బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు

వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్‌ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు.

Updated : 28 Mar 2024 07:28 IST

హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడన్న జగన్‌
ఎన్నికలకు ముందు మళ్లీ వివేకా హత్య గురించి ప్రస్తావన
రాజకీయ లబ్ధికి తపిస్తున్నారని షర్మిల, సునీతలపై విమర్శ

ఈనాడు, కడప: వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్‌ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. ‘బాబాయిని అన్యాయంగా చంపేశారు. వివేకా చిన్నాన్నను అతి దారుణంగా చంపిన హంతకుడు (దస్తగిరి) బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో... కానీ నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు. రాజకీయ లబ్ధి కోసం ఒకరిద్దరు నా వాళ్లు (షర్మిల, సునీత) తపిస్తున్నారు. చిన్నాన్నను అన్యాయంగా చంపేసినవారు రాజకీయంగా నాపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.

నాపట్ల దారుణంగా వ్యవహరిస్తూ నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి? ఇంత కన్నా అన్యాయం ఉంటుందా అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా’ అని సీఎం జగన్‌ ప్రొద్దుటూరులో బుధవారం జరిగిన బస్సుయాత్ర బహిరంగసభలో పేర్కొన్నారు. వివేకా చిన్నాన్నను అన్యాయంగా చంపిన హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఇడుపులపాయ నుంచి బుధవారం బస్సుయాత్రను ప్రారంభించిన జగన్‌ వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘చంద్రబాబు వదిన పురందేశ్వరి చుట్టం కంపెనీ డ్రైడ్‌ ఈస్ట్‌ పేరుతో డ్రగ్స్‌ దిగుమతి చేస్తుండగా సీబీఐ దాడులు చేసింది. దీన్ని మనపైనే నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. ప్రతి ఇంటికీ రేషన్‌ రావాలంటే మళ్లీ జగనన్నే రావాలి. పేదల భవిష్యత్తు బాగుపడాలంటే మళ్లీ జగనన్నే రావాలని కోరుకోండి... మీరే నాకు స్టార్‌ క్యాంపెయినర్లు’ అని చెప్పుకొచ్చారు. 2014లో ఈ కూటమి మోసపూరిత హామీలిచ్చిందని విమర్శించారు.

రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా.. మన పార్టీకి.. ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నారని చెప్పారు. కాబట్టే ఈ వైకాపా జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడంలేదన్నారు. ‘ప్రత్యర్థులను చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా?.. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడు, భాజపా, కాంగ్రెస్‌ నాపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నారు.. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు’ అని విమర్శించారు. అంతకు ముందు ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర. వేంపల్లె, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంది. అక్కడ సభ అనంతరం అళ్లగడ్డకు చేరుకుంది. ముందుగా ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమాల్లో పాల్గొన్న విజయమ్మ తన కుమారుడు జగన్‌కు ముద్దుపెట్టి.. ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని