జగన్‌ అనే నేను.. ఒక వినాశకారి!

జగన్‌ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత!

Updated : 18 Apr 2024 16:48 IST

జగన్‌ అనే నేను...

ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత!

భారీ పెట్టుబడితో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ ఏర్పాటైతే- చదువుకున్న పిల్లలకు వేలల్లో ఉద్యోగాలొస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్నాచితకా వ్యాపారాలన్నీ పెరిగి కొన్ని లక్షల జీవితాలు బాగుపడతాయి. పన్నుల రాబడి అధికమై రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుంది. అభివృద్ధి వేగవంతమవుతుంది. కడుపు కొట్టడమే తప్ప కడుపు నింపడం తెలియని జగన్‌మోహన్‌రెడ్డి మూలంగా ఆ బంగారు అవకాశాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ పోగొట్టుకోవాల్సి వచ్చింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అవకాశవాదం, అధికార దాహం, అరాచకత్వాలే పంచ ప్రాణాలైన జగన్‌- పెద్ద పరిశ్రమలను తీసుకురాలేదు. చిన్న పరిశ్రమలను బతకనివ్వలేదు. గత ప్రభుత్వ కృషితో ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన పారిశ్రామికవేత్తలనూ జగన్‌ బయటికి తరిమేశారు. పారిశ్రామిక రాష్ట్రంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల స్వర్గంగా ఎదగాల్సిన ఏపీని ఆయన వైకాపా రాక్షసులకు రాసిచ్చేశారు!


పరిశ్రమలపై పగ

మాయావి రావణుడు ముని వేషం వేశాడు. ‘భవతీ భిక్షాందేహి’ అన్నాడు. నమ్మిన సీతమ్మను అపహరించాడు. మోసకారి జగన్‌ కూడా అచ్చం అలాగే ప్రజానాయకుడి ముసుగు వేసుకున్నారు. ‘‘మన పిల్లలకు మన దగ్గరే ఉద్యోగాలు’’ అని ఊరించి ఓట్లభిక్ష అడిగారు. నమ్మి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచారు. నలుగురికి అన్నం పెట్టే పరిశ్రమలపై పగబట్టినట్లుగా ప్రవర్తించారు జగన్‌. పారిశ్రామిక ప్రగతిలో మిగిలిన పెద్ద రాష్ట్రాలకంటే ఏపీ చాలా చాలా వెనకపడిపోయేలా చేశారు. దీనివల్ల నష్టం జరిగిందెవరికి? అక్రమాల మేడల్లో హాయిగా కులుకుతున్న జగన్‌కు రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు. కానీ, సామాన్యుల గతేంటి? సర్కారీ కొలువులు లేవు.. ఉద్యోగాలిచ్చే పరిశ్రమల్లేవు.. ఇక యువతరం ఏం చేసి బతకాలి? అమ్మానాన్నలను, బంధుమిత్రులను వదిలేసి ఎన్నాళ్లని పరాయి రాష్ట్రాలకు వలసపోవాలి? అవినీతి, అబద్ధాలే రెండు కళ్లుగా ప్రజావిద్రోహ రాజకీయాలు చేసే జగన్‌కు ఇవేమీ పట్టవు. జనంకోసం అది చేశా, ఇది చేస్తానని సొంత బాకా ఊదుకోవడమే కానీ, చెప్పిందేదీ చేసిన పాపాన పోలేదాయన. ‘‘రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుంది. నా కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చూసుకుంటుంది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవు’’ అని సీఎం అయిన కొత్తలో జగన్‌ ఒక రంగుల సినిమా చూపించారు. అదే చేతల్లోకి వచ్చేసరికి- పారిశ్రామికవేత్తలను నిలువు దోపిడీ చేసే గజదొంగల రాజ్యాన్ని సృష్టించారు. దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.1.21 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాకుండా పోయాయి. దాంతో రెండు లక్షలకు పైగా ఉద్యోగావకాశాలూ మనకు దక్కకుండా పోయాయి. జాదూగర్‌ జగన్‌ సీఎంగా వెలగబెట్టింది ఏంటంటే- ఖాజానాను కళకళలాడించే పారిశ్రామిక దీపాలను ఒకచేత్తో ఆర్పేస్తూ, ఇంకో చేత్తో అప్పుల ముష్టి ఎత్తడం!


అక్కచెల్లెమ్మల పొట్టకొట్టిన జగన్‌

‘జనాన్ని పట్టిపీడించడం నాకు తెలియదు’ అంటూ వెనకటికి ఒక కొరివి దెయ్యం సాధుజీవిలా మొహం పెట్టిందట! దానికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లు మాట్లాడే జగన్‌- ‘రాజకీయ రంగస్థల నట పాషాండ’ బిరుదుకు అర్హులు. ‘‘పైనుంచి కిందిస్థాయి వరకు పారిశ్రామిక వేత్తలను లంచాలు అడిగేవారు ఉండరని చెబుతున్నాను’’ అని సీఎంగా జగన్‌ వీరలెవల్లో ప్రకటిం చారు. పైన ఆయన అలా అపరబుద్ధుడిలా నటిస్తుంటే- కిందిస్థాయిలో జగన్‌ సామంతులేమో  అంతర్జాతీయ కంపెనీలనూ వెంటాడి వేధించారు. కోట్ల రూపాయల కప్పం కడితే తప్ప పనిచేసుకోనివ్వమంటూ  పారిశ్రామిక సంస్థల మెడపై కత్తిపెట్టారు. ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్‌ ‘జాకీ’ తయారీ సంస్థ పేజ్‌ ఇండస్ట్రీస్‌ను ఏపీకి తెచ్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా శ్రమించింది. ఫలితంగా ఏడాదికి 3.24 కోట్ల దుస్తులను తయారుచేసే భారీ కర్మాగారం, గిడ్డంగిని అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాటుచేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. దానికి భూమి కేటాయింపు, అనుమతుల మంజూరు అన్నీ తెదేపా హయాంలోనే పూర్తయ్యాయి. నిర్మాణ పనులు ప్రారంభ సమయంలో ప్రభుత్వం మారి జగన్‌ సీఎం అయ్యారు. ఆ వెంటనే ఆయన బంటు వంటి ఒక ప్రజాప్రతినిధి ఆ కంపెనీ మీద పడ్డారు. ఇంకేముంది.. జగన్‌ పార్టీ సొరచేపను మేపలేక ప్రాజెక్టును రద్దుచేసుకుని రాష్ట్రంలోంచి ‘జాకీ’ వెళ్లిపోయింది. ఆ దుస్తుల కర్మాగారం ఏర్పాటై ఉంటే- వేలాది గ్రామీణ మహిళలకు ఉపాధి లభించేది. ఆ సువర్ణావకాశాన్ని దూరంచేసి అక్కచెల్లెమ్మల పొట్టకొట్టింది జగన్‌ పార్టీయే. రూ.అయిదు వేల కోట్లతో అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు సిద్ధమైన ‘కియా’ కార్ల కంపెనీనీ వదిలిపెట్టలేదు వైకాపా అక్రమార్కులు. వారి బీభత్స చేష్ఠలకు జడిసి విస్తరణ ఆలోచననే విరమించుకుంది ఆ సంస్థ. లులు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ట్రైటాన్‌, బెస్ట్‌ బ్యాటరీ, రిలయన్స్‌, ఏషియన్‌ పల్ప్‌ సంస్థలూ రాష్ట్రానికి దండం పెట్టి తిరిగి చూడకుండా వెళ్లిపోవడానికి కారణమూ జగన్‌ పీడనే.


వైకాపా అధినేత వికృత మనస్తత్వం

చిత్తూరు జిల్లాలోని ‘అమరరాజా’ ఫ్యాక్టరీలు ప్రత్యక్షంగా పరోక్షంగా 70వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కంపెనీ అది. అలాంటి సంస్థ... రూ. 9,500 కోట్ల పెట్టుబడితో కొత్తగా లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంది. అదే జరిగి ఉంటే వేలసంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చేవి. జనం బాగుపడటం ఇష్టం లేని జగన్‌- ‘అమరరాజా’పై అతిదారుణంగా కత్తిగట్టారు.  తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందినది అనే ఏకైక కారణంతో కాలుష్య నియంత్రణ పేరిట ఆ కంపెనీని చెండుకుతిన్నారు. దాంతో ఏపీలో ఏర్పాటుకావాల్సిన భారీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది. రాష్ట్రం మట్టికొట్టుకుపోయినా పర్లేదు, తన కక్ష తీరితే చాలనుకునే వికృత మనస్తత్వం జగన్‌ది. ‘అమరరాజా’కు ఎదురైన చేదు అనుభవమే దానికి తిరుగులేని తార్కాణం!


ప్రగతి విఘాతకుడు

తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లు కాదు, అసలు కాళ్లే లేవని వాదించే మూర్ఖత్వం జగన్‌ది. తన మాటను కాదన్నవారిని కాల్చుకుతినే పైశాచికత్వమూ ఆయనలో నిండుగా ఉంది. అలాంటి వ్యక్తి అధికారంలో ఉన్న రాష్ట్రంవైపు తొంగి చూడటానికి కూడా పెట్టుబడిదారులు ఇష్టపడరు. పైపెచ్చు తెదేపాపై పగతో పాత ఒప్పందాలను జగన్‌ తిరగదోడారు. దానివల్ల దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుందని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. జగన్‌ సర్కారు నిర్ణయాల వంటివాటితో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని పారిశ్రామికవేత్తలూ హెచ్చరించారు. అయితేనేమి, జగమొండి జగన్‌ తాను అనుకున్నదే చేశారు. ఏపీలో పెట్టుబడులకు రక్షణ ఉంటుందన్న నమ్మకాన్ని ఆయన చంపేశారు. దానివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దిగనాసిల్లిపోయింది. 2016-19లో ఏపీకి సుమారు రూ.50వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వచ్చాయి. విధ్వంసకర ఎజెండాతో జగన్‌ సీఎం అయ్యాక ఏపీ పరిస్థితి తిరగబడింది. 2019 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు మధ్యలో మహారాష్ట్రకు రూ.4.72 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయి. కర్ణాటకకు రూ.3.58 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు వెల్లువెత్తాయి. రూ.19,370 కోట్ల పెట్టుబడుల సాధనతో ఆ జాబితాలో ఝార్ఖండ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది.  ఆ చిన్న రాష్ట్రానికి వచ్చిన ఎఫ్‌డీఐల్లో కనీసం సగమైనా ఏపీకి రాలేదంటే- ఆ పాపం జగన్‌ అనే పీడక ప్రభువుదే. ఎఫ్‌డీఐల్లో రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ వంటి వాటికన్నా కిందకు ఏపీని లాక్కుపోయిన ప్రగతి విఘాతకుడు జగనే.


అన్ని వర్గాలనూ ముంచిన జగన్‌

‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు..’ అంటూ జగన్‌ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలే. ‘‘ఎస్సీ, ఎస్టీలను జగన్‌ మోసం చేశారు. మాకు చెల్లించాల్సిన రాయితీలను ఆపేశారు’’ అంటూ సీఎం సొంత జిల్లాకు చెందిన దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలే మొన్న ఫిబ్రవరిలో ఆందోళనకు దిగారు. భూముల కొనుగోళ్లకోసం బీసీ పారిశ్రామికవేత్తలకు గత ప్రభుత్వం కల్పించిన రాయితీలనూ జగన్‌ ఎత్తిపారేశారు. తాను దోచుకోవడం, అయినవారికి రాష్ట్రాన్ని దోచిపెట్టడమే తప్ప సీఎంగా జగన్‌ చేసిందేమీ లేదు.  పారిశ్రామికవాడలనూ ఆయన పట్టించుకోలేదు. పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిలను చెల్లించని జగన్‌ దొంగ నాటకాలు- ఎన్నో కుటుంబాలను ఆకలి మంటల్లోకి నెట్టేశాయి. కొత్త పరిశ్రమలను తీసుకురాని జగన్‌- ఉన్నవాటి ఉసురు కూడా తీసేశారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసి యువత భవితను ఆయన బుగ్గిచేశారు.


జగన్‌ పాలన.. ఓ పీడకల!

కరోనాను మించిపోయి అన్ని పరిశ్రమలనూ ముంచేసిన మహమ్మారి జగన్‌. ఏయే పరిశ్రమలను ఉద్ధరిస్తానని ప్రతిపక్షనేతగా ఆయన మాటిచ్చారో- అధికారంలోకి వచ్చాక వాటన్నిటి నడుములనూ విరగ్గొట్టారు. ‘‘ప్రకాశం జిల్లాలో లక్ష మందికి పైగా గ్రానైట్‌ యూనిట్లపై ఆధారపడి బతుకుతున్నారు. ఈ యూనిట్లను కాపాడుకుంటేనే మన పిల్లలకు ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయి. వలసలు ఆగుతాయి’’ అని జగన్‌ ఉపన్యాసాలు దంచారు. కరెంట్‌ ఛార్జీలను తగ్గిస్తానన్నారు. అదే జగన్‌.. సీఎం కాగానే తనలోని పీడకుణ్ని నిద్రలేపారు. పన్నులూ కరెంట్‌ ఛార్జీల బాదుడును తట్టుకోలేక పోతున్నామని యజమానులు మొత్తుకునే దుస్థితిని కల్పించారు. ఎందరికో ఆసరాగా ఉన్న గ్రానైట్‌ యూనిట్ల తలుపులకు తాళాలుపడేలా చేశారు. ‘‘వైకాపా అధికారంలోకి రాగానే మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తా’’నంటూ జగన్‌ డప్పు కొట్టుకున్నారు. కానీ, ఆయన ఏలుబడిలోనే ఉత్తరాంధ్రలో నాలుగు  సహకార చక్కెర పరిశ్రమలను మూసేశారు. ఆరు చక్కెర ఫ్యాక్టరీలకు చెందిన రూ.2వేల కోట్ల  ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకూ కుతంత్రాలు పన్నారు. కరెంటు ఛార్జీలను జగన్‌ విపరీతంగా పెంచడంతో ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలు కుదేలయ్యాయి. వస్త్ర పరిశ్రమలూ నిర్జీవమయ్యాయి. కార్మికుల జీవితాలెన్నో రోడ్డున పడ్డాయి. పరిశ్రమలకు, వాటిని నమ్ముకున్నవారికి ప్రాణాంతకమైన జగన్‌ పాలన- ఎన్నటికీ మర్చిపోలేని ఒక పీడకల!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని