Praveen Prakash: ప్రవీణ్‌ప్రకాశ్‌ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్‌ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 28 Mar 2024 08:14 IST

విద్యార్థుల తల్లిదండ్రులతో 23న సమావేశం
కోడ్‌ ఉండగా ఓటర్లయిన తల్లిదండ్రులతో ఏం మాట్లాడతారో!

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్‌ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో పిల్లల చదువుల పేరుతో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఈయన అధికార పార్టీకి స్వామిభక్తి ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా స్థాయి నుంచి పాఠశాల వరకు బోధన, బోధనేతర సిబ్బందితో ఏప్రిల్‌ 2న సమావేశం నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ సమయంలో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రవీణ్‌ ప్రకాశ్‌ హడావుడిగా సమావేశాలు నిర్వహించడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లు, నాడు-నేడు, స్మార్ట్‌ టీవీలు, విద్యార్థుల చదువు ప్రగతి తల్లిదండ్రులకు తెలపడంపై చర్చించేందుకేనని చెబుతున్నా అధికార వైకాపాకు మద్దతు కోసమే ఈ సమావేశాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏప్రిల్‌ 2న వర్చువల్‌గా నిర్వహించే ‘ఫ్రమ్‌ ది డెస్క్‌ ది ప్రిన్సిపల్‌ సెక్రటరీ’ కార్యక్రమంలో జిల్లా స్థాయి నుంచి పాఠశాల వరకు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొనాలని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఉపాధ్యాయులను ప్రభావితం చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయి నుంచి పాఠశాల వరకు బోధన, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఆయన ఆదేశించారు. ఏప్రిల్‌ 6 నుంచి 1-9 తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్‌ పూర్తి, నోటు పుస్తకాలను సరిచేయడం వంటి అంశాలను పరిశీలిస్తానని ఆయన చెబుతున్నా తెరవెనుక ఉద్దేశం వేరుగా ఉందనే విమర్శలున్నాయి. పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్‌ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించే సమావేశానికి ఆన్‌లైన్‌లో హాజరై, వారితో సంభాషిస్తానని ఆయన తెలిపారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌లో వారం రోజులపాటు జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి జిల్లాకు ఇద్దరు చొప్పున టోఫెల్‌ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని