మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!

విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్‌ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు.

Updated : 29 Mar 2024 09:43 IST

ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను ‘బోధన’గా మార్పు
ఉన్నత విద్యామండలి కీలక అధికారి సహకారం
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్‌ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. వర్సిటీ విభాగాలపై ఒత్తిడి తెచ్చి, బోధనేతర సిబ్బందిని అధ్యాపకులుగా మార్చారు. దీనికి ఉన్నత విద్యా మండలిలోని ఓ కీలక వ్యక్తి సహకారం అందించారు. ఇప్పటికే ఆ అత్యున్నతాధికారి బినామీ పేర్లతో విశాఖలో భారీగా ఎసైన్డ్‌ భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. చిత్తూరు జిల్లాలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ద్రవిడ సాహిత్యం కోసం ప్రచురణల విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో అత్యున్నతాధికారి మేనల్లుడితో సహా 11మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. ఆయన మేనల్లుడు సహాయ డైరెక్టర్‌ హోదాలో ఉన్నారు. వాస్తవంగా వీరు ద్రవిడ భాష పుస్తకాల ముద్రణ చేపట్టాలి. మేనల్లుడికి లబ్ధి చేకూర్చేందుకు ఆయా బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చేందుకు అత్యున్నతాధికారి తన అధికారాన్ని వినియోగించారు. దీంతో డైరెక్టర్‌ పోస్టును ప్రొఫెసర్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌ను అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ఎడిటోరియల్‌ సహాయకులు, సహాయ డైరెక్టర్లు, సహాయ ఎడిటర్‌ పోస్టులను సహాయ ఆచార్యులుగా మార్పు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చేసింది.

నిబంధనల ఉల్లంఘన

ఉమ్మడి ఏపీలో 1999లో ఇచ్చిన ఉత్తర్వులు-208 ప్రకారం.. సహాయ ఆచార్యుల భర్తీకి దేశవ్యాప్తంగా ప్రకటన ఇచ్చి, నియామక ప్రక్రియ చేపట్టాలి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చకూడదని ఉమ్మడి ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యామండలికి 2007 మార్చి 23న ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ రెండింటికీ విరుద్ధంగా ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధన విభాగంలోకి మార్చారు. దీన్ని ఆడిట్‌ విభాగం మొదట తప్పుపట్టింది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత ఆడిట్‌ విభాగానికి  అభ్యంతరం ఏంటంటూ అత్యున్నతాధికారి ప్రశ్నించడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి.

గూడుపుఠాణీ

వర్సిటీలోని బోధనేతర పోస్టులను బోధన పోస్టులుగా మార్చేందుకు మొదట ఉన్నత విద్యామండలి తరఫున ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి, బాబివర్దన్‌లు సభ్యులుగా.. ఉన్నత విద్యా మండలికి చెందిన శ్రీరంగం మేథ్యూ కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్‌రెడ్డి ఇప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ అయ్యారు. ఈ కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలిలోని కీలక అధికారి చక్రం తిప్పారు. విద్యార్హతలు ఉన్నందున, బోధనేతర విభాగంలో పని చేస్తున్నప్పటికీ వీరు తరగతులు చెబుతున్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. పాఠాలు బోధిస్తున్నందున వీరిని ఆచార్యులుగా మార్చవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఆ నివేదికను వర్సిటీ పాలకవర్గంలో పెట్టి ఆమోదించేశారు. అనంతరం దాన్ని ప్రభుత్వానికి పంపి, బోధన పోస్టులుగా మార్చేశారు. అత్యున్నతాధికారి మేనల్లుడు ఒక్కరికే ప్రయోజనం కల్పిస్తే ఇబ్బందులు వస్తాయని, ఆ విభాగంలో పని చేస్తున్న 11 మందినీ మార్చారు. ప్రస్తుతం వీరు తమకు పదోన్నతులు కల్పించాలంటూ ఒత్తిడి చేస్తుండటం గమనార్హం.

ప్రచురణ విభాగంలో నియమించేందుకే ముగ్గురికి అర్హత లేదని, విద్యార్హతలు లేకుండా వారిని తీసుకున్నారని గతంలో ఇద్దరు విశ్రాంత వీసీలతో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికలో పేర్కొంది. దాని ప్రకారం.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి ఉండగా, ఇప్పుడు ఏకంగా బోధన పోస్టుల్లోకి తీసుకోవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని