‘వైకాపా వాళ్లకంటే ముందే నువ్వు గడ్డం చేయించుకుంటావా?’

‘నువ్వు కాంగ్రెస్‌ నాయకుడివి. వైకాపా వాళ్లకంటే ముందే గడ్డం ఎలా చేయించుకుంటావు. మొదట మేమే చేయించుకోవాలి’ అంటూ ఓ వాలంటీరు, అతడి తండ్రి, వైకాపా గ్రామనేత.. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిపై దౌర్జన్యానికి దిగారు.

Published : 03 Mar 2024 04:33 IST

కాంగ్రెస్‌ నాయకుడిని అడ్డుకొని, సెలూన్‌ నుంచి గెంటేసిన వాలంటీరు, వైకాపా నేత
సగం గడ్డంతోనే పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధితుడు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ‘నువ్వు కాంగ్రెస్‌ నాయకుడివి. వైకాపా వాళ్లకంటే ముందే గడ్డం ఎలా చేయించుకుంటావు. మొదట మేమే చేయించుకోవాలి’ అంటూ ఓ వాలంటీరు, అతడి తండ్రి, వైకాపా గ్రామనేత.. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిపై దౌర్జన్యానికి దిగారు. చొక్కా పట్టుకొని సెలూన్‌ నుంచి బయటికి తోసేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని తిమ్మసముద్రం గ్రామంలో శనివారం చోటుచేసుకొంది. బాధితుడి వివరాల మేరకు.. తిమ్మసముద్రంలో క్షురకుడు లేరు. శని, సోమవారాల్లో పక్కనున్న మానిరేవు నుంచి వచ్చి పనిచేసుకొని వెళ్తారు. దీంతో ఆ రెండు రోజుల్లోనే తిమ్మసముద్రంలో క్షవరం చేయించుకునే వీలుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం గ్రామానికి వచ్చిన క్షురకుడి వద్దకు కాంగ్రెస్‌ నాయకుడు వెంకటరాముడు మొదట వెళ్లారు. అతను గడ్డం చేయించుకుంటుండగా గ్రామానికి చెందిన వాలంటీరు భాస్కర్‌, అతని తండ్రి, వైకాపా గ్రామ నాయకుడు శ్రీరాములు అప్పుడే అక్కడికి వచ్చారు. వెంకటరాముడిని చూసి.. ‘నువ్వు గడ్డం చేయించుకోకూడదు. మొదట మేమే చేయించుకోవాలి. మా పని కాకుండా నువ్వెలా వచ్చావు’ అంటూ ఘర్షణకు దిగారు. గడ్డం సగంలో ఉండగానే.. వెంకటరాముడిని చొక్కా పట్టుకుని సెలూన్‌ నుంచి బయటికి లాగి, గెంటేశారు. వెళ్లకపోతే.. తన చికెన్‌ సెంటర్‌కు నిప్పుపెడతామని బెదిరించారని వెంకటరాముడు వాపోయారు. విధిలేని పరిస్థితిలో బాధితుడు సగం గడ్డంతోనే కళ్యాణదుర్గం వెళ్లి కాంగ్రెస్‌ నాయకులకు పరిస్థితి వివరించారు. వారి సాయంతో కళ్యాణదుర్గం గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై గ్రామంలో విచారించిన సీఐ చంద్రశేఖర్‌ శనివారం సాయంత్రం కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని