గన్నవరంలో వైకాపా నేతల అరాచకం

రాష్ట్రంలో వైకాపా నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారు. కోడ్‌ ఉల్లంఘనలపై సీ-విజిల్‌ యాప్‌లో చిత్రాలను అప్‌లోడ్‌ చేసి సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేయాలంటూ ఎన్నికల సంఘం ప్రచారం చేస్తోంది.

Published : 23 Mar 2024 05:23 IST

కడప తెదేపా అభ్యర్థి మాధవి కారుపై దాడి
సిద్ధం పోస్టర్లను ఫొటో తీసినందుకు గూండాగిరీ
సీ-విజిల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేశారని దౌర్జన్యం
కారు కదలకుండా ఇరువైపులా అడ్డంగా వాహనాలు
దాడి చేసిన వంశీ అనుచరులకే పోలీసుల వత్తాసు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే-గన్నవరం గ్రామీణం: రాష్ట్రంలో వైకాపా నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారు. కోడ్‌ ఉల్లంఘనలపై సీ-విజిల్‌ యాప్‌లో చిత్రాలను అప్‌లోడ్‌ చేసి సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేయాలంటూ ఎన్నికల సంఘం ప్రచారం చేస్తోంది. కానీ తెదేపా అభ్యర్థులు సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదులు చేస్తుంటే, వారిపై వైకాపా వర్గీయులు దాడులకు దిగుతున్నారు. తెదేపా కడప అసెంబ్లీ అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవికి ఇలాంటి పరిస్థితే కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎదురైంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా గన్నవరంలోని చాలా ప్రాంతాల్లో వైకాపా జెండాలు, సిద్ధం పోస్టర్లు, జెండా దిమ్మెలకు రంగులను తొలగించకుండా అలాగే ఉంచారు.

గన్నవరం మీదుగా కారులో శుక్రవారం వెళుతున్న మాధవి వాటిని చూసి.. ఫొటోలు తీసి, సీ-విజిల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. దీన్ని గమనించిన వంశీ అనుచరులు 50 మందికి పైగా ఒకేసారి కారును చుట్టుముట్టారు. కారుకు అడ్డంగా ట్రక్కులు, ద్విచక్ర వాహనాలను పెట్టి, చక్రాల కింద సిమెంట్‌ ఇటుకలను పడేసి.. నడిరోడ్డుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కారు అద్దాలను చేతులతో కొడుతూ.. అరుస్తూ.. తిడుతూ.. భయానక వాతావరణం సృష్టించారు. వంశీ ముఖ్య అనుచరులు ఓలుపల్లి రంగా, మేచినేని బాబు, ఆర్‌వీఆర్‌, చిరంజీవి తదితరులు కారు చుట్టూ చేరి బయటకు రావాలంటూ మాధవిని బెదిరించారు. దీంతో కారులో ఉన్న మాధవి, ఆమె కుమార్తె శ్రియాంక భయభ్రాంతులకు గురయ్యారు. 100కు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారు. కాసేపటికి గన్నవరం పోలీసులు వచ్చారు. కానీ.. వచ్చీ రావడంతోనే మాధవి, ఆమె కుమార్తెదే తప్పన్నట్టు.. దాడిచేసిన వాళ్లకే మద్దతుగా నిలిచారు.

వైకాపా కార్యాలయాన్ని ఫొటోలు తీస్తున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, తమతో రావాలంటూ మాధవిని కారులోంచి దించి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దాడి చేసినవాళ్లను వదిలేసి తనను స్టేషన్‌కు తీసుకెళ్లడం ఏంటని మాధవి ప్రశ్నించినా పోలీసులు కనీసం వినేందుకూ ఆసక్తి చూపించలేదు. తమ కారుకు అడ్డంగా పెట్టిన వాహనాలైనా తీయించాలని మాధవి అడిగినా.. ఎలాంటి స్పందనా లేదు. సమాచారం అందుకున్న తెదేపా గన్నవరం ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులు ఘటనా స్థలానికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి ఘటనా స్థలం నుంచి పంపేశారు.


డీజీపీ, ఈసీ సమాధానం చెప్పాలి

‘‘గన్నవరంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనం. దాడిచేసిన వాళ్లకే ఇక్కడి పోలీసులు వత్తాసు పలుకుతూ బాధితులపైనే కేసులు పెడుతున్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా మారిపోయారు. కోడ్‌ ఉల్లంఘనపై సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసినందుకే మాధవిపై దాడిచేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా అధికార వైకాపా నిత్యం అరాచకాలకు పాల్పడుతూనే ఉంది. ఈ ఘటనపై డీజీపీ, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. జగన్‌ ప్రభుత్వానికి మరో 40 రోజులే గడువు ఉంది. అరాచకవాదులకు మద్దతుగా నిలుస్తున్న ఏ పోలీసునూ విడిచిపెట్టేదే లేదు.’’

 యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి


ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలి

‘‘ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి వారం అవుతున్నా ఇప్పటికీ వైకాపా రంగులు, సిద్ధం పోస్టర్లను తొలగించకపోవడం దారుణం. ఈ పోస్టర్లను ఫొటోలు తీసి సీ-విజిల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేశా. అసలు ఎన్నికల కోడ్‌ అమలులో ఉందనే స్పృహే ఇక్కడ కనిపించడం లేదు. సామాన్య పౌరులు ఎవరైనా వీటిని ఫొటోలు తీసి ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. నేనూ అదే చేశా. కానీ ఇలా దాడి చేసి.. కారు కదలకుండా రాళ్లు, వాహనాలు అడ్డం పెట్టి నడిరోడ్డుపై ఆపేసి భయానక వాతావరణం సృష్టించడమేంటి? ఇద్దరు మహిళలు కారులో ఉండగా ఇంత దారుణంగా దాడి చేసి బెదిరింపులకు దిగడం అత్యంత హేయం. పట్టపగలు మాకే ఈ పరిస్థితి ఎదురైతే అరాచక వైకాపా నుంచి సామాన్య పౌరులకు ఈసీ ఎలా రక్షణ కల్పిస్తుందో చెప్పాలి. ఈ ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలి. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు సైతం దాడిచేసిన అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు. వారి తీరు అత్యంత దారుణం.’’

 రెడ్డప్పగారి మాధవి, కడప అసెంబ్లీ తెదేపా అభ్యర్థి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని