శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated : 28 Mar 2024 06:32 IST

హైకోర్టు సీజేతో కలిసి స్వామివారిని దర్శించుకున్న సీజేఐ

తిరుమల, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ దంపతులతో కలిసి మహద్వారం వద్దకు చేరుకోగా ఆలయ అర్చకులు, తితిదే ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా సీజేఐ దంపతులు, హైకోర్టు సీజే దంపతులు ధ్వజస్తంభానికి నమస్కరించాక.. శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న సీజేఐ దంపతులు వేద విశ్వవిద్యాలయం సందర్శించారు.

ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ దంపతులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీరితోపాటు తితిదే న్యాయాధికారి వై.వీర్రాజు, జిల్లా ప్రొటోకాల్‌ న్యాయమూర్తి ఎం.గురునాథ్‌, ప్రొటోకాల్‌ మున్సిఫ్‌ న్యాయమూర్తి పి.కోటేశ్వరరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు ఉన్నారు.


తాళపత్ర గ్రంథాలు సంరక్షించాలి: సీజేఐ

తిరుపతి (బైరాగిపట్టెడ): వేదకాలం నాటి తాళపత్ర గ్రంథాల పరిరక్షణలో తితిదే చూపుతున్న శ్రద్ధ ఎనలేనిదని.. ఇలాంటి కృషి దేశవ్యాప్తంగా జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం శ్రీవారి దర్శనానంతరం ఏపీ హైకోర్టు సీజే ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌తో కలిసి అలిపిరి సమీపంలోని తితిదే వేద విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. విశ్వవిద్యాలయంలో భద్రపర్చిన తాళపత్ర గ్రంథాలను తిలకించి, వాటి గురించి తెలుసుకున్నారు. వాటిలోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉందన్నారు. వాటిలోని సమాచారం విశ్వమానవ శ్రేయస్సుకు దోహదపడుతుందని దృఢంగా నమ్ముతున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ దంపతులను తితిదే ఈవో ధర్మారెడ్డి సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. అనంతరం సీజేఐ రేణిగుంట నుంచి విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు.


తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన

ఈనాడు, హైదరాబాద్‌: న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేలులో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహం, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ ఎస్‌.వి.భట్టి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధేలు భూమిపూజ నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని