్న వీఐపీలు, అధికారులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దె వసూలు చేసి, ఆ సొమ్ముతో పొరుగుసేవల సిబ్బంది జీతాలు చెల్లించి, నిర్వహణ ఖర్చులకు కూడా వినియోగించాలని సూచించింది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు జనవరి 11న ఉత్తర్వులు జారీచేశారు.

అద్దెల వసూలు సాధ్యమేనా?

రాష్ట్రంలో తిరుపతి, కడప మినహా అన్ని జిల్లాల్లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహాల్లో ఒక్కో గది అద్దె నాన్‌ ఏసీకి రూ.90, ఏసీకి రూ.180 చొప్పున ఉంది. దశాబ్దాల కిందట ఖరారుచేసిన ఈ ధరల్నే ఇప్పటికీ అమలుచేస్తున్నారు. తాజాగా జాయింట్‌ కలెక్టర్‌ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేసి, స్థానిక మార్కెట్‌ ధరల ప్రకారం కొత్తగా అద్దె ధరలు ఖరారు చేసి వసూలు చేయాలని, ఆ సొమ్మంతా ఆర్‌అండ్‌బీ జిల్లా ఎస్‌ఈ ఖాతాలోకి చేరాలని సూచిస్తూ వేరొక ఉత్తర్వు ఇచ్చారు. మంత్రులు,  ఎంపీలు, ఎమ్మెల్యేలు, కల్టెక్టర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాలకు వచ్చినపుడు ఆర్‌అండ్‌బీ అతిథిగృహాలను వినియోగించుకుంటారు. వీరి నుంచి గాని, ఆయా శాఖల  నుంచి గానీ అద్దెలు వసూలు చేయడం సాధ్యమేనా? అద్దె చెల్లించాలని అక్కడి ఈఈ, డీఈ, ఏఈ స్థాయి అధికారులు అడగగలరా అనేది ప్రశ్నార్థకం. ఇలా అద్దెలు రాకపోతే, పొరుగుసేవల కింద చేరబోతున్న ఒక్కో ఉద్యోగికి రూ.15 వేల చొప్పున జీతం ఎవరిస్తారు? కొన్నిచోట్ల ముగ్గురు, నలుగుర్ని కూడా నియమిస్తున్నారు. అంటే ప్రతినెలా రూ.60 వేలు కావాలి. నిర్వహణకు ఎంత లేదన్నా ప్రతి నెలా రూ.10-20 వేలు ఖర్చవుతాయి. ఈ సొమ్మంతా అద్దెల రూపంలో రాకపోతే ఏం చేయాలో ఆర్‌అండ్‌బీ అధికారులకు అంతుచిక్కడం లేదు. 467 మందికి కలిపి నెలకు జీతాల రూపంలో రూ.70.05 లక్షలు, ఏడాదికి రూ.8.40 కోట్లు చెల్లించాలి. వీరికి జీతాలివ్వాల్సిన ఆర్థికశాఖ తెలివిగా తన బాధ్యత నుంచి తప్పించుకుంది. ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లే వారి పాట్లు వాళ్లు పడతారనేలా వదిలేసింది.

సిఫార్సులు.. ఒత్తిళ్ల పరంపర

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోపు ఆఘమేఘాలపై ఈ పోస్టులు భర్తీ చేయాలని భావిస్తున్నారు. కలెక్టర్‌/జాయింట్‌ కలెక్టర్‌ ఛైర్మన్‌గా, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కన్వీనర్‌గా కమిటీ వేసి నియామక ప్రక్రియ చేపట్టారు. గత నెల 27 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో జిల్లా నుంచి సగటున వచ్చిన 500-600 దరఖాస్తుల పరిశీలన శనివారంతో ముగిసింది. సోమవారం జిల్లాల్లో మెరిట్‌ జాబితాలు ప్రకటిస్తారు. అభ్యంతరాలను పరిశీలించి, తుది మెరిట్‌ జాబితా 8న ప్రకటిస్తారు. 11న నియామక ఆదేశాలు ఇవ్వనున్నారు. 11వ తేదీ తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉండటంతో, ఆలోగా పూర్తిచేయాలన్నది ఆలోచన. మరోవైపు దరఖాస్తుదారుల్లో తమకు తెలిసినవారు ఉన్నారని, వారికి పోస్టింగ్‌ ఇవ్వాల్సిందేనంటూ పలు జిల్లాల్లో అమాత్యులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దసంఖ్యలో సిఫార్సు లేఖలిచ్చారు. పదోతరగతి మార్కులు, గతంలో పొరుగుసేవల కింద పనిచేసిన అనుభవం వంటి వాటి ఆధారంగా పాయింట్లు కేటాయించి ఎంపిక చేయాలి. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు బలంగా పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని