స్క్రీనింగ్‌ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్‌ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు.

Updated : 28 Mar 2024 07:34 IST

అధికార పార్టీ అనుయాయులకే బిల్లులు
ఎన్నికల కోడ్‌తో స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు
కమిటీలో సభ్యుడైన జీఏడీ ముఖ్యకార్యదర్శిని పక్కనపెట్టేసి బిల్లుల చెల్లింపు
చక్రం తిప్పుతున్న ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి
ఎన్నికల సంఘం దృష్టి సారించేనా?

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్‌ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. మార్చి 16 నుంచి 26లోపు ఈ చెల్లింపులు సాగిపోయాయి. ఆర్థిక శాఖలో అధికార పార్టీకి ఎప్పటి నుంచో అండదండలు అందిస్తున్న కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా పూర్తి చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి మార్చి 16న రాసిన లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చి 18న జీవో 607 విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఒక స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ప్రతిపాదన, ప్రతి సిఫార్సును ఈ కమిటీ పరిశీలన తర్వాత ఎన్నికల సంఘానికి సమర్పించాలి. రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన, చర్చ ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన ఆర్థిక బిల్లుల చెల్లింపులో ఎలాంటి పరిశీలన, పారదర్శకత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ పరిశీలన కమిటీలో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శికి ఫైళ్లూ పంపడం లేదని, ఆయన్నుకాదని నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం.2018-19లో తెదేపా ప్రభుత్వం సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం అమలు చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ఏ బిల్లు చెల్లించాలన్నా ఫిఫో (ఫస్ట్‌ ఇన్‌.. ఫస్ట్‌ అవుట్‌) విధానం అవలంబించింది. మొదట వచ్చిన బిల్లు మొదట చెల్లించాలి. ఆ తర్వాత వరుస క్రమంలోనే చెల్లింపు సాగాలి. ఒక విధానం ప్రకారం బిల్లులు చెల్లిస్తుండటంతో.. గుత్తేదారులు, సరఫరాదారులు ఇవాళో, రేపో సొమ్ములు వస్తాయనే నమ్మకంతో పనులు చేసేవారు. జగన్‌ సర్కార్‌ ఈ విధానానికి తిలోదకాలు ఇచ్చింది. ఫిఫో విధానంలో చెల్లింపుల్లో పారదర్శకత ఉండేది.ఈ విధానం ఎత్తివేసి, ఇష్టమైన వారికే బిల్లులు చెల్లిస్తుండడంతో మూడేళ్లుగా బిల్లులు పెండింగులో ఉన్నవారూ ఉన్నారు. కొందరు చిన్న గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకుంటే మరికొందరు దొంగతనం కేసుల్లో చిక్కుకున్నారు.

ఎన్నికల అవసరాలకే తిరిగి మళ్లింపు : ఎప్పుడో కొవిడ్‌ నాటి బిల్లులూ గుత్తేదారులకు, సరఫరాదారులకు ఇంకా పెండింగ్‌ ఉన్నాయి. అధికార పార్టీతో అంటకాగుతున్న ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ బిల్లుల చెల్లింపుల్లో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఇప్పటికీ కావల్సినవారికే చెల్లింపులు సాగుతున్నాయి. ఆ నిధులు తిరిగి మళ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనువుగా ఖర్చు చేసేందుకు తోడ్పడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపులపై ఎన్నికల సంఘం తగిన ఆదేశాలు ఇవ్వాలని గుత్తేదారులు, సరఫరాదారులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని