సంక్షిప్త వార్తలు (14)

తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ గురువారం దర్శించుకున్నారు.

Updated : 29 Mar 2024 05:23 IST

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ గురువారం దర్శించుకున్నారు. తిరుమలలోని పుష్పగిరి మఠంలో ఆయన సోదరుడు వెంకటసత్యం, రామరత్నం దంపతుల కుమారుడు భానుప్రకాశ్‌, సౌజన్యల వివాహం బుధవారం జరిగింది. నూతన వధూవరులు, కుటుంబ సభ్యులతో కలిసి న్యాయమూర్తి ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు.

గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం సాయంత్రం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.


18 కిలోల పుచ్చకాయ!

డోన్‌, న్యూస్‌టుడే: పుచ్చకాయలు సాధారణంగా 5 నుంచి 10 కిలోల బరువు ఉంటాయి. కానీ నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలోని ఓ దుకాణం వద్ద పుచ్చకాయ ఏకంగా 18.5 కిలోల బరువు తూగింది. చూపరులను ఆకట్టుకుంది.


కూటమి విజయానికి కాపు బలిజ సంక్షేమ సంఘం కృషి

హరిరామజోగయ్య

పాలకొల్లు మార్కెట్‌, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయమే ధ్యేయంగా కాపు బలిజ సంక్షేమ సంఘం పనిచేస్తోందని మాజీ మంత్రి, ఆ సంఘ వ్యవస్థాపకుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం విలేకరులతో  మాట్లాడారు. కాపు, బలిజ సంక్షేమ సంఘాన్ని  కొంత మంది సన్నిహితులతో కలిసి తానే స్థాపించినట్లు చెప్పారు. కూటమి గెలుపు కోసం పవన్‌కల్యాణ్‌ వెనుక పరుగుతీసే గుర్రాలతో కలిసి పరుగుపెడతామని, సీఎం జగన్‌ ఓటమికి పనిచేస్తామని చెప్పారు. బీసీలతో సమానంగా కాపు జాతికి కూడా వారి మ్యానిఫెస్టోలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రకటించాలని కోరారు.


వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షా కేంద్రాల వివరాలు

 ఈనాడు డిజిటల్‌, అమరావతి: జేఈఈ మెయిన్స్‌-2024 సెషన్‌-2 పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. దేశవ్యాప్తంగా 309, విదేశాల్లో 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్‌-1(బీఈ, బీటెక్‌), 12న పేపర్‌-2(బీ-ఆర్క్‌) పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు https://jeemain.nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్‌టీఏ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.


ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకి అదనపు బాధ్యతలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డి.కె.బాలాజీకి అప్పగించారు. ఆ శాఖ కమిషనర్‌గా ఉన్న నివాస్‌ కాకినాడ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దాంతో ఆయన బాధ్యతలను బాలాజీకి అప్పగిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


తాగునీటిని ఇతర అవసరాలకు వాడొద్దు

ప్రజలకు సీఎస్‌ జవహర్‌రెడ్డి విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.ఎస్‌.జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో తలెత్తిన తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని వాహనాలు, ఇళ్లు శుభ్రం చేయడానికి, మొక్కలకు తాగునీరు వాడొద్దని సూచించారు. సచివాలయంలో గురువారం ఆయన గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ‘కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలి. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రచారం చేయాలి. తాగునీటికి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉన్న ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలి. ఇందుకోసం సిద్ధం చేసిన యాప్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి’ అని అధికారులను ఆదేశించారు.


‘‘కంటెయినర్‌’ ఎందుకు వచ్చింది?’

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ తన ఇంటికి కంటెయినర్‌ ఎందుకు వచ్చిందో  సమాధానం చెప్పాలని రాష్ట్ర భాజపా మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం డిమాండ్‌ చేశారు. విజయవాడలో గురువారం ఆయన మాట్లాడుతూ అవినీతి సొమ్ముతో జగన్‌ రానున్న ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పురందేశ్వరిపై సీఎం నోరుపారేసుకుంటే తగిన బుద్ధి చెబుతామని అన్నారు.


పార్లమెంట్‌ ఎన్నికలను బహిష్కరించండి

సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: బూటకపు పార్లమెంట్‌ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనతా పార్టీని, దాని మిత్రపక్షాలను, ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈడీ, సీబీఐ, న్యాయ వ్యవస్థల స్వేచ్ఛను మోదీ దెబ్బతీశారని లేఖలో ఆరోపించారు.


ప్రత్యేక రైళ్ల పొడిగింపు: ద.మ.రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఐదు జతల ప్రత్యేక రైళ్లను మరికొద్దిరోజులు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం (నెం.08579/08580) రైళ్లను జూన్‌ 27 వరకు పొడిగించింది. తెలుగు రాష్ట్రాల పరిధిలో రాకపోకలు సాగించే విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం రైళ్లనూ జూన్‌ 25 వరకు, విశాఖపట్నం-కర్నూలు-విశాఖపట్నం రైళ్లను జూన్‌ 26 వరకు పొడిగించినట్లు తెలిపింది.


విశాఖ నుంచి నూతన విమాన సర్వీసులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు దేశీయ, రెండు విదేశీ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్‌ 9 నుంచి విశాఖపట్నం-బ్యాంకాక్‌(థాయ్‌లాండ్‌), 26 నుంచి కౌలాలంపూర్‌(మలేసియా)- విశాఖపట్నం, మార్చి 31 నుంచి విశాఖ-దిల్లీ, విశాఖ-హైదరాబాద్‌ సర్వీసులు నడుస్తాయని విమానాశ్రయవర్గాలు గురువారం వెల్లడించాయి.


డిప్యూటీ ఈఓ పరీక్ష వాయిదా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణ దృష్ట్యా ఏప్రిల్‌ 13న జరగాల్సిన విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌(డీవైఈఓ) ప్రాథమిక పరీక్షను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. దానిని మే 25న నిర్వహిస్తామని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.


జూన్‌ 11 నుంచి ఏపీపీఈసెట్ ఎంపికలు

ఎ.ఎన్‌.యు, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీఈసెట్ ఎంపికలను జూన్‌ 11 నుంచి నిర్వహిస్తున్నామని కన్వీనర్‌ ఆచార్య జాన్సన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో చేరే విద్యార్థులు మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్‌ వెల్లడించారు. రూ.500 అపరాధ రుసుంతో మే 22 వరకు, రూ.1,000 అపరాధ రుసుంతో మే 29 వరకు చెల్లించవచ్చన్నారు. మే 30, 31 తేదీల్లో సవరణకు అవకాశం కల్పించామని తెలిపారు. జూన్‌ 4 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని.. జూన్‌ 11 ఉదయం 6 గంటల నుంచి ఎంపికలు నిర్వహిస్తామన్నారు.


ఏపీ ఆర్‌సెట్‌ గడువు పెంపు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఏపీ ఆర్‌సెట్‌ (2023-24)కు మే 3వ తేదీ వరకు రూ.2,000, ఏప్రిల్‌ 6 వరకు రూ.5,000 అపరాధ రుసుంతో దరఖాస్తు గడువును పొడిగించినట్లు కన్వీనర్‌ డా.బి.దేవప్రసాదరాజు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ డా.హేమచంద్రారెడ్డి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్‌ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, మే 2 నుంచి 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.


పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించండి

డిఫెన్స్‌ సర్వీసుల్లోని సివిలియన్‌ ఉద్యోగుల వినతి

ఈనాడు, విశాఖపట్నం: రక్షణ రంగంలో పని చేస్తూ దూరప్రాంతాల్లో ఉంటున్న సివిలియన్‌ ఉద్యోగులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ కల్పించాలనే వినతులు పెరుగుతున్నాయి. ఈ అంశంపై పరిశీలన చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ పంపించనున్నట్లు విశాఖ డిఫెన్స్‌ మెటీరియల్‌ ఆర్గనైజేషన్‌ ఉద్యోగులు కొందరు తెలిపారు. రక్షణ రంగంలో పనిచేసే వారిలో సర్వీసు, సివిలియన్‌ అనే రెండు కేటగిరీలు ఉంటాయి. ఇందులో సర్వీసు కేటగిరీ ఉద్యోగులకు శాఖ తరఫున పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తారు. సర్వీసు ఉద్యోగులకు సహాయకులుగా పనిచేసే సివిలియన్‌ ఉద్యోగులకు మాత్రం పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం లేదు. వీరికి ఒక రోజు వేతనంతో కూడిన సెలవు కల్పిస్తారు. ‘దేశంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 1000-1200 కి.మీ. దూరం ప్రయాణించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక రోజు సరిపోదు. ఒకవేళ సొంత ఖర్చులతో వెళ్లాలన్నా పోలింగ్‌ ముందు, తర్వాత మరో రోజు సెలవులు పెట్టుకోవాల్సి ఉంటుంది. తక్కువ జీతాలు వచ్చే ఉద్యోగులు ఇంత సమయం, డబ్బులు ఖర్చు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లలేరు’ అని సివిలియన్‌ ఉద్యోగుల వాదన. ఎమర్జెన్సీ సర్వీసెస్‌ కింద దూర ప్రాంతంలో ఉంటున్న సివిలియన్‌ ఓటర్లకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పిస్తే ఏపీలో దాదాపు 20 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోగలుగుతారని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు