డోన్‌, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు

కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.

Published : 28 Mar 2024 05:37 IST

నేడో, రేపో రూ.55 కోట్లు చెల్లింపులకు సిద్ధం
కమలాపురం కాంట్రాక్టర్‌కు రూ.6.38 కోట్ల టోకెన్లు!
ఇతర గుత్తేదారులకు మొండిచేయి

ఈనాడు, అమరావతి: కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఏడాదిగా వీరికి చెల్లింపుల్లేవు. ఆర్థిక సంవత్సరం చివర్లో అయినా బిల్లులు వస్తాయనే ఆశతో ఉన్నారు. ఇంతలో అధికార పార్టీ కీలక నేతల తాలూకా గుత్తేదారులు పది రోజుల కిందట బిల్లులు అప్‌లోడ్‌ చేసి, ఆఘమేఘాలపై టోకెన్లు జారీ చేయించుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వారికి బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఇతర గుత్తేదారులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా సరే.. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారి ఒత్తిడితో, ఆర్థికశాఖ అధికారులు మాత్రం ఆ గుత్తేదారులకు బిల్లులివ్వడానికి సన్నద్ధమైనట్లు తెలిసింది.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఆర్‌అండ్‌బీ గుత్తేదార్లకు సరైన న్యాయం జరగడం లేదు. అధికార పార్టీలో కీలక నేతలు, పెద్దల ఆశీస్సులున్న వారికే బిల్లులు వస్తున్నాయి. తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి నియోజకవర్గం డోన్‌లో సీఆర్‌ఐఎఫ్‌ పనులు చేసిన పి.తిరుపతిరెడ్డి అనే గుత్తేదారుకు రూ.48.86 కోట్లు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఓ సీనియర్‌ ఎమ్మెల్యేకు చెందిన శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.7.04 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు తెలియగానే, 15వ తేదీ రాత్రి రూ.67 కోట్లకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆదేశాలు (బీఆర్వోలు) ఇచ్చారు. సీఎంఓలోని ఓ కీలక అధికారి.. ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బీఆర్వో ఇచ్చేలా చూసినట్లు తెలిసింది. సాధారణంగా బీఆర్వో వస్తే.. రాష్ట్రంలోని 33 ఆర్‌అండ్‌బీ డివిజన్లలో ఎక్కడి నుంచి అయినా గుత్తేదారులు బిల్లులు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుంటుంది. కానీ సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులతో మాట్లాడి కేవలం డోన్‌ నియోజకవర్గం, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఓ నియోజకవర్గ పరిధిలో బిల్లులు మాత్రమే అప్‌లోడ్‌ అయ్యేలా ఆ డివిజన్ల ఈఈలకు మాత్రమే అవకాశం కల్పించారు. తర్వాత ఈ బిల్లుల చెల్లింపులకు వీలుగా 6 టోకెన్లు కూడా జారీచేశారు. దీంతో ఏ క్షణమైనా వీరికి చెల్లింపులు చేయొచ్చని తెలిసింది.

క్యూసీ లేకపోయినా బిల్లు ఇస్తారట!

సీఎం జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో పనులు చేసిన ఈశ్వర్‌రెడ్డి అనే గుత్తేదారుకు రూ.6.38 కోట్ల బిల్లులు ఉండగా, దీనీకి బీఆర్వో ఇచ్చారు. వాస్తవానికి ఈ పనులకు క్వాలిటీ కంట్రోల్‌ (క్యూసీ) విభాగం నుంచి ఇంకా క్లియరెన్స్‌ రాలేదు. క్యూసీ లేకుండా బిల్లులు అప్‌లోడ్‌ చేయకూడదు. అయినా సరే అప్‌లోడ్‌ చేసి, టోకెన్ల జారీకి ఒత్తిళ్లు తెస్తున్నారు.

ఎన్నికల సంఘం అనుమతిస్తుందా?

తొలుత బిల్లులు అప్‌లోడ్‌ చేసినవారికి తొలుత చెల్లింపులు (ఫస్ట్‌ ఇన్‌.. ఫస్ట్‌ అవుట్‌) అనే విధానానికి బదులు, జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇష్టానుసారం చెల్లింపులు చేస్తున్నారని గుత్తేదారులు వాపోతున్నారు. పాత విధానాన్నే కొనసాగించాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక దీనిపై బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌), స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (సబ్కా) నేతలు వేర్వేరుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. అయినా సరే ఆర్థికశాఖ అధికారులు అధికార పార్టీకి కావాల్సిన గుత్తేదార్లకే చెల్లింపులు జరిపేందుకు ఏర్పాట్లు చేయడంపై ఇతర గుత్తేదారులు మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని