జగన్‌ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!

కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్‌ హక్కు సీఎం జగన్‌దే... మొన్నటి వరకు విద్యుత్‌ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.

Updated : 28 Mar 2024 15:50 IST

ఎన్నికల వేళ వైకాపా విద్యుత్‌ నాటకం
ఇళ్లకు అధిక కరెంటు ఇవ్వడానికి సేద్యానికి కోత
వ్యవసాయానికి ఇస్తోంది 7 గంటలే...
అదీ పగలో విడత... రాత్రి మరో విడత
ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు

కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్‌ హక్కు సీఎం జగన్‌దే...  
మొన్నటి వరకు విద్యుత్‌ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే...
ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు...
వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు...
అన్నదాతల పొలాలను ఎండబెడుతూ... ఇళ్లలో ఫ్యాన్లు తిప్పే ఎత్తుగడ వేశారు...
అన్నదాతలు బోరుమంటున్నా... ఈ అభినవ నీరో పట్టనట్లే ఉంటున్నారు!!

ఎన్నికల ఏడాది కావడంతో గృహ విద్యుత్‌ వినియోగదారులకు కోతలు పెడితే ఓట్లకు నష్టం కలుగుతుందని సీఎం జగన్‌ ఆలోచన. మరోవైపు... పీక్‌ డిమాండ్‌ సమయంలో అధిక ధరకు విద్యుత్‌ను కొనాలన్నా మార్కెట్‌లో దొరికే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయంగా సేద్యానికిచ్చే విద్యుత్‌లో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టారు. గత రెండేళ్లుగా వేసవిలో విద్యుత్‌ కోతలతో ప్రజలకు జగన్‌ ప్రభుత్వం చుక్కల్నే చూపించింది. ఈ ఏడాదీ కోతలు కొనసాగిస్తే ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందన్న భయం పట్టుకుంది. దీంతో వ్యవసాయ విద్యుత్‌ను గృహ వినియోగదారులకు మళ్లించింది. పైగా ఎప్పుడు మిగులు విద్యుత్‌ ఉంటే అప్పుడు సేద్యానికి ఫీడర్ల వారీగా సర్దుబాటు చేసేలా పథక రచన చేసింది. అసలే... వర్షాభావ పరిస్థితులతో పంటలు కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్న రైతులకు దిక్కుతోచడంలేదు. బోర్లు పనిచేయక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అల్లాడుతున్నారు. కొన్నిచోట్ల పశువులకు వదలిపెట్టక తప్పని పరిస్థితి. పంటల దిగుబడి తగ్గే ప్రమాదముందని వాపోతున్న రైతులను పట్టించుకునే పరిస్థితిలో జగన్‌ సర్కారు లేదు.

రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో ప్రస్తుతం సేద్యానికి రోజుకు ఏడు గంటలు మాత్రమే విద్యుత్‌ అందుతోంది. పగటివేళ మూడు గంటలు(ఉదయం 8 నుంచి 11 గంటలు) ఇస్తే... అర్ధరాత్రి సమయంలో నాలుగు గంటలు (రాత్రి 12 నుంచి వేకువజాము 4 గంటలు) మాత్రమే ఇస్తున్నారు. అందులోనూ అడపాదడపా లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కోతలు పెడుతున్నారు. ఫలితంగా పంటలు వేగంగా ఎండిపోతున్నాయి.


అన్నదాతల కన్నీళ్లకు కారణమెవరు?

అనంతపురం జిల్లా కణేకల్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామంలో లోకన్న అనే రైతు ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. విద్యుత్‌ సమస్య కారణంగా... ఆయన పొలానికి సరిపడా నీరు అందక మూడు ఎకరాల్లో పైరు కళ్ల ఎదుటే ఎండిపోయింది. గత్యంతరం లేక దాన్ని పశువుల మేత కింద వదలిపెట్టేశారు.


కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన రైతు గుండాల ఆంజనేయులు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఎకరంలో ఉల్లి, మరో ఎకరంలో వేరుశెనగ వేశారు. వ్యవసాయ విద్యుత్‌ను ఆరు గంటలే ఇస్తున్నారు. సాగునీరు పూర్తిగా అందదని ముందే గ్రహించి రెండు ఎకరాలు బీడు పెట్టారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రెండు గంటలపాటు.. మళ్లీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్‌ వస్తోందని, నీరు చాలక దిగుబడి దెబ్బతిందని ఆయన వాపోతున్నారు.


కణేకల్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామానికే చెందిన మరో రైతు ఎర్రిస్వామి 10 ఎకరాల్లో వరి సాగు చేశారు. పొలానికి సరిగా నీరందక నాలుగు ఎకరాల్లో పైరు పూర్తిగా ఎండిపోయింది. సరిపడా తడులు అందితే ఎకరాకు కనీసం 40 బస్తాల  దిగుబడి వచ్చేది. ఇప్పుడు 10 బస్తాలకు మించి రావడం కష్టమని ఆయన కన్నీళ్లు పెడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో 1,200 ఎకరాల్లో వివిధ పంటలు ఎండిపోయాయని అంచనా.


కృత్రిమమేధనూ ఏ‘మార్చి’న ప్రభుత్వం

విద్యుత్‌ డిమాండ్‌ను ముందస్తుగా అంచనా వేయడానికి వీలుగా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు కృత్రిమ మేధతో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాయి. దీనివల్ల విద్యుత్‌ వినియోగ అంచనాల్లో కచ్చితత్వం వస్తుందని, అందుకనుగుణంగా అవసరమైన విద్యుత్‌ కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ తరహా విధానాన్ని అభివృద్ధి చేసినందుకు ఇటీవల యూఏఈ వెళ్లి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును సైతం వారు అందుకున్నారు. ఆ సాంకేతికత కూడా జగన్‌ వ్యూహం ముందు చిన్నబోయింది. ప్రస్తుత మార్చిలో దాని అంచనాలు తప్పాయి. ఈ నెలలో ఏపీలో విద్యుత్‌ వినియోగం 245 నుంచి 250 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) మధ్య ఉంటుందని కృత్రిమమేధ అంచనా వేసింది. కానీ, అది 230 ఎంయూలు దాటడం లేదు. గత బుధ(20న), గురువారాల్లో(21న) మరీ దారుణంగా 225 ఎంయూలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవడంతో రాత్రి వేళల్లో ఏసీ లేకుండా గడవడమే కష్టంగా ఉంది. అలాంటప్పుడు వినియోగం పెరగాలి కదా?

వారం రోజుల కిందట రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 245 ఎంయూలుగా ఉంది. డిమాండ్‌ సర్దుబాటు చేయడానికి డిస్కంలు రియల్‌టైం మార్కెట్‌లో 2.22 ఎంయూలను కొన్నాయి. అప్పటి నుంచి విద్యుత్‌ వినియోగం క్రమేణా తగ్గుతూ శుక్రవారం(22) నాటికి 230.74 ఎంయూలకు చేరింది.

థర్మల్‌ ప్లాంట్లు పరిగెత్తుతూనే ఉన్నాయి

గత శనివారం(23న) మిట్ట మధ్యాహ్నం గ్రిడ్‌ గరిష్ఠ డిమాండ్‌ 12,466 మెగావాట్లుగా ఉంది. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 8,310 మెగావాట్లు. వాటి ద్వారా శుక్రవారం(22న) పీక్‌ డిమాండ్‌ సమయంలో 5,604 మెగావాట్ల విద్యుత్‌ గ్రిడ్‌కు అందితే... ఆఫ్‌ పీక్‌ సమయంలో 4,849 మెగావాట్లు అందింది. రోజులో సగటున 5,261 మెగావాట్ల ఉత్పత్తి జరిగింది. వేసవిలో డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో వీలైనంత మేరకు థర్మల్‌ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్‌ తగ్గితే అంతగా ఒత్తిడి పెట్టి మరీ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏముంది?

ఫలితమివ్వని పనులు... దిక్కులేని పొలాలు

‘‘రైతులకు పగటి పూటే 9 గంటలు విద్యుత్‌ ఇచ్చేలా అడుగులు వేశాం. రాష్ట్రంలోని 90% పైచిలుకు ఫీడర్లను పగలు విద్యుత్‌ అందించేలా తీర్చిదిద్దాం. మిగిలిన 10% ఫీడర్లనూ సిద్ధం చేస్తాం’’ మూడేళ్ల కిందట సీఎం జగన్‌ చెప్పిన మాటలివి. ప్రభుత్వం అప్పట్లో ఫీడర్ల అభివృద్ధికి రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద వివిధ అభివృద్ధి పనులకు రూ.8,358 కోట్లు వెచ్చించింది. మొత్తం రూ.10,058 కోట్లు ఖర్చు చేసినా.. తీగల్లో కరెంటు లేకుంటే ఉపయోగమేంటి? రైతుల పొలాల్లో మోటార్లు తిరగకుంటే లాభమేంటి?


డిమాండ్‌ తగ్గిందని తప్పుడు లెక్కలు

ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే కరెంటులో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టడంతో వాస్తవ విద్యుత్‌ డిమాండ్‌లో సుమారు 15 ఎంయూలు తగ్గింది. దీంతో మార్చిలోనూ రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ 225 నుంచి 230 ఎంయూల మధ్య ఉంటోంది. ఏదో ఒకట్రెండు రోజులు వాతావరణ మార్పుల కారణంగా డిమాండ్‌ తగ్గిందని సరిపెట్టుకోవచ్చు. కానీ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.5 డిగ్రీలకు తగ్గడం లేదు. అయినా, విద్యుత్‌కు నిరుటి అంత డిమాండ్‌ లేదని జగన్‌ సర్కారు లెక్కల్లో గోల్‌మాల్‌ చేస్తోంది.


ఈనాడు, అమరావతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని