Malika Garg: 20 రోజుల్లోనే తిరుపతి ఎస్పీ బదిలీ

తిరుపతి ఎస్పీ మలికాగార్గ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఆమె స్థానంలో విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌ను నియమించింది.

Updated : 04 Mar 2024 14:03 IST

మలికాగార్గ్‌ ఉంటే తమ అక్రమాలు సాగవని భావించిన వైకాపా నాయకులు
ఒత్తిళ్లు తీసుకొచ్చి బదిలీ చేయించిన వైనం
తిరుపతి కొత్త ఎస్పీగా కృష్ణకాంత్‌ పటేల్‌

ఈనాడు, అమరావతి, తిరుపతి - న్యూస్‌టుడే, తిరుపతి నేరవిభాగం: తిరుపతి ఎస్పీ మలికాగార్గ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఆమె స్థానంలో విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 20 రోజుల వ్యవధిలోనే, అది కూడా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు కొద్ది రోజుల ముందు మలికాగార్గ్‌కు స్థానచలనం కలిగించటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార వైకాపాకు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు అక్కడి నుంచి పంపించి వేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈసీకి నివేదిక సమర్పిస్తారేమోనని..

అంతకుముందు ప్రకాశం ఎస్పీగా ఉన్న మలికాగార్గ్‌.. ఫిబ్రవరి 1వ తేదీన తిరుపతి ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆమెను తిరుపతి రానివ్వకుండానే బదిలీ చేయించాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి అదే నెల 12న తిరుపతి ఎస్పీగా మలికాగార్గ్‌ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో నిక్కచ్చిగా, తటస్థంగా, చట్ట ప్రకారం వ్యవహరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా పనిచేయొద్దని, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాలు, నమోదైన కేసులపైనా దృష్టి సారించారు. ఆ కేసులను పక్కదారి పట్టించిన వ్యవహారంపై ఆమె ఎన్నికల సంఘానికి ఏదైనా నివేదిక సమర్పిస్తే.. సార్వత్రిక ఎన్నికల వేళ తమకు మరింత ఇబ్బందిగా మారుతుందని వైకాపా నాయకులు భావించారు. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదనే ఉద్దేశంతో బదిలీ చేయించినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వైకాపా నాయకుల మాట వినట్లేదని..

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముగ్గురు సీఐలు తమ పార్టీకి చెందిన 50-70 ఏళ్ల వారిపై అక్రమంగా రౌడీషీట్లు తెరుస్తున్నారని తెదేపా నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. ముగ్గురు ఇన్‌స్పెక్టర్లపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పెళ్లకూరులో పెద్దఎత్తున జరుగుతున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాల వ్యవహారంలో వైకాపాలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు అత్యంత సన్నిహితుడైన నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా చేసి, అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపైనే దాడి చేశారు. ఆయనపై కేసు నమోదు చేయొద్దంటూ అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చినా సరే ఎస్పీ కేసు నమోదు చేయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ‘పెద్ద’ మంత్రి కనుసన్నల్లో అరణియార్‌ నదిలో నుంచి అక్రమంగా ఇసుక తవ్వి సురుటుపల్లి మీదుగా చెన్నైకు తరలిస్తుంటారు. మలికాగార్గ్‌ ఇటీవల సురుటుపల్లి చెక్‌పోస్టును తనిఖీ చేసి.. ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. ఈ అంశాలన్నీ ఆమె బదిలీకి కారణమైనట్లు తెలుస్తోంది.

విజయవాడ డీసీపీగా అధిరాజ్‌సింగ్‌ రాణా

మరోవైపు విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీగా అధిరాజ్‌సింగ్‌ రాణాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన విజయనగరంలోని ఏపీఎస్పీ అయిదో బెటాలియన్‌ కమాండెంట్‌గా ఉన్నారు. ఆయన్ను బదిలీ చేసి.. విశాఖపట్నంలోని 16వ బెటాలియన్‌ కమాండెంట్‌ గౌతమి శాలికి విజయనగరం బెటాలియన్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని