వ్యవస్థలను కాపాడుకుంటేనే రక్షణ

మన పిల్లలు గౌరవంగా బతకాలంటే.. వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు.

Updated : 28 Mar 2024 06:42 IST

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌
రాష్ట్రంలో ఓటుహక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: మన పిల్లలు గౌరవంగా బతకాలంటే.. వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని బతికించుకోకపోతే మన భవిష్యత్తు క్షేమంగా ఉండదనే విషయం అందరికీ అర్థం కావాలి’ అని చెప్పారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ(సీఎఫ్‌డీ) ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ‘ప్రజాస్వామ్యం-ఓటుహక్కు ప్రాధాన్యం’ అన్న అంశంపై పై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ఓటు, ఎన్నికలకు సంబంధించిన హక్కులన్నీ చట్టం ద్వారా సంక్రమించాయని సుప్రీంకోర్టు ఎక్కడో పొరపాటు పడింది. అందుకే రాజ్యాంగంలో దీనికి ప్రాతిపదిక లేదని చాలా తీర్పులు వచ్చాయి. అసంపూర్తిగా విశ్లేషణ, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా చేసిన వ్యాఖ్యానాల ఫలితం అది’ అని జస్టిస్‌ చలమేశ్వర్‌ వివరించారు. ‘నేనేదైనా పార్టీ పెట్టి 400 సీట్లు సంపాదించాక.. ఎన్నికలు పెద్ద తలనొప్పిగా ఉందంటూ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తే ఏమవుతుంది? దానికి రాజ్యాంగంలో ఏమీ లేదని నమ్మితే.. ఓటు హక్కు, ఎన్నికలు.. పార్లమెంటు, అసెంబ్లీ ఉండవు. చట్టానికి మించి ఏమీ లేదని మనం నమ్మితే లాజికల్‌గా వచ్చే కన్‌క్లూజన్‌ ఇది’ అని వివరించారు.

రాచరిక కాలంలోనూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండేది
- జస్టిస్‌ గ్రంధి భవానీప్రసాద్‌, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఛైర్మన్‌, సీఎఫ్‌డీ

‘రాచరిక కాలంలో చక్రవర్తులు సైతం ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం, విలువ ఇచ్చేవారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో కొంత వెనకేసుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివారు చాలా ప్రమాదకరం. దేశంలో మారాల్సింది నాయకులు కాదు. ప్రజలే మారాలి. ప్రతి ఒక్కరినీ చైతన్య పరచాలి’ అని జస్టిస్‌ భవానీప్రసాద్‌ అన్నారు. ‘2022లో జరిగిన తిరుపతి ఉపఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు చొరబడ్డ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇంకాస్త లోతుగా దర్యాప్తుచేసి ఉండాలి. గ్రామంలో నివసించడంలేదనే సాకుతో ఓటు హక్కు ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌ వెళ్లి ఓటు వేస్తారు. ఆయన అక్కడ నివాసం ఉండటం లేదని ఓటు హక్కు నిరాకరిస్తే ఎలా? వారి మూలాలు జన్మించిన ప్రాంతంలో ఉంటాయి.. అక్కడ ఓటు వేయాలనుకుంటారు. ఓటు హక్కు నిరాకరించే హక్కు అధికారులకు ఎక్కడిది? నేను హైదరాబాద్‌ నుంచి నా స్వగ్రామం దుగ్గిరాలలో ఓటు కోసం నానా వ్యయప్రయాసలకు లోనై పోరాడాల్సి వచ్చింది’ అని పూర్వ ఎస్‌ఈసీ, కార్యదర్శి, సీఎఫ్‌డీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. ‘విద్యావంతులు వివేకంతో ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి’ అని డాక్టర్‌ సమరం పిలుపునిచ్చారు. ‘వ్యక్తిగత గోప్యత జీవించే హక్కులో అంతర్భాగం. గోప్యత విషయంలో రాష్ట్రంలో వాలంటీర్లు ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారు’ అని సిద్దార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌ దివాకర్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజయవాడ తొలి మేయర్‌ జంధ్యాల శంకర్‌, సీఎఫ్‌డీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని