సీఎం పీఆర్‌ఓలా... వైకాపా నాయకులా?

ముఖ్యమంత్రి జగన్‌ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్‌ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు.

Published : 28 Mar 2024 07:24 IST

ప్రభుత్వం నుంచి జీతాలు.. తరించేది వైకాపా సేవలో

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్‌ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ వైకాపా పీఆర్వోలుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార కార్యక్రమాల వివరాలు, వీడియో క్లిప్‌లు, ఫొటోలు, సీఎం జగన్‌ ప్రసంగపాఠం.. వీటన్నింటినీ సీఎంఓ వాట్సప్‌ గ్రూప్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తున్నారు. సీఎం ఎన్నికల ప్రచారంతో పాటు, ముఖ్యమంత్రి సమక్షంలో వైకాపాలో ఎవరు చేరినా ఆ వివరాలూ గ్రూప్‌లో పెడుతున్నారు. ఈ గ్రూప్‌కి ముఖ్యమంత్రి సీపీఆర్‌ఓ పూడి శ్రీహరి, ఆయనతోపాటు పనిచేస్తున్న పీఆర్‌ఓలు అడ్మిన్లుగా వ్యవహరిస్తున్నారు. కోడ్‌ ఇంకా అమల్లోకి రాకముందు వైకాపా సిద్ధం సభల ఫొటోలు, వివరాలను శ్రీహరి సీఎంఓ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. అది ఉల్లంఘన కాకపోయినా.. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ పార్టీ కార్యక్రమాల వివరాల్ని ఎలా పోస్ట్‌ చేస్తారన్న నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి దానికి సంబంధించిన విభాగాల్లో సిబ్బంది ఎటూ ఉండనే ఉంటారు. వాళ్ల పని కూడా ప్రభుత్వం తరఫున నియమితులైన పీఆర్‌ఓలు ఎలా చేస్తారన్నదానికి సమాధానాల్లేవు. ‘‘బస్సుయాత్రకు పల్లె పల్లెల నుంచి కదం తొక్కిన జనం. జగన్‌ను చూసేందుకు సుదీర్ఘ నిరీక్షణ.. టెంట్లు వేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ దారి పొడవునా జగన్‌ కోసం నిరీక్షణ’’- ఇది సీఎం పీఆర్‌ఓ ఈశ్వర్‌ బుధవారం పెట్టిన పోస్టులలో ఒకటి. బుధవారం నుంచి మొదలైన సీఎం ఎన్నికల ప్రచారయాత్ర, రోడ్‌షోకు సంబంధించి సీపీఆర్‌ఓ శ్రీహరి, పీఆర్‌ఓలు ఈశ్వర్‌, చంద్రకాంత్‌ పుంఖానుపుంఖాలుగా ఆ గ్రూప్‌లో సమాచారం పోస్ట్‌ చేస్తూనే ఉన్నారు. ‘‘సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య’’- ఇది ఈ నెల 26న చంద్రకాంత్‌ చేసిన పోస్ట్‌. మార్చి 16న ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత సీఎం సమక్షంలో వైకాపా కండువాలు వేసుకుంటున్న నాయకుల ఫొటోలన్నీ ఈ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు.

ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ..

వైకాపా అధికారంలోకి వచ్చాక... అప్పటి వరకు సాక్షి పత్రిక, టీవీలో పనిచేసేవారికి సీఎంఓను పునరావాస కేంద్రంగా మార్చేసింది. ముఖ్యమంత్రి సీపీఆర్‌ఓతో పాటు, పీఆర్‌ఓలూ ఆ సంస్థ నుంచి వచ్చినవారే. వారికి ప్రభుత్వమే జీతాలిస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు