నమ్మించారు.. వంచించారు

‘హైదరాబాద్‌కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు.

Published : 28 Mar 2024 05:07 IST

ఆళ్లగడ్డలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చూపించగలరా..?
రూ.8 కోట్లు ఇవ్వలేక గాలికొదిలేసిన ఆసుపత్రి పరిస్థితి ఏమిటి?
మాటల్లో మీరేసిన రింగురోడ్దు మీదుగానే నంద్యాలకు వెళతారా..?
నేడు ఆళ్లగడ్డ, నంద్యాలలో సీఎం పర్యటన

ఈనాడు, అమరావతి: ‘హైదరాబాద్‌కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో, పాదయాత్రలో, తర్వాత అధికారంలోకొచ్చాక సీఎంగా నంద్యాల, ఆళ్లగడ్డకు వెళ్లినప్పుడు జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఇప్పుడా రెండు పట్టణాల రూపురేఖలే మారిపోయేవి. కానీ ఇవన్నీ ఊహలే. జగనన్న చెప్పారంటే చేయరంతే! ఆయన చేయలేదు కాబట్టే ఈ రెండు పట్టణాల్లో అభివృద్ధి, రైతులకు సాగునీరు కలగానే మిగిలాయి.

నంద్యాలలో నమ్మించిన మాటలు గుర్తున్నాయా..?

‘ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక పులివెందులపై ఎంత శ్రద్ధ పెడతానో అదే స్థాయిలో నంద్యాలపైనా చూపిస్తా. నంద్యాల అభివృద్ధిని నాకొదిలేయండి. పరుగులు పెట్టిస్తా. నంద్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్ది గుర్తింపు తెస్తా’ వై.ఎస్‌.జగన్‌ ఇచ్చిన హామీల పరంపరలోని మాటలివి. తర్వాత సీఎం హోదాలో వెళ్లినప్పుడు నంద్యాలకు రింగురోడ్డు ఏర్పాటు చేయిస్తాననీ చెప్పారు.

ఏం చెప్పారు.. ఏం చేశారు?

నంద్యాల అభివృద్ధి పరుగు మాట తర్వాత.. ఈ అయిదేళ్లలో కనీసం నడక కూడా ప్రారంభించలేదు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ప్లాన్‌ కూడా ఇంకా పూర్తికాలేదు. ఈ లెక్కన ఆ పట్టణం ఎన్ని వందల ఏళ్లకు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాగలదో ఏలినవారే చెప్పాలి. నంద్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని జగన్‌ చెబితే స్థానికులు కలలు కన్నారు. ఇప్పుడా కలలు మురుగు కాలువల రూపంలో వారిముందే కనిపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే కాలనీలు నీట మునుగుతాయి. నంద్యాల చిన్న చెరువును ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామని జగన్‌ చెప్పారు. గురువారం ఆ ట్యాంక్‌బండ్‌ చూపించగలరా? పట్టణ శివార్లలో పీవీ నగర్‌ డంప్‌యార్డులో చెత్తను శుద్ధిచేసి ఎరువుగా మార్పిస్తామన్నారు. అదీ అంతే. బొమ్మలసత్రం నుంచి నూనెపల్లె పైవంతెన వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి మూడేళ్ల కిందట రూ.13.40 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పగించారు. అందులోభాగంగా కిలోమీటరు పొడవున మురుగుకాలువల నిర్మాణాన్ని ప్రారంభించినా ఆ పనులూ పూర్తికాలేదు. కుందూ నదిపై వంతెన నిర్మాణ పనులు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనా జగన్‌ ప్రభుత్వం నిధులు ఇవ్వక ఆగిపోయాయి. తెదేపా హయాంలో అమృత్‌ పథకం కింద వెలుగోడు రిజర్వాయరు నుంచి నంద్యాలకు తాగునీటి పైపులైన్‌ ఏర్పాటుచేసే పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారే సమయానికి 30% పనులు మిగిలాయి. వాటినీ పూర్తిచేయలేదు.

ఆళ్లగడ్డ అధోగతి

2022 అక్టోబరు 17న సీఎం జగన్‌ ఆళ్లగడ్డలో పర్యటించారు. అప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అట్టహాసంగా ప్రకటించారు. ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్కటీ ఏర్పాటుకాలేదు.

  • ఆళ్లగడ్డలోని 50 పడకల ఆసుపత్రి విస్తరణకు రూ.8కోట్లు మంజూరు చేస్తామన్నారు. 18 నెలలైనా రూపాయి ఇవ్వలేదు.
  • ఆళ్లగడ్డ పురపాలికలో విలీనమైన గ్రామాలు, వార్డుల అభివృద్ధికి రూ.56 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందులో రూపాయి కూడా రాలేదు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా పదివార్డుల్లో పనులకు రూ.5 కోట్లు కేటాయించారు.
  • శిరివెళ్ల-రుద్రవరం, రుద్రవరం-యర్రగుడిదిన్నె గ్రామాల మధ్య హైలెవెల్‌ వంతెనలకు రూ.16 కోట్లు మంజూరుచేస్తున్నట్లు హామీ ఇచ్చినా పనులు ప్రారంభించలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని