ఆరంభమే ఫ్లాప్‌

వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్‌ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్‌ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు.

Updated : 28 Mar 2024 07:26 IST

సొంత ఇలాకాలో జగన్‌కు షాక్‌
వందల బస్సులు పెట్టి నాలుగు జిల్లాల నుంచి తరలించినా కానరాని జనం
ప్రొద్దుటూరు సభకు  సీఎం రాకముందే సగం ఖాళీ
సీఎం సభ సాక్షిగా ఎమ్మెల్యే రాచమల్లు, ఎమ్మెల్సీ రమేష్‌ల వర్గపోరు
మరోమారు బహిర్గతం

ఈనాడు, అమరావతి: వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్‌ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్‌ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. ‘సిద్ధం’కు మించి ‘మేమంతా సిద్ధం’ అంటూ ఎంతో ఆర్భాటంగా సొంత ఎస్టేట్‌ నుంచి జగన్‌ బుధవారం ప్రారంభించిన ఎన్నికల ప్రచార యాత్ర తొలిరోజే తుస్సుమంది. ఇడుపులపాయలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, పోలీసుల హడావుడే తప్ప జనం లేరు. అక్కడి నుంచి జనం పెద్దగా లేకుండానే ప్రొద్దుటూరు వరకు సీఎం బస్సు యాత్ర సాగింది. పెద్దగా స్పందన లేకున్నా బస్సులో కూర్చుని వెళుతూ జగన్‌ తనదైన శైలిలో చుట్టుపక్కల ఉన్నవారికి, ‘లేని’వారికి కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని వేంపల్లె, జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల లాంటి కొద్ది కూడళ్లలో డ్రోన్‌ షాట్స్‌ కోసం జనాలను పోగు చేశారు. అక్కడ మాత్రం జగన్‌ బస్సు టాప్‌పైకి ఎక్కి జనానికి అభివాదం చేశారు.

బస్సులు పెట్టి తరలించినా...: ప్రొద్దుటూరు సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి జనాన్ని బస్సులు పెట్టి మరీ తరలించారు. వైకాపా నేతలు ఎంత కష్టపడినా, ఆ బస్సుల్లో జనం సగం సగమే సభకు వచ్చారు.. సీఎం సభావేదికపైకి సాయంత్రం 6 గంటలకు వచ్చేసరికి ఆ జనంలోనూ ఎక్కువ మంది వెళ్లిపోయారు. 6:30 గంటల సమయంలో జగన్‌ ప్రసంగం ప్రారంభమయ్యాక సభలో ఉన్న జనం కూడా మెల్లగా తిరుగుపయనమయ్యారు.

ఎందుకిలా..?: ఇన్నాళ్లూ అధికారంలో ఉండి ఆసరా పథకం ఇవ్వబోమనో, పథకాలను ఆపేస్తామనో డ్వాక్రా మహిళలను బెదిరించి సభలకు తరలించారు. ‘ఇప్పుడు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున అధికార దుర్వినియోగం సాధ్యపడడం లేదా? మన సలహాదారు, ఐ-ప్యాక్‌ సరిగా ప్లాన్‌ చేయలేదా? ఎక్కడ తేడా కొట్టింది? అధికారం లేకపోతే ఎలా ఉంటుందనేది జగన్‌ తొలి సభలోనే ఆవిష్కృతమైందా’ అనే చర్చ ఇప్పుడు వైకాపా వర్గాల్లోనే జరుగుతోంది. ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి జగన్‌ సభ సాక్షిగా.. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ల వర్గపోరు బయటపడింది. సీఎంకు ఆహ్వానం పలుకుతూ ఎమ్మెల్సీ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గంవారు తొలగించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని