గ్రూప్‌ 1 అప్పీళ్లపై విచారణ ఏప్రిల్‌ 18కి వాయిదా

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (27/2018) ప్రధాన పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్ల విచారణ ఏప్రిల్‌ 18కి వాయిదా పడింది.

Published : 28 Mar 2024 05:04 IST

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (27/2018) ప్రధాన పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్ల విచారణ ఏప్రిల్‌ 18కి వాయిదా పడింది. ఇప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్న 167 మందిని తొలగించొద్దంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం 18వ తేదీ వరకు పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష మాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ, కొందరు ఉద్యోగులు ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు. బుధవారం ఈ అప్పీళ్లు విచారణకురాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ స్పందించారు. అప్పీళ్లపై ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తారని, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన హాజరుకాలేకపోతున్నారని అన్నారు. విచారణను మరోరోజుకు వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను ఏప్రిల్‌ 18కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని