సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?

‘డ్రైడ్‌ఈస్ట్‌ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు.

Updated : 28 Mar 2024 07:45 IST

ఆ కుటుంబానికి వైకాపాతో సంబంధాలు సుస్పష్టం
అయినా.. తమపై తోస్తున్నారంటూ జగన్‌ బుకాయింపు


‘డ్రైడ్‌ఈస్ట్‌ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. సాక్షాత్తు రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు, చంద్రబాబునాయుడి వదినమ్మగారి కొడుకు, వియ్యంకుడు.. ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు.. నేరమంటూ జరిగితే అది చేసింది వారు.. తోసేది మనమీద..’

బుధవారం వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్‌ అన్న మాటలివి

జగన్‌ ఈ మాటలు చెప్పడానికి సరిగ్గా 5 గంటల ముందు..

జగన్‌ కేబినెట్‌లో మంత్రి, వైకాపా సంతనూతలపాడు అభ్యర్థి మేరుగు నాగార్జున.. డ్రైడ్‌ఈస్ట్‌ పేరుతో మాదకద్రవ్యాలు దిగుమతి అయిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్య ఆక్వా సంస్థ ఎండీ సోదరుడు, వైకాపా నేత కూనం పూర్ణచంద్రరావు ఇంటికి వెళ్లారు. ఏం మాట్లాడారో బయటకు తెలియకుండా జాగ్రత్తపడుతూ వెంట కార్యకర్తలెవరినీ తీసుకెళ్లలేదు. ఫొటోలు కూడా తీయవద్దని చెప్పారు. కొద్ది రోజుల కిందట వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆయనతో రాజకీయాలు చర్చించారు. కొద్ది రోజుల క్రితం..ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కూడా అదే ఇంట్లో అతిథి మర్యాదలు అందుకున్నారు. మరి ‘సంధ్య ఆక్వా’ కుటుంబానికి ఏ పార్టీతో సంబంధాలున్నట్లు జగన్‌? ఎవరు ఎవరిమీద తోస్తున్నారు?


ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, ఒంగోలు నేర విభాగం: ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పింది.. మంత్రి మేరుగు నాగార్జున ఈదుమూడికి వెళ్లి వైకాపా నేత పూర్ణచంద్రరావును కలిసినదీ బుధవారమే. వైకాపాతో సంధ్య ఆక్వా సంస్థ కుటుంబానికి ఉన్న సంబంధాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా.. ముఖ్యమంత్రి ఇంకా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు వదినగారి చుట్టం అంటూ బుకాయిస్తూ.. ప్రతిపక్షంపై ఆయన బురద జల్లుతున్నారు. ఎవరు ఎవరిమీద తోస్తున్నారో స్పష్టంగా ప్రజలందరికీ కనిపిస్తున్నా..ఇంకా నమ్మించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రైడ్‌ఈస్ట్‌లో మాదక ద్రవ్యాల అవశేషాలు ఉన్నాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన వ్యవహారం రాష్ట్రమంతా సంచలనం సృష్టించింది. ఇంత జరిగాక కూడా మేరుగు నాగార్జున రహస్యంగా వైకాపా నాయకుడు కూనం పూర్ణచంద్రరావు ఇంటికి వెళ్లొచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌కు తెలియకుండా ఆయన అక్కడికి వెళ్లగలరా? సహకార పరపతి సంఘం త్రీమెన్‌ కమిటీ ఛైర్మన్‌గా పూర్ణచంద్రరావును నియమించింది కూడా జగన్‌ ప్రభుత్వమే. సంక్రాంతికి ఊళ్లో వేసిన బ్యానర్లలో ఉన్న ఫొటోలు కూడా జగన్‌, రాజశేఖరరెడ్డి, వైకాపా నేతలవే. ఎంపీ విజయసాయిరెడ్డితో పూర్ణచంద్రరావు జరిపిన రాజకీయ చర్చలూ సామాజిక మాధ్యమాల్లో బయటకొచ్చాయి. అయినా ముఖ్యమంత్రి మాత్రం అబద్ధాలు వల్లెవేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని