దాడి చేసి.. దండంతో సరి!

కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్‌కుమార్‌లను కొట్టిన మాజీ కార్పొరేటర్‌, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు.

Published : 28 Mar 2024 06:51 IST

అర్చకుణ్ని కొట్టిన వైకాపా నేతకు పార్టీ పెద్దల దన్ను
అధికారపక్షం ఒత్తిళ్లతో కీలక శాఖల్లో తర్జనభర్జన
హిందూ వ్యతిరేక వైకాపాకు బుద్ధి చెబుతాం: వీహెచ్‌పీ

ఈనాడు- కాకినాడ, న్యూస్‌టుడే- గాంధీనగర్‌: కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్‌కుమార్‌లను కొట్టిన మాజీ కార్పొరేటర్‌, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. రెండు రోజులుగా బాధిత అర్చకులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చిన వైకాపా నేతలు.. కేసును నీరుగార్చేలా దేవాదాయ, పోలీసు శాఖలనూ ప్రభావితం చేస్తున్నారు. దేవుడి సన్నిధిలో అర్చకుణ్ని కొట్టి, కాలితో తన్నిన వ్యవహారం రచ్చకెక్కడంతో.. ఈ కేసును ఏ మాత్రం నీరుగార్చినా బలైపోతామని ఆయా శాఖల అధికారులు అందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. అర్చకులపై దాడి చేసిన వ్యక్తి కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుడు. మంగళవారం దేవాదాయశాఖ ఇన్‌ఛార్జి ఆర్జేసీ విజయరాజు ఈ ఘటనపై విచారణ జరుపుతున్న సమయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రోద్బలంతో కొందరు నాయకులు రాజీకి ఆపసోపాలు పడ్డారు. అర్చకులను కొట్టిన చంద్రరావు ససేమిరా అంటున్నా.. బలవంతంగా క్షమాపణ చెప్పించి వ్యవహారం సద్దుమణిగిందని మీడియాను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆర్జేసీ విచారణ జరుగుతున్నప్పుడు తెదేపా, భాజపా, ఇతర సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని వైకాపా నాయకులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. దీంతో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే ద్వారంపూడి శివాలయానికి వచ్చి అర్చకుడు సాయిని పరామర్శించారు. చంద్రరావుకు వయసు మీరడం, ఇతర కారణాలతో చేయిచేసుకున్నాడని, దీన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. దేవాదాయశాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్‌ సైతం అర్చకులతో ఫోన్లో మాట్లాడి చల్చార్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

కమిషనర్‌కు విచారణ నివేదిక

దాడి ఘటనపై విచారణ జరిపిన దేవాదాయశాఖ ఆర్జేసీ విజయరాజు కాకినాడ డీఎస్పీతో, బాధిత అర్చకుడితో మాట్లాడి విచారణ నివేదికను కమిషనర్‌కు పంపారు. అర్చకులు రాజీకి వచ్చినా పోలీసు కేసు నమోదవడంతో చర్యలు ఉంటాయని ఆర్జేసీ స్పష్టం చేశారు. చంద్రరావుపై చర్యల్లో భాగంగా 41ఏ నోటీసిచ్చామని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.

చర్యలు తీసుకోకుంటే.. ‘చలో కాకినాడ’

కాకినాడలో అర్చకులపై దాడి చేసిన వైకాపా నాయకుడు సిరియాల చంద్రరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే చలో కాకినాడకు పిలుపునిస్తామని విశ్వహిందూ పరిషత్తు నాయకులు హెచ్చరించారు. ఆ సంస్థ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన రాజు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల సంఘటనా కార్యదర్శి గంధం గోవింద్‌, హైందవవీర్‌ అధ్యక్షుడు పి.వరప్రసాద్‌ తదితరులు బుధవారం అర్చకులను కలిసి  సంఘీభావం తెలిపారు. పిఠాపురం, అంతర్వేది, రామతీర్థం, భీమవరం ఘటనల్లాగే దీనినీ నీరుగార్చకుండా నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హిందూ వ్యతిరేక వైకాపా ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని