‘యాప్‌’రే రూ.30 లక్షలా?

విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది.

Published : 28 Mar 2024 05:42 IST

విద్యార్థుల నిధులతో  ఉన్నత విద్యా మండలి ఇష్టారాజ్యం
ఎన్నికల ప్రచారం కోసమే  యాప్‌ తెచ్చారంటూ ఆరోపణలు

ఈనాడు, అమరావతి: విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. ఎన్నికల ముందు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోంది. తాజాగా సంక్షిప్త సందేశాల భద్రత, విద్యార్థులకు సమాచారం చేరవేత పేరుతో ‘ఉన్నత విద్యామండలి మెసెంజర్స్‌’ యాప్‌ను తీసుకొచ్చింది. అనంతపురానికి చెందిన ఓ సంస్థ తీర్చిదిద్దిన ఈ యాప్‌కు ఏకంగా రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేసింది. విద్యార్థులు, వర్సిటీలకు సంక్షిప్త సందేశాలు పంపేందుకు వాట్సప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్స్‌, ఈమెయిళ్లు వంటివి ఉండగా.. అవేవీ కాదని ప్రత్యేకంగా యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సర్కిల్‌, పర్సనల్‌ అనే ఐచ్ఛికాలున్నాయి. వర్సిటీల వారీగా సర్కిళ్లు, రాష్ట్రస్థాయిలో సర్కిళ్లుగా గ్రూపులు ఏర్పాటు చేసేలా దీన్ని తీసుకొచ్చారు. ఉన్నత విద్యామండలి నుంచి వర్సిటీలు, విద్యార్థులకు.. వర్సిటీల నుంచి ఉన్నత విద్యా మండలికి పంపించేవన్నీ రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినవే ఉంటాయి. వాటిలో అంత రహస్యం ఏముంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. వర్సిటీలకు చెందిన కొంతమంది ఉప కులపతులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వీరు విద్యార్థులు, యువత లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ యాప్‌ను తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు అవసరమైన వీడియోలు, ఆడియోలు, సంక్షిప్త సందేశాలు పంపేందుకు దీన్ని వాడనున్నారని కొందరు అధ్యాపకులు పేర్కొంటున్నారు. పైకి మాత్రం విద్యార్థులు, వర్సిటీలకు సమాచారం ఇవ్వడం కోసమే దీన్ని రూపొందించినట్లు చెబుతున్నా, దీని వెనుక ఎన్నికల ప్రణాళిక ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని