సంక్షిప్త వార్తలు(8)

ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 28 Mar 2024 06:34 IST

ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300

ఈనాడు, అమరావతి: ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది (2023-24)కి సంబంధించి కనీస వేతనం రూ.272గా అమలు చేస్తున్నారు. అదనంగా మరో రూ.28 జోడించి 2024-24 సంవత్సరానికి రూ.300గా కేంద్రం నిర్ణయించింది.


55 మంది వాలంటీర్ల తొలగింపు

న్యూస్‌టుడే, యంత్రాంగం: రాష్ట్రంలో బుధవారం 55 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఈ నెల 16న నియోజకవర్గంలోని చేబ్రోలు, పెదకాకానిలలో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న 52 మంది వాలంటీర్లను తొలగించారు. వీరు కాక.. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇద్దరిని, విశాఖ జిల్లాలో మరొకరిని కూడా తొలగించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 15 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా పత్రాలను బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అందజేశారు.


ఒంగోలులో 900 చీరల పట్టివేత

ఒంగోలు, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలోని ఓ గోదాంలో ఎన్నికల అధికారులు 900 చీరలు పట్టుకున్నారు. చీరల డబ్బాలపై సీఎం జగన్‌, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నాయి. మంజునాథ గ్రానైట్స్‌ అండ్‌ మినరల్స్‌ పేరిట సూరత్‌ నుంచి దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించారు.


గ్రీన్‌కో సంస్థకు భూముల అడ్వాన్స్‌ పొజిషన్‌

ఈనాడు, అమరావతి: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్‌కో సంస్థకు అవసరమైన భూములకు అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 800 మెగావాట్లు, 1500 మెగావాట్లతో రెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ భూములకు అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇచ్చింది.


సలహాదారు చంద్రశేఖరరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. ‘‘ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ నిధుల నుంచి జీతం తీసుకుంటున్నవారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కానీ చంద్రశేఖరరెడ్డి మంగళవారం సచివాలయంలో రాజకీయ నాయకుడిలా తెదేపా నేతలపై విమర్శలు చేశారు. ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసేలా విలేకర్ల సమావేశం నిర్వహించి, ప్రకటన విడుదల చేశారు. కోడ్‌ ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండు చేశారు.


ప్రసూతి సెలవుపై కాకినాడ కలెక్టర్‌ కృతికా శుక్లా

ఈనాడు, అమరావతి: కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ప్రసూతి సెలవుపై వెళుతున్నారు. ఆమె స్థానంలో కలెక్టర్‌గా నియమించేందుకు జె.నివాస్‌తోపాటు హరికిరణ్‌, శ్రీకేష్‌ బాలాజీల పేర్లను సీఈసీకి ప్రభుత్వం పంపింది. వారిలోంచి నివాస్‌ పేరును సీఈసీ ఎంపిక చేసింది. కాకినాడ కలెక్టర్‌గా ఆయన గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.


నెట్‌ స్కోర్‌తో పీహెచ్‌డీ ప్రవేశాలు

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్‌ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) సూచించింది. పీహెచ్‌డీ ప్రవేశపరీక్షల స్థానంలో నెట్‌ స్కోరును తీసుకోవాలని పేర్కొంది. జాతీయ విద్యావిధానం-2020 అమల్లో భాగంగా పీహెచ్‌డీ ప్రవేశాల కోసం జాతీయ ప్రవేశ పరీక్షతోపాటు జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) నిబంధనలను సమీక్షించడానికి యూజీసీ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. 2024-25 నుంచి నెట్‌ స్కోరుతో ప్రవేశాలు కల్పించాలని వెల్లడించింది.


ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లకు అందని జీతాలు

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లు, సంయుక్త సంచాలకులకు ఇంతవరకు ఫిబ్రవరి నెల జీతాలు రాలేదు. వీరికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఇవ్వలేదు. మరోవైపు మార్చి నెల జీతం సైతం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మార్చి జీతాల బిల్లులను ఏప్రిల్‌లో పెట్టాలని ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశించింది. దీంతో రెండు నెలలు జీతాలకు కష్టాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో జీతాలు ఆలస్యమైతే ఉన్నత విద్యామండలిలోని నిధుల నుంచి అప్పుగా ఇచ్చేవారు. ఆ తర్వాత జీతాలు వచ్చాక రికవరీ చేసుకునేవారు. ఈసారి ఉన్నత విద్యామండలి ఇలాంటి చర్యలు తీసుకోలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని