విద్యుత్‌పై అదనపు లోడ్‌ ఛార్జీల భారం

ఆదాయ మార్గాలను అన్వేషించి ప్రజలను పీల్చి పిప్పిచేయడం జగన్‌ ప్రభుత్వానికి రివాజుగా మారింది. వడ్డీ వ్యాపారుల మాదిరి విద్యుత్‌ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపుతోంది.

Published : 28 Mar 2024 03:33 IST

నెలాఖరులోగా వసూలుకు ఒత్తిళ్లు
కొన్ని చోట్ల సిబ్బంది నోటీసులు.. మరికొందరికి మౌఖిక ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ఆదాయ మార్గాలను అన్వేషించి ప్రజలను పీల్చి పిప్పిచేయడం జగన్‌ ప్రభుత్వానికి రివాజుగా మారింది. వడ్డీ వ్యాపారుల మాదిరి విద్యుత్‌ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపుతోంది. అదనపు లోడ్‌ ఛార్జీల పేరుతో సామాన్యులను దండుకునేందుకు వ్యూహం పన్నుతోంది. ఈ ఛార్జీలను చెల్లించాలంటూ నోటీసులిస్తోంది. కొన్నిచోట్ల విద్యుత్‌ సిబ్బంది ఈ మేరకు మౌఖిక ఆదేశాలనిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో చెల్లించకుంటే కనెక్షన్‌ తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారు. సామాన్యులు అప్పోసప్పో తెచ్చి డబ్బులు కట్టక తప్పని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలోనూ కిలోవాట్‌ అదనపు లోడ్‌గా ఉన్నా.. రూ.2,284 వరకు భారం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో వేసిన భారాలను మోయడమే సామాన్యులకు కష్టమవుతోంది. పదుల యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి రూ.వేలల్లో వస్తున్న బిల్లులు కట్టలేక అవస్థలు పడుతున్నారు.  

ఒకరికి నోటీసు ఇస్తే.. వంద మందికి ఇచ్చినట్లేనా?

విజయవాడ పాయకపురానికి చెందిన సర్వీసు నంబరు 6425253227151 వినియోగదారుడికి ఉన్నట్టుండి విద్యుత్‌ సిబ్బంది నోటీసునిచ్చారు. గతేడాది అక్టోబరు 18న తనిఖీ చేశామని, అనుమతించిన లోడ్‌కంటే ఎక్కువగా వాడినట్లు గుర్తించామని నోటీసులో పేర్కొన్నారు. వాడుతున్న 2 కిలోవాట్ల అదనపు కాంట్రాక్టెడ్‌ లోడ్‌కు సర్వీసు లైన్‌ ఛార్జీలు, డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.4,568 చెల్లించాలన్నది నోటీసు సారాంశం. నెలలో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించకుంటే కనెక్షన్‌ తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. ఈ సబ్‌స్టేషన్‌ పరిధిలోని సుమారు 160 మంది వాడకందారులూ అదనపు లోడ్‌ఛార్జీలను చెల్లించాలంటూ సిబ్బంది మౌఖికంగా ఆదేశిస్తున్నారు. నోటీసులు ఇవ్వలేదు. 1, 2 రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించకుంటే సరఫరా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారు.

నెల విద్యుత్‌ బిల్లు కింద రూ.700 (అన్ని అదనపు ఛార్జీలు కలిపి) చెల్లింపు కనీస మొత్తంగా మారింది. దీనికి కిలోవాట్‌ అదనపు లోడ్‌ఛార్జీలు కలిపినా రూ.2,984 కట్టాల్సి వస్తోంది. ఇంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం దిగువ, మధ్యతరగతి వర్గాలకు సాధ్యమేనా? ఇవేమీ పట్టించుకోకుండా ఏదో ఒక మార్గంలో అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఎప్పుడో అక్టోబరులో తనిఖీ చేసి 4నెలలపాటు ఊరుకుని ఇప్పుడు హడావుడి చేయడంపై విమర్శలు వస్తున్నాయి.


ఏంటీ కాంట్రాక్టెడ్‌ లోడ్‌?

కొత్త కనెక్షన్‌ తీసుకునేటప్పుడు ఎంత లోడ్‌ వాడతామనే వివరాలను దరఖాస్తులో ప్రస్తావించాలి. దీన్ని కాంట్రాక్టెడ్‌ లోడ్‌ కింద పరిగణించి తదనుగుణంగా డెవలప్‌మెంట్‌ ఛార్జీలను డిస్కంలు తీసుకుంటాయి. గతంలో ఒక చిన్న ఇంటికి కిలోవాట్‌ సామర్థ్యంతో డిస్కంలు కనెక్షన్లు ఇచ్చేవి. ఇప్పుడు కనీస కాంట్రాక్టెడ్‌ లోడ్‌ను రెండు కిలోవాట్లు చేసి ఆ స్థాయిలో వినియోగం లేకున్నా కిలోవాట్‌కు రూ.2 వేల చొప్పున డిపాజిట్‌ మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. దీంతో కొత్త కనెక్షన్‌ దరఖాస్తుకు రూ.5 వేలు తప్పనిసరిగా కావాల్సి వస్తోంది. ఇలా ఆదాయ సముపార్జనకు అలవాటు పడిన విద్యుత్‌ సంస్థలు కాంట్రాక్టెడ్‌ లోడ్‌కంటే కనెక్టెడ్‌ లోడ్‌ ఎక్కువగా ఉందంటూ కొత్త పల్లవి అందుకుంటున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని