Kakinada: మళ్లీ తనఖాకు స‘పోర్టు’?

తగ్గేదేలే.. ప్రజల ఆస్తులేవీ వదిలేదేలే.. అన్నట్టు ఉంది జగన్‌ సర్కారు తీరు. అభివృద్ధి పేరిట 2022లో కాకినాడలో పోర్టుకు చెందిన 348.66 ఎకరాలు తాకట్టు పెట్టిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు మిగిలిన భూములపైనా కన్నేసింది.

Published : 04 Mar 2024 08:40 IST

గతంలో 348.66 ఎకరాల కాకినాడ పోర్టు భూములు తాకట్టు
మిగిలిన భూముల తనఖా రిజిస్ట్రేషన్‌కూ తాజాగా రంగం సిద్ధం

ఈనాడు, కాకినాడ-న్యూస్‌టుడే, కాకికాడ కలెక్టరేట్‌: తగ్గేదేలే.. ప్రజల ఆస్తులేవీ వదిలేదేలే.. అన్నట్టు ఉంది జగన్‌ సర్కారు తీరు. అభివృద్ధి పేరిట 2022లో కాకినాడలో పోర్టుకు చెందిన 348.66 ఎకరాలు తాకట్టు పెట్టిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు మిగిలిన భూములపైనా కన్నేసింది. తాజాగా పోర్టు పరిధిలో ఖాళీగా ఉన్న భూముల విస్తీర్ణం, వాటి సర్వే నంబర్ల వివరాలు సేకరించి పంపాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు ఆఘమేఘాలపై ఏపీ మారిటైం బోర్డు యంత్రాంగం నివేదిక పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల అభివృద్ధి కోసం కాకినాడలోని పోర్టు భూముల్ని తాకట్టు పెట్టామని గతంలో సర్కారు సెలవిచ్చింది. రూ.1,500 కోట్లు రుణానికి ఏపీ మారిటైం బోర్డు 2022 నవంబరు 4న కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణ మండలాల పరిధిలోని 337.83 ఎకరాలు తనఖా రిజిస్ట్రేషన్‌ చేసింది. ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్‌ నుంచి ఈ రుణం తీసుకున్నారు.

తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో సిద్ధం చేసిన నివేదికలో.. మొత్తం పోర్టు భూములు 1,926.57 ఎకరాలు ఉన్నాయని, అందులో 348.66 ఎకరాలు ఇప్పటికే తనఖాలో ఉన్నట్లు పేర్కొన్నారు. (గతంలో తనఖాకు, తాజా లెక్కలకు 10.83 ఎకరాల తేడా ఉంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.) ఇప్పుడు మరో 500 ఎకరాల వరకు అదే బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాకినాడ నగరం, గ్రామీణంలోని వాకలపూడి, సూర్యారావుపేట, తమ్మవరం పరిధిలోని సముద్ర తీర భూములు, కండిషనల్‌ అసైన్డ్‌ భూములు,   వేస్ట్‌ ల్యాండ్స్‌ వివరాలను తాజా నివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా 1,577.91 ఎకరాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ముందు   ఉంచారు. గతంలో రూ.1,500 కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం, ఇప్పుడెన్ని కోట్లకు స్కెచ్చేసిందోనన్న చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు