అంకెలు పెంచి.. ఆశలు తుంచారు!

ముందుచూపు మందగించిన జగన్‌ ఏలుబడిలో పోలవరం పనులు అటకెక్కాయి! పోనీ నిర్వాసితులకు పరిహారమైనా.. అందిందా అంటే ఊహూ.. అదీ లేదు!! ముంపును కళ్లారా చూశానన్నారు... ముప్పు నుంచి అమాయకులను రక్షించాల్సిందేనన్నారు... ఇస్తున్న ప్యాకేజీని పెంచాలన్నారు... ఇచ్చిన పరిహారం సరిపోదన్నారు... బాధితులే తొలి లబ్ధిదారులు కావాలన్నారు.

Updated : 28 Mar 2024 08:01 IST

పోలవరం నిర్వాసితులకిచ్చిన హామీలేవీ నెరవేర్చని జగన్‌
రూ.10 లక్షల ప్యాకేజీ ఇవ్వలేదు
పాత భూములకు కొత్త ధరా లేదు
12 వేల కుటుంబాలకే తరలింపు పరిమితం
వరదల ముంపులో పిల్లాపాపల విలవిల
నాటి మాటలను నమ్మినందుకు నిలువునా మోసం

ముందుచూపు మందగించిన జగన్‌ ఏలుబడిలో పోలవరం పనులు అటకెక్కాయి!
పోనీ నిర్వాసితులకు పరిహారమైనా.. అందిందా అంటే ఊహూ.. అదీ లేదు!!  
ముంపును కళ్లారా చూశానన్నారు... ముప్పు నుంచి అమాయకులను రక్షించాల్సిందేనన్నారు...
ఇస్తున్న ప్యాకేజీని పెంచాలన్నారు... ఇచ్చిన పరిహారం సరిపోదన్నారు... బాధితులే తొలి లబ్ధిదారులు కావాలన్నారు...
తనను గెలిపిస్తే అన్నీ చేస్తానన్నారు... ఆశలు కల్పించి పోల‘వరం’ పొందారు... ఆనక బాధితులను గోదావరికే వదిలేశారు...

తమ రాష్ట్ర బాగుకు, దేశ ఉన్నతికి సొంత ఊళ్లను, పొలాలను, ఉపాధిని, సంస్కృతిని త్యాగం చేసిన ఆ అమాయక నిర్వాసితులు ఇప్పటికీ తల్లడిల్లుతున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని ధారబోస్తే జగన్‌ వచ్చాక వారి జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. మాట ఇస్తే మడమ తిప్పబోనని ఆయన తరచూ చెబుతుంటారు. ఒక్కసారి పోలవరం నిర్వాసితుల్లో ఎవరిని కదిపినా... జగన్‌   చెబుతున్న విశ్వసనీయత ఆ ప్రాజెక్టులోని గైడ్‌బండ్‌లాగే కుంగిపోయినట్లు అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా నిర్వాసితులకు ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో కొనసాగినా వాటిలో ఒక్కటీ నెరవేర్చలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మొత్తం 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికి 12 వేల కుటుంబాలను మాత్రమే తరలించారు. ఒకవైపు ఎగువ కాఫర్‌ డ్యాంను 42 మీటర్ల ఎత్తుకుపైగా నిర్మించారు. దీంతో గోదావరి వరదల్లో ఆ ఊళ్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుని నిర్వాసితులు అల్లాడుతున్నారు.

వరద బాధలు మరింత పెరిగాయి...

పోలవరం నిర్వాసితులు ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఏటా వచ్చే వరదలలో వారి బతుకులు ఛిద్రమవుతున్నాయి. పునరావాసం చూపాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. తెదేపా హయాంలో 2017-18లో భూసేకరణ పూర్తి చేశారు. ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. అప్పట్లో నిర్వాసితులు కొన్ని మార్పులు కోరుకున్నారు. ప్యాకేజీ మొత్తం ఒకేసారి ఇవ్వాలని, పునరావాసంతోపాటు మిగిలినవన్నీ తక్షణమే అందించాలని విన్నవించారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ నిర్వాసితులను ఆశల పల్లకీలో ఊరేగించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నమ్మిన బాధితులు... ఆయన్ని సీఎంని చేస్తే ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదు. కనీసం పరిహారం ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచడం, గతంలో సేకరించిన భూములకు అదనంగా రూ.5 లక్షలను చెల్లించడం, తొలిదశలో ముంపునకు గురవుతున్న అన్ని గ్రామాలకు పునరావాసం కల్పించడం అన్న మూడు హామీలనైనా మొదట నెరవేర్చినా తమ బతుకులు మరోలా ఉండేవని వారు అంటున్నారు. మరోవైపు వరద బాధలు రెట్టింపయ్యాయి. కాఫర్‌డ్యాం నిర్మించి నది సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో వర్షాకాలంలో ఎగువ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 2022లో వచ్చిన వరదలు నిర్వాసిత మండలాల్లోని చాలా గ్రామాలను ముంచేశాయి.


తొలిదశ, మలిదశగా విభజించినా ప్రయోజనం శూన్యం

మొత్తం 348 నిర్వాసిత గ్రామాల్లో లక్షకు పైగా కుటుంబాలకు ఒకేసారి పునరావాసం కల్పించకుండా రెండు దశలుగా విడగొట్టారు. మొత్తం 45.72 కాంటూరు పరిధి వరకు వరద ముంచెత్తుతుందని అంచనా వేశారు.పోలవరంలో పూర్తి స్థాయిలో నీటిని నిలువచేస్తే 1,06,006 కుటుంబాలు నిర్వాసితులవుతాయి. ఇంతవరకు అధికారిక లెక్కల ప్రకారం 12 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు చెబుతున్నా... వాస్తవంగా 6,351 కుటుంబాలకే అది దక్కింది. తొలిదశలో 20,946 కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని మొదట లెక్కించారు. లైడార్‌ సర్వే తర్వాత మరో 36 గ్రామాల్లోని 16,642 కుటుంబాలు కూడా తొలిదశలోనే పునరావాసం కల్పించాలని తేల్చారు. అందుకు అనుగుణంగా ఇప్పటికీ పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకోలేదు. ప్యాకేజీ కూడా ఇవ్వలేదు.


నిర్వాసితుల జీవితాలతో ఆటలు

హామీ-1:

సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితుల కళ్లల్లో ఆనందం చూడాలి. దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ప్రస్తుతం ఇస్తున్న వ్యక్తిగత ప్యాకేజీ రూ.6.36 లక్షలను రూ.10 లక్షలకు పెంచుతాం.

2019 మార్చి 19న కొయ్యలగూడెం ఎన్నికల సభలో జగన్‌

ఉత్తుత్తి ఉత్తర్వులు: ఇందుకు సంబంధించి 2021 జూన్‌ 30న ప్రభుత్వ ఉత్తర్వులు  జారీ చేశారు. ఇంతవరకు ఒక్క నిర్వాసిత కుటుంబానికైనా రూ.10 లక్షలు ఇవ్వలేదు. కొత్త ఉత్తర్వులు వచ్చాక పోలవరం, దేవీపట్నం మండలాలకు చెందిన తొలి దశ నిర్వాసిత కుటుంబాలకు వ్యక్తిగత ప్యాకేజీని వారి ఖాతాల్లో జమ చేసినా... వారికి దక్కింది రూ.6.36 లక్షలు మాత్రమే. అంటే ఉత్తుత్తి ఉత్తర్వులిచ్చి, హామీని అటకెక్కించారు.


హామీ-2:

ఈ ప్రాజెక్టు కోసం 2007, 2010 సంవత్సరాల్లో జరిపిన భూసేకరణలో ఎకరాకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.40 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇది చాలా తక్కువ. ప్రస్తుతం ఎకరాకు రూ.10.50 లక్షలు ఇస్తున్నారు. అది కూడా తక్కువే. పట్టిసీమలో ఎకరానికి రూ.20 లక్షలు ఇచ్చి... దాని పక్కనే ఉన్న పోలవరం ముంపు రైతులకు రూ.10.50 లక్షలే ఇవ్వడం అన్యాయం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2007, 2010 భూసేకరణలో భూములను కోల్పోయిన వారందరికీ ఎకరానికి మరో    రూ.5 లక్షలు అదనంగా ఇస్తాం.

2019 మార్చి 31న కుక్కునూరు బహిరంగ సభలో జగన్‌

ఇంకా అందని అ‘ధనం’: ఈ హామీ ఇంతవరకు నెరవేరలేదు. ఒక్క రైతుకు కూడా అదనంగా రూ.5 లక్షలు అందించలేదు.


హామీ-3:

వరదలతో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశా. ఇంకా వారిని ఇక్కడే ఉంచితే మనం తీరని అన్యాయం చేసినట్లే అవుతుంది. 2022 సెప్టెంబరు నెలాఖరులోగా 41.15 కాంటూరు పరిధిలోని 107 గ్రామాలను ఖాళీ చేయించి, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందాల్సిన అన్ని రకాల పరిహారాలిచ్చి, ఇళ్లు కేటాయించి, పునరావాస కాలనీలకు తరలిస్తాం.

2022 జూలై 28న వరదపీడిత మండలాలైన వేలేరుపాడు, చింతూరులలో పర్యటించాక జగన్‌ స్పందన

నిజంగా అన్యాయమే చేశారు: ఆయన చెప్పిన గడువు దాటి 17 నెలలు పూర్తయింది. ఆ హామీ తర్వాత 2023 సంవత్సరంలోనూ గోదావరికి తీవ్ర వరదలొచ్చాయి. ఇప్పటికీ    41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించలేదు.


హామీ-4:

పోలవరం ప్రాజెక్టుతో 45.72 కాంటూరు పరిధిలో ముంపులో చిక్కుకునే గ్రామాలు కూడా ఈ వరదల్లో మునిగాయి. ప్రస్తుతం 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకే మనం పరిహారమిచ్చే అవకాశముంది. ఇటీవల లైడార్‌ సర్వే చేయించాం. అది విశ్లేషణ దశలో ఉంది. దాని ప్రకారం తొలిదశలో ఎన్ని గ్రామాలకు వరద ముంపు ఏర్పడుతుందని తేలుతుందో అన్ని గ్రామాలనూ పరిహారం జాబితాలో చేరుస్తాం. ఈ నిర్వాసితులకు కూడా 2022 సెప్టెంబరు నెలాఖరుకల్లా పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తాం.

2022 జూలై 28న వరద ప్రాంతాల పరిశీలనకు వచ్చినప్పుడు వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టలో సీఎం జగన్‌

అమలు తీరు:  లైడార్‌ సర్వే ఆధారంగా  మరో 48 గ్రామాలను తొలిదశ  పునరావాసం కల్పించే జాబితాలో చేర్చారు. అంతేతప్ప ప్యాకేజీ ఇవ్వలేదు. తరలింపూ జరగలేదు.


ఈనాడు, అమరావతి, - కుక్కునూరు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని