కొత్త చట్టాలపై అవగాహన అవసరం

‘న్యాయవ్యవస్థలో వస్తున్న మార్పులు.. కొత్త చట్టాలపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి.

Published : 03 Mar 2024 04:19 IST

గుంటూరులో పీపీల సమావేశంలో ఏజీ శ్రీరాం
అవార్డు అందుకున్న కాసేపటికే ఏపీపీ మృతి

ఈనాడు, అమరావతి: ‘న్యాయవ్యవస్థలో వస్తున్న మార్పులు.. కొత్త చట్టాలపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే వృత్తిలో బాగా రాణించగలరు’ అని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం అన్నారు. రాష్ట్రంలోని జిల్లా కోర్టులు, మేజిస్ట్రేట్‌ కోర్టుల్లో పనిచేసే పీపీలు, ఏపీపీలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాల జింఖానా ఆడిటోరియంలో శనివారం సెమినార్‌ ఏర్పాటు చేశారు. శ్రీరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... కష్టపడటంతో పాటు నిబద్ధత, నిజాయతీలతో ఉండాలని సూచించారు. అనంతరం డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ జె.సుదర్శనరెడ్డి మాట్లాడుతూ... దోషులకు శిక్షపడేలా ప్రాసిక్యూటర్లు బలంగా వాదనలు వినిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త క్రిమినల్‌ న్యాయచట్టాలపై పీపీలు, ఏపీపీలకు అవగాహన కల్పించారు. జిల్లాకు ఆరుగురి చొప్పున ఉత్తమ ప్రాసిక్యూటర్లను ఎంపిక చేసి సత్కరించారు. కార్యక్రమంలో లా సెక్రటరీ సత్యప్రభాకర్‌, హైకోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాగిరెడ్డి, గుంటూరు జిల్లా ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పాతూరి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

అంతలోనే విషాదం...

విశాఖ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న గాయత్రి(50) సమావేశానికి హాజరయ్యారు. అతిథుల చేతులమీదుగా బెస్ట్‌ ప్రాసిక్యూటర్‌ అవార్డు అందుకుంటూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు. వేదిక దిగి తన సీట్లో కూర్చున్న వెంటనే కాళ్లూ చేతులూ కొట్టుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఫిట్స్‌ వచ్చాయనుకుని సహచర ఉద్యోగులు సపర్యలు చేశారు. సాధారణ స్థితికి రాకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సీపీఆర్‌ చేసినా స్పందన లేకపోవడంతో గాయత్రి చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని విశాఖకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని