ఆరోగ్యశ్రీలో.. మాయరోగాలు!

ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులు పక్షవాతం(ఇస్కీమిక్‌ స్ట్రోక్‌) కేసులకు చికిత్స అందించినట్లు నకిలీ బిల్లులు పెట్టి వందల కేసుల్లో కోట్లాది రూపాయలు కొట్టేశాయి.

Published : 03 Mar 2024 04:26 IST

లేని రోగాలకు వైద్యం చేసినట్లు ఆసుపత్రుల టోకరా!
‘ఆసరా’ డబ్బు కోసం డ్రామాలు
ఆరోగ్యశ్రీలో అంతులేని అక్రమాలు
ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం

ఓ సినిమాలో.. చనిపోయిన వ్యక్తికి ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యం అందించి.. డబ్బు గుంజే సీన్‌ గుర్తుందిగా... అలాంటి తెలివినే రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రులు ప్రదర్శిస్తున్నాయి. ఏ ఆరోగ్య సమస్యా లేనివారికి.. పక్షవాతం, నవజాత శిశివులకు కామెర్లు వచ్చినట్లు.. దొంగ రిపోర్టులు పెట్టి.. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఫీజుల రూపంలో ఆసుపత్రులు డబ్బు కొట్టేస్తున్నాయి. గతంలో ఈ తరహా సంఘటనలు బయటపడ్డా.. వెంటనే కఠిన చర్యలు లేకపోవడాన్ని అలుసుగా తీసుకుని మరిన్ని ఆసుపత్రులు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.


ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులు పక్షవాతం(ఇస్కీమిక్‌ స్ట్రోక్‌) కేసులకు చికిత్స అందించినట్లు నకిలీ బిల్లులు పెట్టి వందల కేసుల్లో కోట్లాది రూపాయలు కొట్టేశాయి. ఒక్కో కేసుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి రూ.22వేల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. వైద్యుల సూచన మేరకు రోగులు ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలి. దీనికిగాను ‘ఆసరా’ కింద నెలకు రూ.5వేల చొప్పున రూ.30వేల వరకు బాధితుల ఖాతాలకు జమ అవుతాయి. మధ్యవర్తులు, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది దీన్ని అదునుగా తీసుకొని... పేదలకు గాలం వేశారు. కర్నూలు, గుంటూరు చుట్టుపక్కల వారిని ఆసుపత్రులకు పిలిపించి, తొలిరోజు ఫొటో తీయించి ఇంటిపి పంపేసి.. మళ్లీ నాలుగైదు రోజులకు పిలిపిస్తున్నారు. ఈలోగా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది వారికి నకిలీ స్కానింగ్‌, రిపోర్టులు తయారుచేసి ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి పంపించి చికిత్సకు అనుమతులు పొంది.. ఆపైన చికిత్స అందించినట్లు చూపుతున్నారు. ఆసుపత్రుల నుంచి సేకరించిన రిపోర్టులు, స్కానింగులకు అనుగుణంగా డయాగ్నస్టిక్‌ కేంద్రాలను సంప్రదించగా కొన్ని స్కానింగులు, రిపోర్టులు తాము ఇచ్చినవి కావనీ, కొన్ని ఇచ్చింది తామే అయినా పాతవని.. ట్రస్టు తరపున విచారణ జరిపిన విజిలెన్స్‌ బృందాలకు వివరణ ఇచ్చాయి. మరికొన్ని కేసుల్లో డయాగ్నస్టిక్‌ సిబ్బంది కూడా ఈ కుట్రలో భాగస్వాములవుతున్నారు. ‘నెలకు రూ.5వేల ఆసరా డబ్బు వస్తుంది, మీరేమీ చేయక్కర్లేదు.. బ్యాంకు వివరాలు ఇస్తే చాల’ని డమ్మీ రోగులకు చెబుతున్నారు. గుంటూరులోని ఓ ఆసుపత్రి 300 కేసుల్లో, కర్నూలులోని ఓ ఆసుపత్రి 1,500 కేసుల్లో ఈ దందాను సాగించినట్లు బయటపడింది. ఈ కేసుల్లో అందించిన చికిత్స కంటే.. ఆసరా కింద వచ్చే చెల్లింపులు ఎక్కువ. దాంతో ఆసుపత్రుల సిబ్బంది, మధ్యవర్తులు పక్కా ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నారు.

నిర్లక్ష్యమే కొంపముంచింది.!

సరిగ్గా ఇటువంటి సంఘటనే గతేడాది తిరుపతి రుయాలో జరిగింది. గతంలో పక్షవాతంతో చికిత్స పొందిన వారి వ్యాధి నిర్థరణ పరీక్షల రిపోర్టులు, ఎక్సరేలు.. వంటి వాటిని ఉత్తుత్తి రోగుల వివరాలకు జతచేశారు. ఆరోగ్యశ్రీ నుంచి దాదాపు 50 మందికి యథావిధిగా చెల్లింపులు జరిగాయి. నిందితుల మధ్య వాటాల పంపకంలో వచ్చిన గొడవలతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. అయినా ట్రస్టు నుంచి ఎలాంటి దిద్దుబాటు చర్యలూ లేవు. నెల్లూరు జీజీహెచ్‌లోనూ ఇటీవల ఇటువంటి అక్రమాలే జరిగాయి.

శిశువులకు కామెర్లు వచ్చాయంటూ..

అక్రమార్జనకు అప్పుడే పుట్టిన శిశువులనూ వదలలేదు. శిశువులకు కామెర్లు వచ్చినట్లు చికిత్స అందించినట్లు ఫీజులు కొట్టేస్తున్నారు. ఈ కేసుల్లో ఒక్కొక్క దానికి రూ.35వేల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి.

  • నంద్యాల జిల్లా డోన్‌లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలకు సంబంధించి చికిత్స అందించినట్లు వందలమంది నకిలీ రోగుల్ని సృష్టించింది. వీటికి సుమారు రూ.1.80 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. 
  • పల్నాడు జిల్లాలోని ఓ ఆసుపత్రి యాజమాన్యం.. బాగున్న వారికి వెంటిలేటర్‌ అమర్చి ఆ ఫొటోలు, ఇతర రిపోర్టులను(సీఓపీడీ-పల్మనరీ కేసులు) ట్రస్టుకు పంపించి, ఫీజుల రూపంలో భారీగా కొట్టేసింది. విచారణలో ఇది బయటపడటంతో జరిమానా వేశారు. అధికార పార్టీ నాయకుడితో ఆసుపత్రి యాజమాన్యం ఉన్నతస్థాయిలో ఒత్తిడి తెచ్చి... రూ.50లక్షలకు పైన వేసిన జరిమానాను బాగా తగ్గించుకుంది.

ఇదెలా సాధ్యం!

కే లాంటి కేసులు అధికంగా నమోదవడంతో.. ట్రస్టు ద్వారా ప్రస్తుతం జరుగుతోన్న మెడికల్‌ ఆడిటింగ్‌(డేటా ఎనలిటిక్స్‌)లో ఈ అక్రమాలు బయటపడుతున్నాయి. వాస్తవానికి అనుబంధ ఆసుపత్రుల్లో ట్రస్టు తరఫున ‘వైద్య మిత్ర’లు పనిచేస్తున్నారు. వీరిపై టీమ్‌ లీడర్‌, జిల్లా పర్యవేక్షణ అధికారీ.. ఆపైన ట్రస్టు పర్యవేక్షణ అధికారులున్నారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నా, ఏ దశలోనూ నిరోధించే చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని