ఎన్నికల కోడ్‌ తర్వాత రూ.వేల కోట్ల పందేరం

ఎవరైనా మనకు ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు.

Published : 28 Mar 2024 05:43 IST

జగన్‌ బటన్‌ నొక్కుడులో తిరకాసు
కోడ్‌ కంటే ముందు చెల్లించినట్లు పోజు
ఇప్పటికీ కొనసాగుతున్న చెల్లింపులు ఆర్థికశాఖ అధికారుల వత్తాసు

ఈనాడు, అమరావతి: ఎవరైనా మనకు ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. మహా అయితే ఒకటి, రెండు రోజులు పట్టవచ్చు. రోజుల తరబడి రాకుండా ఉండవు కదా! మరి సీఎం జగన్‌ ఎన్నో పథకాలకు హడావుడిగా బటన్‌ నొక్కితే ఇప్పటికీ ఆ నిధులు లబ్ధిదారులకు చేరలేదు. ఎందుకు? ఖజానాలో నిధులు లేకపోయినా బటన్‌ నొక్కి ఆ మొత్తాలు బదిలీ చేసేశారు. సామాజిక పింఛన్లు మినహా మిగిలిన పథకాల సొమ్ములన్నీ ఏడాదికి ఒకసారి ఇచ్చేవి. నిధులు ఉన్నప్పుడే వాటిని లబ్ధిదారులకు ఇవ్వచ్చు. అలాంటిది మార్చిలో ఎన్నికల కోడ్‌ రావడానికి కొద్దిరోజుల ముందు ఎందుకు బటన్‌ నొక్కారు? కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆ సొమ్ములు లబ్ధిదారులకు చేరలేదు? ఇందులో అచ్చమైన ఎన్నికల తిరకాసు ఉంది. ఎన్నికలు సమీపించిన తర్వాత ఆ సొమ్ము లబ్ధిదారులకు చేరితే.. ఆ ప్రభావం ఓటర్లపై ఉంటుందనే స్కెచ్‌ ఇందులో ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కోడ్‌ రాకముందే బటన్‌ నొక్కి, కోడ్‌ వచ్చిన తర్వాత ఆ మొత్తాలు లబ్ధిదారులకు చేరేలా వైకాపా ప్రభుత్వం గీసిన ప్రణాళికకు ఆర్థికశాఖ అధికారులు సహకరిస్తున్నారు. చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, పెట్టుబడి రాయితీ అందించేందుకు ఎన్నికల కోడ్‌ రాకముందే సీఎం జగన్‌ బటన్‌ నొక్కినా ఇందులో చెల్లింపులు అందరికీ పూర్తికాలేదు. పోలింగు వరకు ఈ నిధులిస్తూ ఎన్నికలపై ప్రభావం పడేలా ఆర్థికశాఖ అధికారులు ఎలా సహకరిస్తున్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల వేళ రూ.వేల కోట్ల పందేరం

ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో రూ.వేల కోట్ల పందేరానికి తెరతీసింది.

  • చేయూత పథకం కింద సుమారు రూ.5,060 కోట్లు చెల్లించేలా మార్చి 6న సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. ఇప్పటికీ ఆ సొమ్ములు అందరికీ జమకాలేదు. సగం మందికే జమ అయినట్లు తెలిసింది.
  • ఆసరా పథకం కింద రూ.4,600 కోట్లు ఇవ్వాలి. చాలామందికి ఇప్పటికీ నిధులు ఖాతాలకు చేరుతూనే ఉన్నాయి.
  • విద్యాదీవెన పథకం కింద ఫిబ్రవరిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల కోసం రూ.708 కోట్లకు బటన్‌ నొక్కారు. కానీ సగం మందికే వారి ఖాతాల్లో చేరాయి. దాదాపు రూ.350 కోట్లకు పైగా చెల్లింపులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి.
  • ఈబీసీ నేస్తం కింద రూ.629 కోట్లు చెల్లించాలి. అందులోనూ కొన్నే బటన్‌ నొక్కిన తర్వాత లబ్ధిదారులకు అందాయి.
  • తుపానుతో నష్టపోయిన రైతులకు సంక్రాంతికే పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం జగన్‌ ఎప్పుడో ప్రకటించారు. పంటరుణాలపై సున్నా వడ్డీ 2023 నవంబరులోనే ఇస్తామని చెప్పారు. సున్నా వడ్డీ, రైతు భరోసా, పెట్టుబడి సాయం కింద రూ.2,600 కోట్లు ఇస్తున్నట్లు ఫిబ్రవరి 28, మార్చి 6 తేదీల్లో ప్రకటించినా చాలామందికి ఇంతవరకు ఆ సొమ్ము దక్కలేదు.
  • పెండింగులో ఉన్న రూ.వేల కోట్లు ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఇచ్చేలా ఆర్థికశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తే ఆ ప్రభావం ఎన్నికల్లో అధికారపార్టీకి అనుచిత లబ్ధి కలిగించడానికే అన్న విమర్శలు రేగుతున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని