రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.

Updated : 29 Mar 2024 06:38 IST

రాజకీయ పార్టీలను అన్నదాతలు నిలదీయాలి
వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది
చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు
విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేనిపక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు ఉండిపోయి రైతాంగానికి న్యాయం లభించదు. దీన్ని సాధించుకోవడానికి అన్నదాతల్లో రాజకీయ చైతన్యం రావాలి. ఇందుకోసం రైతు సంఘాలు పోరాడాలి. తమకు ఏం చేయబోతున్నారని రాజకీయ పార్టీలను రైతాంగం నిలదీయాల్సిన సమయం, సందర్భం వచ్చాయి’ అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా వీరవల్లిలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌(విజయ డెయిరీ) కొత్తగా నిర్మించిన ‘కామధేను’ యూనిట్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాల సంఘాల ప్రతినిధులు, రైతులతో నిర్వహించిన సమావేశంలో జస్టిస్‌ రమణ మాట్లాడుతూ... ‘రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెడుతున్న రైతుకు గుర్తింపు లేదు. ఈ ఆధునిక యుగంలో పారిశ్రామికీకరణ పెరిగాక వ్యవసాయం అంటరాని వృత్తిగా మారింది. అధికారంలో ఉన్న పార్టీలుగానీ, ప్రతిపక్షాలుగానీ దేశంలోని కోట్ల మంది రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాల్ని చేపట్టడం లేదు’ అని ఆయన అన్నారు. దేశంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించలేదని, చట్ట ప్రకారం అవసరమైన రక్షణ లేదని అన్నారు.

ఒక్కోసారి న్యాయవ్యవస్థా దుర్మార్గంగా ఆలోచిస్తుంది

ప్రస్తుతం వివిధ వ్యవస్థల్లో, ప్రత్యేకించి న్యాయవ్యవస్థలో వ్యవసాయదారుల కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు తక్కువగా ఉన్నారని, అక్కడ రైతుల గురించి ఒక్కోసారి చాలా దుర్మార్గంగా ఆలోచిస్తారని జస్టిస్‌ రమణ తెలిపారు. ‘ఒకసారి సుప్రీంకోర్టుకు.. ఒక రైతు భూమికి పరిహారం గురించిన కేసు వచ్చింది. నా సహచర న్యాయమూర్తి ఆ రైతు గురించి కొంత చులకనగా మాట్లాడారు. తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆ భూమికి ప్రభుత్వం ఎంతో కొంత పరిహారం ఇచ్చినప్పుడు ఆ రైతు సుప్రీంకోర్టు దాకా వచ్చి పోరాడాల్సిన అవసరమేమిటన్నట్లు వ్యాఖ్యలు చేశారు. భూమికి, రైతుకు మధ్య సంబంధం... తల్లికి బిడ్డకు మధ్య ఉండే అనుబంధం వంటిదని, రైతు భూమిని కోల్పోతే కుటుంబం సర్వస్వాన్నీ పోగొట్టుకున్నట్లు బాధపడతారని ఆ న్యాయమూర్తికి అర్థమయ్యేలా చెప్పడానికి నాకు ఒకరోజు పట్టింది. ఆయా నేపథ్యాల నుంచి వచ్చినవారు కీలక పోస్టుల్లో ఉన్నప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే రైతులు, రైతుకూలీల వంటి వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలంటున్నాను’ అని ఆయన చెప్పారు. 

చట్టసభల్లో రైతు ప్రతినిధులు లేకపోవడం వల్లే అన్యాయం

కొన్నేళ్లుగా చట్టసభల్లో రైతు ప్రతినిధులు లేకుండా పోవడం వల్లే రైతాంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1985 వరకు చట్టసభల్లో రైతుకు ప్రాధాన్యం ఉండేది. రాజకీయ పార్టీలు రైతు నాయకులకు టికెట్‌లు ఇచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించేవి. అన్నదాతలకు ప్రాధాన్యమిస్తున్నామని ఘనంగా చెప్పుకొనేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పారిశ్రామికవేత్తలు, ఉన్నత ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారు, ధనవంతులకే చట్టసభల్లో ప్రాతినిధ్యం లభిస్తోంది. ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు రైతుల ముసుగులో వచ్చి చట్టసభల్లో చెలామణీ అవుతున్నారు. ఇటీవల పార్లమెంటులో అనేక రైతు వ్యతిరేక చట్టాల్ని ఆమోదించారు. వాటిని ప్రశ్నించేవారు లేరు. వాటిపై ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా.. అవి తేలేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు’ అని జస్టిస్‌ రమణ చెప్పారు. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాదిన రైతు సంఘాల్లో ఐక్యత చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ‘కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం చేసిన కొన్ని చట్టాలు రైతులకు హాని చేస్తాయంటూ ఉత్తరభారతంలో అన్నదాతలు సంవత్సరంపాటు దిల్లీ వీధుల్లో చలి, ఎండ, వానల్ని భరిస్తూ, టెంట్‌లు వేసుకుని, పోలీసుల లాఠీ దెబ్బలు తిని పోరాటం చేశారు. ఆ చట్టాల్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేసిన ఘనత రైతు సంఘాలకు దక్కింది. ఈ రోజుకూ ఉత్తరభారతంలో రైతు సంఘాలన్నా, రైతు సమస్యలన్నా... అన్ని పార్టీలూ పట్టించుకుని న్యాయం చేస్తాయి.  దురదృష్టవశాత్తూ ఇక్కడ అలాంటి రైతు సంఘాలుగానీ, సంఘటిత శక్తిగానీ లేక బలహీనంగా కనిపిస్తున్నాం. కాబట్టే ప్రభుత్వాలు రైతుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

నా మూలాలు ఇక్కడే ఉన్నాయని మరువను

జస్టిస్‌ ఎన్‌.వి.రమణను కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పాలక మండలి ఘనంగా సన్మానించింది. మ్యాక్‌ చట్టాలపై జస్టిస్‌ రమణ గతంలో ఇచ్చిన తీర్పుల వల్లే ఈ రోజు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ నిలదొక్కుకోవడంతో పాటు, ఇంత పురోగతి సాధించిందని ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు కొనియాడారు. ‘దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినా నా మూలాలు కృష్ణా జిల్లాలోనే ఉన్నాయన్న విషయాన్ని మరవను. మనం ఎన్ని ఘన విజయాలు సాధించినా అంతిమంగా సొంతూరు, సొంత మనుషుల మధ్య సంబరం చేసుకోవడం, ఆనందించడం గొప్ప అనుభూతి’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.


లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సేవల్ని వినియోగించుకోవాలి

‘కొన్ని కంపెనీలు రోడ్లు వేసేటప్పుడు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా వారి భూముల్ని లాగేసుకున్న సందర్భాలున్నాయని కొందరు నా దృష్టికి తెచ్చారు. ఇలాంటి వారి సమస్యల్ని రైతు సంఘాలు పట్టించుకోవాలి. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ద్వారా ఖర్చు లేకుండానే న్యాయం పొందవచ్చు’ అని జస్టిస్‌ రమణ సూచించారు. రైతులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నారని, నిరంతరం ఎండల్లో.. క్రిమిసంహారకాల మధ్య పనిచేయడం వల్ల వారు క్యాన్సర్‌ వంటి వ్యాధుల బారినపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘రైతులకు సెలవు, విశ్రాంతి లేవు. హ్యాపీ ట్రిప్‌లు ఉండవు. రైతు పండిస్తే తినే దేశంలో రైతుకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పాను. ఇప్పుడున్న వాతావరణంలో, ప్రత్యేకించి ఎన్నికల సందర్భంలో ఇంకా ఎక్కువ మాట్లాడితే రాజకీయ కోణాల్లో ఆలోచించి దురుద్దేశాలు ఆపాదించే పరిస్థితి ఉంటుంది’ అని ఆయన అన్నారు. ‘మీ పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగులుగా, జడ్జీలుగా, పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలి. మీ తాత తండ్రుల నుంచి కొన్ని తరాలుగా మీరు సమాజానికి సేవ చేశారు. జీవితాల్ని త్యాగం చేశారు. ఇది మీరు అనుభవించాల్సిన సమయం’ అని రైతులనుద్దేశించి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని