ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్‌!

దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్‌ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో!

Updated : 28 Mar 2024 12:16 IST

చిన్నాన్నను ఎవరు చంపించారో అందరికీ తెలుసన్న జగన్‌
ప్రొద్దుటూరు సభలో వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్‌ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! ఈ హత్యకేసులో అసలైన కుట్రదారు అవినాష్‌రెడ్డేనని సీబీఐ తేల్చిచెప్పినా.. ఆయన్నే పక్కన పెట్టుకుని మరీ ‘‘మా చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసు’’ అని వ్యాఖ్యానించటం జగన్‌కే చెల్లింది.

పక్కనే నిందితుడిని పెట్టుకుని... నంగనాచి కబుర్లా!

జగన్‌: మా చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసు.

వివేకా హత్య కేసులో తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని మరీ మీరు పలికించిన నవరసాలు నభూతో... నభవిష్యతి. హత్యకు కుట్ర పన్నింది, హత్యానంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసింది కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డేనని సీబీఐ అభియోగపత్రంలోనే స్పష్టం చేసింది. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా ఈ హత్య చేయించారనే అనుమానం ఉందనీ పేర్కొంది. వివేకాతో అవినాష్‌రెడ్డికి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి విభేదాలు ఉండటంతోనే ఈ కుట్రకు తెరలేపారని తేల్చింది. భాస్కరరెడ్డిని అరెస్టు చేసి జ్యుడిషియల్‌ రిమాండులో ఉంచింది. అవినాష్‌ను సాంకేతికంగా కాగితాలపై అరెస్టు చేసి వెంటనే బెయిల్‌ ఇచ్చేసింది. సీబీఐ ఇంత స్పష్టంగా అభియోగపత్రాల్లో వెల్లడిస్తే ఇంకా వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసనడం ఏంటి?

ఒక కన్ను మరో కంటిని పొడుచుకుంటుందా? అంటూ క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది మీరు కాదా?

జగన్‌: వివేకా చిన్నాన్నను అతి దారుణంగా, హేయంగా చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నారు. ఆయనకు మద్దతిస్తున్నదో ఎవరో అందరూ రోజూ చూస్తున్నారు.
మీరన్నది నిజమే... వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నారు. ఆయన స్వేచ్ఛకు కారణం ఎవరో రాష్ట్ర ప్రజలందరూ రోజూ చూస్తున్నారు. ఈ కేసులో సీబీఐ ఒక్కో తీగ లాగుతూ... అవినాష్‌రెడ్డి ప్రమేయాన్ని బయటపెట్టే సమయంలో దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టారు. అవినాష్‌ను సీబీఐ అనుమానితుడిగా గుర్తించిన వెంటనే ‘‘ఒక కన్ను మరో కంటిని పొడుచుకుంటుందా?’’ అంటూ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చేస్తూ, దర్యాప్తును ప్రభావితం చేసేలా మీరే అసెంబ్లీలో మాట్లాడారు. అవినాష్‌ అమాయకుడని మీరు నమ్మితే సరిపోతుందా? సీబీఐ లాంటి సంస్థే ఆయనే కుట్రదారని చెబుతుంటే... అందుకు విరుద్ధంగా మీరు మాట్లాడటమేంటి? మీ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అనేక సందర్భాల్లో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ సీబీఐపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ, అవినాష్‌ను సమర్ధించుకొచ్చారు కదా! దీన్నిబట్టి నిందితులకు ఎవరు మద్దతిస్తున్నారో తేలిపోయింది కదా!

జైలుకు వెళ్లకుండా అడ్డుకున్నది మీరే!

జగన్‌: వివేకాను చంపినోళ్లు ఉండాల్సింది జైల్లో. కానీ నెత్తిన పెట్టుకుని మరీ చంద్రబాబు, ఆయన మనుషులు వారికి మద్దతిస్తున్నారు.

ఈ కేసులో కుట్రదారుగా సీబీఐ పేర్కొన్న నిందితుడు అవినాష్‌రెడ్డి జైలుకు వెళ్లకుండా అడ్డుకున్నది మీరు, మీ అనుచరగణం, మీ పార్టీ, మీ ప్రభుత్వ యంత్రాంగమే. అవినాష్‌ నిందితుడని తేలాక పదేపదే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయిస్తూ న్యాయపరమైన చిక్కులు కల్పించారు. వాటన్నింటినీ దాటుకుని ఆయన్ను అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లగా... వారికి సహాయ నిరాకరణ చేసి, ముప్పుతిప్పలు పెట్టారు. అవినాష్‌ ఉన్న ఆసుపత్రి ప్రాంగణం దరిదాపుల్లోకి కూడా సీబీఐ అధికారులను రానీయకుండా రోజుల తరబడి ఆసుపత్రి లోపల, బయట మోహరించి వీరంగం, దౌర్జన్యం చేశారు. వారిని అక్కడనుంచి ఖాళీ చేయించకుండా రాచమర్యాదలు చేయించారు. నిందితులు జైల్లో ఉండాలని చెబుతున్నారే.. ఆ నిందితుల్ని జైల్లోకి వెళ్లకుండా కాపాడింది ఎవరు మీరు, మీ ప్రభుత్వం కాదా?

వాస్తవాలు చెబుతుంటే బురద చల్లడమంటారా?

జగన్‌: మా బాబాయ్‌ హత్యకేసు విషయంలో బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనక ఎవరున్నారో మీ అందరికీ రోజూ కనిపిస్తోంది.

తన తండ్రి హంతకులకు, హత్య కుట్రదారులకు శిక్ష పడేలా పోరాటం చేస్తున్న సునీతపై, ఆమెకు మద్దతుగా నిలిచిన షర్మిలపై అభాండాలు వేస్తున్నది ఎవరో అందరికీ కనిపిస్తోంది. న్యాయం కోసం పోరాడుతున్న ఆ ఇద్దరు ఆడబిడ్డలపై బురద చల్లుతున్నది, చల్లిస్తున్నది ఎవరో ప్రతి ఒక్కరి కళ్లకూ కడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని