జూనియర్‌ కళాశాలల అనుమతుల జాతర!

ఎన్నికల ముందు ఆదాయం వచ్చే పనుల్ని ఉత్తరాంధ్ర కీలక మంత్రి చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు అనుమతులకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 03 Mar 2024 04:20 IST

ఒక్కో దానికి రూ.7-8 లక్షల చొప్పున వసూళ్లు
ఉత్తరాంధ్ర కీలక మంత్రి కేంద్రంగా పైరవీలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల ముందు ఆదాయం వచ్చే పనుల్ని ఉత్తరాంధ్ర కీలక మంత్రి చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు అనుమతులకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకేసారి ఎక్కువ కళాశాలల జాబితా లేకుండా కొన్నింటిని ఒక విడత.. మరికొన్నింటికి ఇంకో విడతగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫార్సు లేఖలతో పాటు అమ్యామ్యాలు సమర్పిస్తే చాలు ఆయా దస్త్రాలు చకచకా కదులుతున్నాయి. కొత్త కళాశాలలను వైకాపా నాయకులు, వారి అనుచరులకే ఎక్కువగా కట్టబెడుతున్నారు. ఒక్కో దానికి అన్ని స్థాయిల్లో కలిపి రూ.7-8 లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

నిబంధనలు గాలికి

ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలంటే ముందు సర్వే చేయాలి. ఏటా అయా ప్రాంతాల్లో పదో తరగతి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఎంతమంది? అక్కడ అందుబాటులో ఉన్న కళాశాలల్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు అనుగుణంగా ఇంటర్మీడియట్‌ విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేయాలి. అలా చేస్తే పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ విధానానికి స్వస్తి పలికిన కీలక మంత్రి పైరవీలకు తెర తీశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ఉన్నత పాఠశాలలను ఉన్నతీకరిస్తోంది. ఇప్పటికే 292 చోట్ల బాలికల కళాశాలల్ని ఏర్పాటు చేసింది. వీటిల్లోనే ప్రవేశాలు దారుణంగా ఉన్నాయి. సగటున ఒక్కోచోట చేరింది కేవలం 17 మంది మాత్రమే. వచ్చే ఏడాది సర్కారు కొత్తగా కోఎడ్యుకేషన్‌ కోసం 207 కళాశాలలను ఏర్పాటు చేయబోతోంది. వీటిల్లో ప్రవేశాలకూ అయా ప్రాంతాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన వారే కావాలి. వీటి పరిస్థితే ఇలా ఉంటే, అవేమీ పట్టించుకోకుండా డబ్బుల కోసం ఇష్టారాజ్యంగా ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు అనుమతులు ఇస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని