AP Elections: నాలుగో విడతలో ఎన్నికలు.. ప్రతిపక్ష పార్టీలకు అనుకూలం!

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎన్నికలు మొదటి దశలో కాకుండా.. నాలుగో దశలో నిర్వహించడం ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మారనుంది.

Updated : 17 Mar 2024 07:57 IST

రాష్ట్రంలో షెడ్యూల్‌కు, పోలింగ్‌కు మధ్య 58 రోజుల వ్యవధి
కోడ్‌ అమల్లోకి రావడంతో తటస్థంగా వ్యవహరించనున్న అధికారులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎన్నికలు మొదటి దశలో కాకుండా.. నాలుగో దశలో నిర్వహించడం ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మారనుంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి షెడ్యూల్‌ వెలువడిన తేదీకి, పోలింగ్‌కు మధ్య చాలా సమయం ఉంది. దీంతో తెదేపా, జనసేన, భాజపాలు ఎన్నికలకు అన్ని విధాలా సన్నద్ధమయ్యేందుకు వెసులుబాటు లభించనుంది. ఇన్నాళ్లూ వైకాపా ప్రభుత్వం పోలీసుల్ని, అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని విపక్ష పార్టీలపై వేధింపులకు పాల్పడింది. విపరీతంగా కక్షసాధింపు చర్యలకు దిగింది. అధికార పార్టీ పెద్దల అరాచకానికి భయపడిన అధికారులు... వారు చెప్పినదానికల్లా సరే అన్నారు. పోలీసుల వేధింపులకు, కేసులకు భయపడి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కూడా కాస్త భయం భయంగా రోజులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడి, కోడ్‌ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘానికి భయపడైనా అధికారులు తటస్థంగా వ్యవహరించనున్నారు.

నాడు 32 రోజులే..

2019లో రాష్ట్రంలో మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించారు. మార్చి 10న షెడ్యూల్‌ వెలువడితే.. మార్చి 18న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరిగింది. షెడ్యూల్‌కు.. పోలింగ్‌కు మధ్య 32 రోజుల వ్యవధే లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం షెడ్యూల్‌ వెలువడగా.. నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న విడుదల కానుంది. పోలింగ్‌ మే 13న జరగనుంది. ఏకంగా 58 రోజుల వ్యవధి ఉంది.

సమన్వయానికి తగినంత సమయం

రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కలసి పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు ఇటీవలే కొలిక్కి వచ్చింది. భాజపా ఇప్పటికీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. తెదేపా ఇంకా 16 చోట్ల శాసనసభ అభ్యర్థులతో పాటు, 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. జనసేన కూడా 13 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని, రెండు లోక్‌సభ స్థానాల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. తొలి దశలోనే ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ పార్టీలు కాస్త హడావుడి పడాల్సి వచ్చేది. ప్రస్తుతం అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయొచ్చు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య క్షేత్రస్థాయి వరకు సమన్వయం సాధించేందుకు, వారంతా కలసి పనిచేసేలా, ఓట్ల బదిలీ సక్రమంగా జరిగేలా చూసేందుకు వీలుకానుంది. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు సీట్లు కేటాయించడంతో పాటు ఇతర కారణాల వల్ల టికెట్లు దక్కని నేతలు అక్కడక్కడా కొంత అసంతృప్తితో ఉన్నారు. వారిని ఆయా పార్టీల అగ్రనేతలు బుజ్జగించే అవకాశమూ దక్కింది.

అభ్యర్థులకు పెరగనున్న ఖర్చు

పోలింగ్‌కు సుమారు రెండు నెలల సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులకూ ఖర్చు పెరగనుంది. అధికార పార్టీ అభ్యర్థులకు మరింత ఎక్కువ ఖర్చు కానుంది. వైకాపా నేతలు, అభ్యర్థులు ఇప్పటికే అనేక చోట్ల వాలంటీర్లకు, వివిధ వర్గాల వారికి కానుకలు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత ముమ్మరం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు